అధికబరువు సమస్యగా మారింది. చెడు జీవనశైలి కారణంగా, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా కొంతమంది బరువు పెరిగిపోతున్నారు. బరువు తగ్గడానికి ఆహారం, వ్యాయామంతో పాటూ లైఫ్‌స్టైల్‌లో కూడా మార్పులు చేసుకోవాలి. రోజువారీ జీవితంలో చిన్నచిన్న మార్పుల ద్వారా బరువును సులువుగా తగ్గించుకోవచ్చు. బరువు తగ్గాలనుకుంటే కచ్చితంగా ఉదయన చేయాల్సిన పనులు నాలుగు ఉన్నాయి. వీటిని కచ్చితంగా పాటిస్తే మీకు నెల రోజుల్లో మంచి ఫలితం కనిపిస్తుంది. 


తెల్లవారుజామునే లేవడం
చాలా మంది ఉదయం ఎనిమిది దాటితే కానీ నిద్ర లేవరు. ఇది చాలా చెడు లక్షణం. ఇలా లేచాక మీరెంత కష్టపడినా బరువు తగ్గలేరు. ఉదయం ఆరు గంటల్లోపే లేవడం అలవాటు చేసుకోవాలి. రోజుకు ఎనిమిది గంటల నిద్ర చాలా అవసరం కాబట్టి మీరు ఆరు గంటలకే లేవాలంటే రాత్రి పది గంటలకే నిద్రపోవాలి. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం వల్ల జీవక్రియలు సక్రమంగా పనిచేస్తుంది. ఉదయాన్నే లేవడం శరీరం ఉత్తేజంగా ఉంటుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. వర్కవుట్లు, ఆహారం విషయంలో శ్రద్ధ చూపడానికి తగినంత సమయం కూడా మిగులుతుంది.


ధ్యానం 
రోజూ కనీసం పది నుంచి పదిహేను నిమిషాలు ధ్యానం చేస్తే చాలా మంచిది. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ఆ రోజును ఎదుర్కోడానికి సిద్ధపడుతుంది. ధ్యానం మీ అంతర్గత శక్తిని మరింత ప్రొడక్టవిటి వైపు నడిపించి సానుకూల ఫలితాలు వచ్చేలా చేయడానికి సహాయపడుతుంది. ధ్యానం ఒత్తిడి, ఆందోళనను తగ్గించేందుకు సహాయపడుతుంది. ఇది పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. హృదయ స్పందన రేటును నియంత్రిస్తుంది. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.


గ్లాసు నీళ్లు
ఉదయాన లేచిన వెంటనే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగితే చాలా మంచిది. ఉదయాన్నే గోరువెచ్చటి నీటిని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ పనిలో పడుతుంది. ఇది జీవక్రియను మెరుగుపరస్తుంది. ఆ వెచ్చని నీరు ముక్కును క్లియర్ చేస్తుంది. కేంద్రనాడీ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 


అల్పాహారంగా
టిఫిన్ మనం రోజులో తినే మొదటి భోజం. ఉదయం పూట అధిక ప్రోటీన్లు కలిగిన అల్పహారాన్ని తీసుకోవాలని చెబుతారు ఆరోగ్య నిపుణులు. అధిక ప్రోటీన్లు ఉండే ఆహారం తినడం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. వ్యాయామం చేయడానికి సహకరిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మొత్తం బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. 


వ్యాయామాలు
సాయంత్రం సమయంలో చేసే వ్యాయామాల కన్నా ఉదయం పూట చేసే వ్యాయామాలే మంచి ఫలితాలను ఇస్తాయి. నిద్రవ్యవస్థను కూడా ఇవి మెరుగుపరుస్తాయి.ఖాళీ పొట్టతో వ్యాయమం చేయడం వల్ల అధిక శాతం కొవ్వు కరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఖాళీ పొట్టతో వ్యాయామం చేసినప్పుడు మీ శరీరం నిల్వ ఉన్న కొవ్వులను కరిగించి శక్తిగా మార్చుకుంటుంది. దీని వల్ల బరువు తగ్గుతారు. 


Also read: రోజుకో గుడ్డు తింటే గుండెపోటు వచ్చే అవకాశం తగ్గుతుంది, కొత్త అధ్యయన ఫలితం




Also read: అబ్బాయిలు జర జాగ్రత్త, వీటిని తింటే సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది