Avoid Online Fraud : ఈ రోజుల్లో ఫోన్ తీసుకుంటే చాలు.. చెల్లింపులు, షాపింగ్, బ్యాంకింగ్ అన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. ఇది పనిని చాలా సులభతరం చేసింది. కానీ దానితో పాటు ప్రమాదాన్ని కూడా అంతే వేగంగా పెంచింది. చిన్న చిన్న క్లిక్‌ల వల్ల ఎందరో పెద్ద మొత్తంలో డబ్బును కోల్పోతున్నారు. మోసం చేసేవారు కూడా మునుపటి కంటే చాలా తెలివిగా తయారయ్యారు. డబ్బులు దోచుకునేందుకు కొత్త పద్ధతులను ఉపయోగిస్తున్నారు. 

Continues below advertisement

మీరు ఇలాంటి ట్రాప్లో పడకుండా ఉండాలంట కొన్ని ప్రాథమిక విషయాలను గుర్తుంచుకుంటే చాలు. వాటివల్ల మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవచ్చు. మీరు ప్రతిరోజూ ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తే.. ఈ 5 విషయాలు మీకు చాలా అవసరమని చెప్తున్నారు సైబర్ నిపుణులు. 

పాస్‌వర్డ్‌ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పాస్‌వర్డ్‌ల విషయంలో చాలామంది చేసే మొదటి తప్పు ఒకటి ఉంది. పాస్​వర్డ్ మరిచిపోతామని.. ఒకే పాస్‌వర్డ్‌ను అన్నింటికీ ఉపయోగిస్తారు. అలాగే ఈజీగా గుర్తుంచుకునేందుకు సింపుల్ పాస్​వర్డ్స్ సెట్ చేసుకుంటారు. ఇదే పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని చెప్తున్నారు నిపుణులు. కాబట్టి ప్రతి ఖాతాకు ప్రత్యేకమైన, బలమైన పాస్‌వర్డ్‌ను పెట్టుకోవాలని సూచిస్తున్నారు. అలాగే టూ స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకోవడం మంచిదని చెప్తున్నారు. అదనంగా మీ ఫోన్, ల్యాప్‌టాప్‌లో వచ్చే భద్రతా అప్​డేట్స్ వాయిదా వేయకూడదు. ఈ అప్​డేట్స్ వల్ల మీ పరికరాన్ని కొత్త ప్రమాదాల నుంచి కూడా కాపాడుకోవచ్చు. 

Continues below advertisement

సోషల్ మీడియాలో షేరింగ్ 

చాలామంది సోషల్ మీడియాలో తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని షేర్ చేస్తారు. ఈ సమాచారం స్కామర్‌లకు బాగా ఉపయోగపడుతుంది. చాలాసార్లు మోసగాళ్లు మీరు తెలిసిన వారిగా నటించి మీ నమ్మకాన్ని పొందుతారు. దాంతో మీ ఇంట్లోని వృద్ధులను లక్ష్యంగా చేసుకుంటారు. కాబట్టి మీ, మీ కుటుంబ సభ్యుల వ్యక్తిగత సమాచారాన్ని ఎంత తక్కువగా షేర్ చేస్తే అంత సురక్షితంగా ఉంటారు.

తెలియని లింక్‌లు క్లిక్ చేయకండి

ఫిషింగ్ అనేది నేడు అత్యంత సాధారణ పద్ధతిగా మారింది. మీకు లింక్ ఉన్న ఇమెయిల్ లేదా మెసేజ్​ వస్తుంది. దానిని మీరు క్లిక్ చేసిన వెంటనే మీ డేటా నేరగాళ్లకు చేరుకుంటుంది. ఇటువంటి సందేశాలు తరచుగా భయపెట్టే లేదా ఆకర్షించేవిగా ఉంటాయి. ఏదైనా లింక్ అనుమానాస్పదంగా అనిపిస్తే.. దానిపై క్లిక్ చేయకుండా ఉండండి. ఎల్లప్పుడూ ఇమెయిల్ ID, సందేశ భాషను చెక్ చేసుకోండి. అంతేకానీ లింక్ క్లిక్ చేయకండి.

VPN, ప్రత్యేక ఇమెయిల్ 

మీరు తరచుగా వివిధ వెబ్‌సైట్‌లలో ఖాతాలను క్రియేట్ చేస్తే.. మీ వ్యక్తిగత ఇమెయిల్ IDని ప్రతిచోటా ఉపయోగించవద్దు. దీని కోసం ఇమెయిల్ మాస్కింగ్ లేదా ప్రత్యేక ఇమెయిల్ ఉపయోగించడం మంచిది. అదే సమయంలో VPNని ఉపయోగించడం వలన మీ ఆన్‌లైన్ గుర్తింపు చాలా వరకు దాగి ఉంటుంది. అయితే ఇది పూర్తి భద్రతను అందించదు. కానీ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

యాంటీవైరస్‌ వినియోగం

ఇంటర్నెట్ నుంచి ఏదైనా డౌన్‌లోడ్ చేసేటప్పుడు జాగ్రత్త చాలా ముఖ్యం. చాలా ఫైల్‌లతో మాల్వేర్ కూడా రావచ్చు. ఇది మీ డేటాను దెబ్బతీస్తుంది. కాబట్టి మీ పరికరంలో మంచి యాంటీవైరస్‌ను కలిగి ఉండండం ముఖ్యం. ఇది అనుమానాస్పద ఫైల్‌లను గుర్తించి వాటిని బ్లాక్ చేయవచ్చు లేదా క్వారంటైన్ చేయవచ్చు. కాబట్టి ఎల్లప్పుడూ నమ్మదగిన వెబ్‌సైట్ నుంచి మాత్రమే ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయండి. తద్వారా ఎటువంటి ప్రమాదం ఉండదు.