Big Problems with Old Pillow : మంచి నిద్ర కోసం చాలామంది మంచం, పరుపుపై ఎక్కువ శ్రద్ధ పెడతారు. కానీ దిండు విషయంలో మాత్రం చాలా నిర్లక్ష్యం చేస్తారు. ఒకే దిండును సంవత్సరాల పాటు వాడుతుంటారు. కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదని చెప్తున్నారు నిపుణులు. మరి దిండును ఎంతకాలానికి మార్చాలి? ఎక్కువ రోజులు వాడితే కలిగే నష్టాలు ఏంటో.. దిండు ఎంచుకునేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దిండును ఎంతకాలానికి మార్చాలి?
దిండును 1 నుంచి 2 సంవత్సరాలకోసారి మార్చడం మంచిదని చెప్తున్నారు. పిల్లో ఆకారం మారినా మార్చేయాలంటున్నారు. సపోర్ట్ తగ్గితే వెంటనే మార్చాలని లేకుంటే అలర్జీలు, మెడ నొప్పి సమస్యలు పెరుగుతాయని అంటున్నారు. ఇవే కాకుండా ఎక్కువ రోజులు ఒకే దిండు వాడితే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. అవేంటంటే..
అలర్జీలు
పాత దిండు ఉపయోగిస్తూ ఉంటే.. అలర్జీలు పెరుగుతాయి. ఎందుకంటే పిల్లో ఎక్కువకాలం వాడితే దానిలో దుమ్ము, డస్ట్ మైట్స్, బ్యాక్టీరియా పెరుగుతాయి. దీనివల్ల తుమ్ములు, దగ్గు, అలర్జీలు వస్తాయి.
చర్మ సమస్యలు
దిండులో పేరుకుపోయిన మురికి వల్ల చర్మ సమస్యలు వస్తాయి. మొటిమలు, స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
మెడ, వెన్నునొప్పి
పాత దిండు మెడకు సరిగ్గా సపోర్ట్ ఇవ్వదు. మెడకు సరైన సపోర్ట్ లేకపోవడం వల్ల నొప్పులు వస్తాయి. ఎక్కువకాలం వినియోగిస్తే.. ఈ సమస్య తీవ్రతరం అవుతుంది.
బ్యాక్టీరియా పెరుగుదల
దిండు చాలా కాలం వాడితే చెమట, నూనె, మురికి పెరిగి.. బ్యాక్టీరియా పెరుగుదలకు కారణమవుతుంది. ఇది హైజీన్ సమస్యలకు దారితీస్తుంది.
నిద్ర నాణ్యత
సరైన సపోర్ట్ లేకపోతే నిద్ర సరిగా పట్టదు. దీంతో ఉదయం అలసటగా అనిపిస్తుంది. క్రమంగా నిద్ర నాణ్యత తగ్గుతుంది.
దిండు ఎంచుకునేప్పుడు ఫాలో అవ్వాల్సిన టిప్స్
మెడకు సరైన సపోర్ట్ ఇచ్చే దిండును ఎంచుకోవాలి. మెమరీ ఫోమ్, మెడకు బాగా సపోర్ట్ ఇచ్చే దిండు ఎంచుకోవాలి. కాటన్లో తీసుకుంటే సాఫ్ట్, కంఫర్ట్ ఉండేలా.. బడ్జెట్ ఫ్రెండ్లీ పిల్లోలు బెస్ట్. స్లీపింగ్ పొజిషన్‌కు సరిపోయే విధంగా ఎంచుకోవాలి. పక్కగా పడుకునేవారు.. కొంచెం ఎత్తుగా ఉండే దిండు.. వెనుకగా పడుకునేవారు మీడియం హైట్, బోర్లా పడుకునేవారు పలుచని దిండు ఎంచుకోవాలి. అలర్జీలు ఉండేవారికి హైపోఅలర్జెనిక్ దిండు ఎంచుకోవాలి.
దిండును ఎలా క్లీన్ చేయాలంటే..
దిండు కవర్ ప్రతి వారం మార్చండి. 2–3 నెలలకు ఒకసారి దిండు వాష్ చేయండి. సూర్యరశ్మిలో ఎండబెట్టండి. దిండు అనేది చిన్న విషయమే అనిపించినా.. ఇది మీ నిద్ర, ఆరోగ్యంపై పెద్ద ప్రభావం చూపుతుంది. కాబట్టి పాత దిండును ఎక్కువ కాలం వాడకుండా.. సరైన సమయానికి మార్చడం చాలా ముఖ్యం. మంచి దిండు ఎంచుకుంటే నిద్ర నాణ్యత కూడా మెరుగుపడుతుందని గుర్తించుకోవాలి.
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
