Key Differences of Vaping vs Smoking : కొందరు వేపింగ్ చేస్తున్నాను కాబట్టి సిగరెట్టు మానేయగలిగాను.. ఇప్పుడు నేను సేఫ్‌ అనుకుంటారు. కానీ ఇది పూర్తిగా తప్పు. ఎందుకంటే స్మోకింగ్, వేపింగ్ రెండూ వేర్వేరు పద్ధతులే అయినా.. రెండూ శరీరానికి హాని చేస్తాయి. కేవలం తేడా ఏదైనా ఉంది అంటే.. హాని చేసే తీరు వేరుగా ఉంటుంది. అవేంటో పూర్తిగా తెలుసుకుందాం.

Continues below advertisement

స్మోకింగ్ అంటే 

పొగాకు కాల్చడం ద్వారా వచ్చే పొగను పీల్చడమే స్మోకింగ్. సిగరెట్టు, బీడీ, సిగార్ ఇవన్నీ స్మోకింగ్ కోవకు వస్తాయి. పొగాకు వెలిగించినప్పుడు 4,000కు పైగా రసాయనాలు విడుదలవుతాయి. వాటిలో 70కి పైగా క్యాన్సర్ కారకాలు ఉంటాయి.

వేపింగ్ అంటే 

బ్యాటరీతో నడిచే పరికరంలో లిక్విడ్‌ను వేడి చేసి ఆవిరి రూపంలో పీల్చడమే వేపింగ్. ఈ లిక్విడ్‌లో నికోటిన్, సువాసన రసాయనాలు, ప్రొపిలీన్ గ్లైకాల్ ఉంటాయి. పొగ లేదు కాబట్టి హాని లేదు అనుకుంటారు చాలామంది. కానీ ఆవిరిలో కూడా హానికరమైన రసాయనాలు ఉంటాయి.

Continues below advertisement

స్మోకింగ్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు..

పొగాకు కాలినప్పుడు వచ్చే టార్, కార్బన్ మోనాక్సైడ్ ఊపిరితిత్తులను నేరుగా దెబ్బతీస్తాయి. దీర్ఘకాలంలో లంగ్ క్యాన్సర్, COPD వంటి తీవ్రమైన వ్యాధులు వస్తాయి. రక్తనాళాలు గట్టిపడతాయి, గుండెపోటు ప్రమాదం చాలా అధికంగా ఉంటుంది.

వేపింగ్ వల్ల వచ్చే సమస్యలు

వేపింగ్​లో టార్ ఉండదు కానీ.. ఆవిరిలోని కెమికల్స్ ఊపిరితిత్తుల లోపలి పొరను దెబ్బతీస్తాయి. EVALI అనే ప్రత్యేక వ్యాధి వేపింగ్ వల్లనే వస్తుందని వైద్య నిపుణులు నిర్ధారించారు. నికోటిన్ వల్ల గుండె వేగంగా కొట్టుకుంటుంది, రక్తపోటు పెరుగుతుంది. గుండె సమస్యలు తక్కువ కాలంలోనే వస్తున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి.

స్మోకింగ్, వేపింగ్ కూడా నికోటిన్ ద్వారా మెదడును ప్రభావితం చేస్తాయి. అయితే వేపింగ్‌లో నికోటిన్ మోతాదు అధికంగా ఉండవచ్చు కాబట్టి యువతలో మెదడు అభివృద్ధి మరింత దెబ్బతింటుంది. అది వ్యసనంగా మారుతుంది. రెండింటిలోనూ నికోటిన్ ఉన్నందున వ్యసనం తప్పదు. వాపింగ్‌లో సువాసనలు, ఆకర్షణీయంగా ఉండి యువత మరింత వేగంగా వేపింగ్​ వ్యసనానికి లోనవుతున్నారు.

వేపింగ్ స్మోకింగ్ కంటే సేఫా?

ఈ ప్రశ్నకు వైద్య నిపుణుల సమాధానం "వేపింగ్ స్మోకింగ్ కంటే తక్కువ హానికరం అని చెప్పవచ్చు. కానీ సురక్షితం అని మాత్రం చెప్పలేం!" అంటున్నారు. స్మోకింగ్‌తో పోల్చితే వేపింగ్‌లో రసాయనాల సంఖ్య తక్కువ. కానీ వేపింగ్ కొత్తది కాబట్టి దీర్ఘకాలిక దుష్ప్రభావాలు ఎక్కువగానే ఉన్నాయి. రాబోయే సంవత్సరాల్లో మరిన్ని తీవ్రమైన సమస్యలు వెలుగులోకి రావచ్చు. కాబట్టి సిగరెట్టు మానడానికి వేపింగ్ చేయడం మంచిది కాదని అంటున్నారు. సిగరెట్టు మానాలంటే వైద్యుని సలహాతో నికోటిన్ పాచెస్, కౌన్సెలింగ్ తీసుకోవడం మంచిది. 

ఇండియాలో రూల్స్..

స్మోకింగ్ పబ్లిక్ ప్రదేశాల్లో నిషేధం. కానీ వ్యక్తిగత వినియోగం చేసుకోవచ్చు. వేపింగ్ 2019లో పూర్తిగా నిషేధించారు. దీని తయారీ, విక్రయం, దిగుమతి అన్నీ చట్టవిరుద్ధమే. మొదటిసారి పట్టుబడితే 1 లక్ష జరిమానా లేదా జైలు శిక్ష విధించవచ్చు.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.