Benefits of Walking After Meals : కొందరు ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసినా చేయకపోయినా.. మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసిన తర్వాత కచ్చితంగా వాక్ చేస్తారు. అయితే ఇది మంచిదని కూడా చాలామంది నిపుణులు చెప్తున్నారు. పలు అధ్యయనాలు కూడా దీని ఫలితాలు ఆరోగ్యానికి మంచి చేస్తాయని తెలిపాయి. అయితే అసలు తిన్నాక వాకింగ్ చేయాలనుకుంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి తెలుసా? అప్పుడే మీరు మంచి ఫలితాలు పొందగలరు. అసలు భోజనం తర్వాత వాకింగ్ ఎలా చేయాలి? ఎంతసేపు వాక్ చేస్తే మంచిది? గుర్తించుకోవాల్సిన విషయాలు ఏంటో చూసేద్దాం. 


తిన్న తర్వాత వాక్ చేస్తే కలిగే లాభాలు ఇవే


భోజనం చేసిన తర్వాత ఎటూ కదలకుండా కూర్చోవడం లేదా పడుకోవడం అతి పెద్ద మిస్టేక్ అని మీకు తెలుసా? అలా కాకుండా కాసేపు వాక్ చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా కేలరీలు బర్న్ అవుతాయి. తిన్న తర్వాత వాకింగ్ చేస్తే.. మీరు తీసుకున్న ఆహారం ఫ్యాట్​గా కాకుండా ఎనర్జీగా మారుతుంది. దీనివల్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఏర్పడదు. తిన్న తర్వాత కొందరికి గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుంది. లేదా యాసిడ్ రిఫ్లక్స్ వస్తాయి. ఆ సమస్యను దూరం చేసుకోవాలనుకుంటే నడక బెస్ట్ ఆప్షన్. ఇది కడుపు ఉబ్బరాన్ని దూరం చేసి.. జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. 


భోజనం తర్వాత నడవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్యాట్ స్టోరేజ్ కాకుండా అడ్డుకుని ఇన్సులిన్ సెన్సిటివిటీని అదుపులో ఉంచుతాయి. దీనివల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది. పలు రీసెర్చ్​లు కూడా దీనికి మద్ధతునిచ్చాయి. అలాగే మెటబాలీజం పెరిగి.. శరీరానికి రక్త ప్రసరణ మెరుగ్గా అందుతుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 


వాకింగ్ చేసేప్పుడు చేయకూడని మిస్టేక్స్ ఇవే.. 


తిన్న తర్వాత వాకింగ్ చేసేప్పుడు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. భోజనం చేసిన వెంటనే పరుగెత్తడం, జాగింగ్ లాంటివి చేయకూడదు. ఇలా చేస్తే మీరు జీర్ణక్రియ మందగిస్తుంది. అంతేకాకుండా నొప్పులు వస్తాయి. యాసిడ్ రిఫ్లక్స్ పెరుగుతాయి. కాబట్టి మెల్లగా వాక్ చేయండి. తినకముందు స్పీడ్​ వాక్, జాగింగ్, రన్నింగ్ మంచివి కానీ.. తిన్న తర్వాత జస్ట్ వాక్ చేస్తే సరిపోతుంది. 


ఎంతసేపు వాక్ చేయాలి.. 


తిన్న తర్వాత వాక్ చేయాలనుకుంటే ఎక్కువసేపు సమయం అవసరం లేదు. మెల్లిగా ఓ పది నుంచి పదిహేను నిమిషాలు నడిచినా మంచిదే. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు జరిగి.. మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి తిన్న వెంటనే మంచి ఫలితాలు కావాలనుకుంటే స్పీడ్​ వాక్​, ఎక్కువ సమయం వాక్ చేయడం మానేసి.. రిలాక్స్​గా పావుగంట వాక్ చేసేయండి. 


ఉదయం, సాయంత్రం మీరు ఖాళీ కడుపుతో ఎక్కువ సమయం వాక్ చేయవచ్చు. అలాగే జాగింగ్, పరుగెత్తడం కూడా చేయవచ్చు. ఇది మీ మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బరువును అదుపులో ఉంచి.. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు రాకుండా.. అప్పటికే ఉన్నవాటిని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. 






గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.