వినోదం ఒక్కోసారి విషాదాన్ని కూడా నింపుతుంది. ఆదమరిచి ఆటలాడే సమయంలో అకస్మాత్తుగా ప్రమాదం పలకరిస్తుంది. ప్రాణాలు కూడా తీసుకుంటుంది. ఇటీవల అమ్యూజ్‌మెంట్ పార్కుల్లో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. థ్రిల్ కోసం వెళ్లే జనాలకు ‘థ్రిల్లర్’ సినిమా కళ్ల ముందు కనిపిస్తుంది. డబ్బులకు కక్కుర్తిపడే నిర్వాహకులు.. ప్రజల సేఫ్టీని గాలికి వదిలేయడంతో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. 


తాజాగా ఇండోనేషియాలోని కెంజెరన్ పార్క్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. వాటర్ స్లైడ్‌లో జర్రున జారుతూ పూల్‌లోకి వెళ్లాల్సిన జనం.. ఇక్కసారిగా నేలపై పడ్డారు. వాటర్ స్లైడ్‌ మధ్యలోకి విరిగిపోవడంతో 30 అడుగుల ఎత్తు నుంచి అమాంతంగా కిందపడ్డారు. సుమారు 16 మంది ఒకరిపై ఒకరు పడ్డారు. వీరిలో ఎనిమిది మందిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు ఎముకలు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. 


Also Read: చాక్లెట్లు తింటే చిన్న వయస్సులోనే చనిపోతారా? తాజా అధ్యయనంలో ఏం తేలింది?


ఈ ఘటన పార్క్ నిర్వాహకులు మాట్లాడుతూ.. ఆ స్లైడ్ వీక్‌గా ఉందని, ఒకరి కంటే ఎక్కువ మంది ఎక్కకూడదని హెచ్చరించినా ఎవరూ మాట వినలేదని తెలిపారు. అంతా ఒకేసారి స్లైడ్ చేయడం వల్ల ఓవర్ లోడ్ ఏర్పడి విరిగిపోయిందన్నారు. గత 9 నెలల నుంచి ఆ వాటర్ స్లైడ్‌కు మెయింటెనెన్స్ చేయడం లేదని డిప్యుటీ మేయర్ సురాబయా తెలిపారు. దీనిపై విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి పార్క్ యాజమాన్యమే బాధ్యత వహించాలని తెలిపారు. క్షతగాత్రులంతా పూర్తిగా కోలుకొనేవరకు చికిత్స ఖర్చులను నిర్వాహకులే భరించాలని ఆదేశించారు. ప్రస్తుతం ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలే వేసవి కాలం. మీరు కూడా వాటర్ స్లైడ్స్‌లో ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నట్లయితే.. తప్పకుండా తగిన జాగ్రత్తలు పాటించండి. 


Also Read: మీ చర్మం ఇలా మారుతుందా? జాగ్రత్త, ఈ లక్షణాలు కిడ్నీ సమస్యలకు సంకేతాలు



ఇటీవల యుఎస్‌లోని నార్త్ కరోలినాలోని కరోవిండ్స్ అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. గంటకు 50 మైళ్ల వేగంగా ప్రయాణిస్తున్న   రోలర్ కోస్టర్ అకస్మాత్తుగా నిలిచిపోయింది. ఆ రోలర్ కోస్టర్‌లో ఉన్న రైడర్లు సుమారు 45 నిమిషాల పాటు తలకిందులుగా వేడాల్సి వచ్చింది. రైడర్లు భయంతో కేకలు పెట్టారు. సాంకేతిక లోపం వల్ల రోలర్‌కోస్టర్ రైడ్‌ను మధ్యలోనే నిలిపివేసినట్లు తెలిసింది. లక్కీగా ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కానీ, 45 నిమిషాలపాటు తలకిందులుగా వేలాడటం వల్ల పలువురు అస్వస్థతకు గురయ్యారు.