పంజాబ్ లో కొంత మంది అందాల పోటీలు నిర్వహించాలి అనుకున్నారు. ఈ నెలలోనే  అందాల పోటీలను నిర్వహించేందుకు  భారీగా ఏర్పాట్లు మొదలు పెట్టారు. ఈ పోటీల గురించి జనాలకు తెలియాలనే ఉద్దేశంతో  పలు చోట్ల పోస్టర్లు వేయించారు. ఈ పోస్టర్లే ఇప్పుడు పెద్ద తలనొప్పులు తెచ్చి పెట్టాయి.  ఈ విషయం ఆ నోట ఈ నోట పడి ఏకంగా పోలీసులు దగ్గరికి వెళ్లింది. ఖాకీలు  నిర్వహకులపై కేసు బుక్ చేసి విచారణ మొదలు పెట్టారు. ఇంతకీ నిర్వాహకులు ఆ పోస్టర్లలో ఏం రాశారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


పోటీల్లో గెలిస్తే కెనడియన్ ఎన్నారైతో పెళ్లి!


బటిండాలోని స్వీట్ మిలన్ హోటల్‌ లో అక్టోబరు 23న అందాల పోటీలు నిర్వహించబోతున్నట్లు ఈ పోస్టర్లలో నిర్వాహకులు వెల్లడించారు. అంతేకాదు, ఈ అందాల పోటీల్లో విజయం సాధించిన అమ్మాయికి కెనడాకు చెందిన ఎన్నారైతో వివాహం చేయిస్తామని బంఫర్ ఆఫర్ ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రచారం చేసేలా బటిండా నగరవ్యాప్తంగా ఈ పోస్టర్లను అంటించారు. ఈ పోస్టర్ లో మరో కీలక విషయాన్ని రాశారు.  సాధారణ కులానికి చెందిన అమ్మాయిలకు మాత్రమే ఈ పోటీలు అని పేర్కొన్నారు. ఈ ప్రకటన చూసిన జనాలు తీవ్ర విమర్శలు చేశారు. ఈ పోస్టర్లకు సంబంధించిన ఫోటోలు కాసేపట్లోనే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.


నిర్వాహకులపై వ్యతిరేకంగా మహిళా సంఘాలు గుర్రు


మరోవైపు ఈ అందాల పోటీల వ్యవహారంపై మహిళా సంఘాలు రంగంలోకి దిగాయి. ఇలాంటి ప్రకటనలతో మహిళలను అవమానించడం క్షమించరాని నేరమని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. నిర్వాహకులు కుల వివక్షను పెంచడంతో పాటు మహిళలను అవమానించేలా ఈ పోస్టర్లు వేశారని మండిపడుతున్నారు. అటు పోస్టర్లలో వేసిన ఫోన్ నెంబర్ల ద్వారా నిర్వాహకులను సంప్రదించేందుకు ప్రయత్నించారు. అయితే, ఇందులో వెల్లడించిన రెండు ఫోన్ నెంబర్ల ప్రస్తుతం పని చేయకపోవడం విశేషం.  


నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు


మరోవైపు ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సదరు నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు. నిర్వాహకులను కనుగొనే పనిలో పడ్డారు. మరోవైపు ఈ అందాల పోటీలకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని స్వీట్ మిలన్ హోటల్ యజమాని వెల్లడించారు. తమ హోటల్ పేరు ఎలాంటి అనుమతి లేకుండా వాడుకోడం పట్ల చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నమని వెల్లడించారు.



Also Read: డిసెంబర్ లో భూమ్మీదకు గ్రహాంతరవాసులు, మార్చిలో మెగా సునామీ! టైమ్ ట్రావెలర్ సంచలన అంచనాలు నిజమయ్యేనా?