రాత్రి నిద్ర 5 గంటల కంటే తక్కువగా ఉండేవారిలో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం మూడు వంతులు ఎక్కువగా ఉంటున్నట్టు ఒక అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనానికి దాదాపు 6.50 లక్షల మందిని ఎంపిక చేసి వారిలో నిద్రతో పాటు పెరిఫెరల్ ఆర్టరీ సమస్య తీవ్రతను కూడా పోల్చి చూశారు. రికమండ్ చేసిన 6-9 గంటల నిద్ర పోని వారికి ఈ ప్రమాదం పొంచి ఉందని ఈ అధ్యయనం వెల్లడించింది.
రాత్రి వేళల్లో ఏడెనిమిది గంటల పాటు నిద్ర పొయ్యేవారిలో ఫెరీఫెరల్ ఆర్టరీ డసీజ్ ప్రమాదం తగ్గుతుందని స్టాక్ హోమ్ లోని కరోలిస్కా ఇన్ స్టిట్యూట్ కు చెందిన డాక్టర్ షుయ్ యువాన్ అంటున్నారు. నిద్ర తక్కువగా ఉండే వారిలో పెరిపెరల్ ఆర్టరీ డిసీజ్ వచ్చే ప్రమాదం ఎక్కువ అని స్వీడన్ పరిశోధకులు ఒక అధ్యయనంలో పేర్కొన్నారు.
60 సంవత్సరాల పైబడిన వయసు వారిలో ప్రతి ఐదుగురిలో ఒకరు నిద్ర సమస్యలతో పోరాడుతున్నారు. ఇలా నిద్ర తగ్గడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. పొగతాగడం, మద్యం వంటి అలవాట్లున్నవారిలో డయాబెటిస్, బీపీ, కొలెస్ట్రాల్ సమస్యలు ఉండడం సర్వ సాధారణం. ఇప్పుడు నిద్ర సమస్యలు కూడా వీటికి తోడయ్యాయి. పెరీఫెరల్ ఆర్టరీ డిసీజ్ ఉన్నవారిలో కాళ్ల మీద వెంట్రుకలు రాలిపోవడం, నడుస్తున్నప్పుడు కాలి కండరాల్లో నొప్పి రావడం, తిమ్మిరిగా అనిపించడం, గోళ్లు పెళుసుగా మారడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
ఇదివరకు జరిగిన అనేక అధ్యయనాలు చాలినంత నిద్ర లేకపోవడం వల్ల గుండెజబ్బుల ప్రమాదం పెరుగుతుందని నిరూపించాయి. గుండె జబ్బుకు రక్తనాళాల్లో ఏర్పడే అడ్డంకులు కూడా కారణం అవుతాయి. పెరీఫెరల్ ఆర్టరీ డిసీజ్ పేషెంట్లలో వీటన్నింటికి తోడుగా నిద్ర సమస్యలు కూడా ఉంటున్నాయి.
యూరోపియన్ హార్ట్ జర్నల్ - ఓపెన్ లో ఈ సమస్యలో నిద్ర పాత్ర గురించి ప్రస్తావించారు. నిద్ర తగ్గడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందా లేక ఈ పరిస్థితి వల్ల నిద్ర తగ్గిందా అనే విషయం మీద పరిశోధకులు దృష్టి నిలిపారు. పెరీఫెరల్ ఆర్టరీ డిసీజ్ రావడానికి నిద్ర ఎంత వరకు కారణం అనేది అంచనా వెయ్యడానికి పరిశోధనకు ఎంచుకున్న వారి జన్యు డేటాను విశ్లేషించారు. ఈ విశ్లేషణలో ఏడెనిమిది గంటల కంటే తక్కువ నిద్రపోయేవారిలో ఈ జబ్బు ప్రమాదం దాదాపు రెట్టింపు అయినట్లు నిర్ధారించారు.
జన్యుడేటా విశ్లేషణలో నిద్ర తక్కువగా ఉన్న వారికి జబ్బు ప్రమాదం ఎలాగూ ఉంటుంది. జబ్బు ఉన్న వారిలో కూడా నిద్ర తక్కువగా ఉంటున్నట్టు నిర్ధారించారు. నిద్ర లేమి, పెరీఫెరల్ ఆర్టరీ డిసీజ్ రెండూ కూడా ఒకేలాంటివని డాక్టర్ యువాన్ వెల్లడించారు. చురుకైన జీవన శైలి కలిగి ఉండడం ద్వారా నిద్ర సమయాన్ని పెంచుకోవచ్చు. అలాగే పెరీఫెరల్ ఆర్టరీ డిసీజ్ ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చు. పెరీఫెరల్ ఆర్టరీ డిసీజ్ ఉన్న వారిలో నొప్పి తగ్గేందుకు మందులు వాడడం వల్ల కూడా రాత్రిపూట నిద్ర నాణ్యత పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.