వర్షాకాలం వచ్చిందంటే చాలు మనల్ని రోగాలు చుట్టుముడతాయి. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. దాన్ని పెంపొందించుకోవడం కోసం సిట్రస్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. ఇందులో ఉండే విటమిన్ సి మనలో రోగనిరోధక శక్తి పెంచేందుకు దోహదపడుతుంది. మార్కెట్లోకి ఆరెంజ్, నిమ్మకాయ వంటి ఎన్నో రకాల సిట్రస్ ఫుడ్ అందుబాటులోకి వచ్చాయి. నారింజ కాయలు తినడం వాటితో జ్యూస్ చేసుకుని తాగడం చేస్తాం. అయితే నారింజ తొక్కలని మాత్రం తీసి బయట పడేస్తాం. కానీ నారింజ తొక్కతో చాలా ఉపయోగాలు ఉన్నాయాండోయ్. చర్మ సౌందర్యానికి, కిచెన్ శుభ్రం చేసుకోవడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. మరీ అవేంటో తెలుసుకుందామా.. 


నారింజ తొక్క లాభాలు 


నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. చాలా మంది కాయ తిని దాని తొక్కని మాత్రం పారేస్తారు. కానీ ఆ తొక్కలో కూడా విటమిన్ సి ఉంటుందండోయ్. ఈ పండు తొక్కలో పొలిఫినాల్స్ ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులకి ఇది మంచి ఔషధం లాగా పని చేస్తుంది. డయాబెటిస్, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధుల మీద పోరాడేందుకు సహాయపడుతుంది. నారింజ పండులో కంటే తొక్కలోనే పొలిఫినాల్స్ ఎక్కువగా ఉంటాయని ఒక రీసెర్చ్ లో తేలింది. చర్మ కాన్సర్ నుంచి పోరాడేందుకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది. అంతే కాదు ఇందులో ఉండే పీచు పదార్థం జీర్ణ ప్రక్రియ మెరుగుపడేందుకు దోహదపడుతుంది. 


మెరిసే చర్మం కోసం.. 


నారింజ తొక్కతో మన చర్మం మెరిసిపోయేలాగా చేసుకోవచ్చు. తొక్కలని ఎండలో కొద్ది రోజులు ఎండబెట్టిన తర్వాత వాటిని మెత్తగా పొడి చేసుకుని పెట్టుకోవాలి. ఆ పొడిని పెరుగుతో కలిపి ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవచ్చు. ఇలా చెయ్యడం వల్ల మొహం మీద మొటిమల వల్ల ఏర్పడే మచ్చలు తొలగిపోవడమే కాకుండా, చర్మంలోని మృత కణాలని కూడా తొలగిస్తుంది. రోజు నారింజ పొడితో మర్దన చేసుకోవడం వల్ల మొహం మెరిసిపోతుంది.


రూమ్ ఫ్రెషనర్.. 


గది మంచి సువాసన వచ్చేందుకు మార్కెట్లో దొరికే వాటిని ఉపయోగించడం ఇష్టం లేకపోతే నారింజ తొక్కలతో రూమ్ ఫ్రెషనర్ ట్రై చేయవచ్చు. నారింజ తొక్కలను వేడి నీటిలో కొద్దిగా సుగంధ ద్రవ్యాలు వేసి బాగా మరిగించాలి. మీ వంటింట్లో వెనిగర్ ఉంటే ఇంకా మంచిది. దాని ఆ నీటిలో వేసి కొద్దిసేపు తక్కువ మంట మీద మరిగించాలి. ఆ ద్రవాన్ని ఫ్రెషనర్ కి ఉపయోగించే డబ్బాలో వేసుకుంటే కిచెన్ మంచి వాసన వస్తుంది.  


కిచెన్ క్లీనర్.. 


నారింజ తొక్కలు కిచెన్ క్లీనర్ గా కూడా ఉపయోగపడతాయి. ఒక సీసాలోకి కొన్ని తొక్కలను తీసుకుని అందులో వైట్ వెనిగర్ వేసి నానబెట్టాలి. గాలి కూడా దూరకుండా ఉండే విధంగా గట్టిగా మూతపెట్టాలి. మధ్య మధ్యలో వాటిని షేక్ చేస్తూ రెండు నుంచి మూడు వారాల పాటు నిల్వ చేయాలి. వెనిగర్ ని వడకట్టి స్ప్రే చేసుకునే బాటిల్ లో దాన్ని నింపుకోవాలి. కిచెన్ లో నూనె మరకలు పడిన దగ్గర, స్టవ్ మీద ఆ నీటిని స్ప్రే చేసి శుభ్రం చేస్తే అవి తళతళ మెరిసిపోతాయి.


మరి ఇంకెందుకు ఆలస్యం తొక్కలు బయట పడేయకుండా వాటితో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.  


Also read: మామిడి పొడి కూడా మసాలానే, వంటల్లో కలుపుకుంటే ఎన్ని లాభాలో, నియంత్రణలోనే మధుమేహం


Also read: ఈ ఆరు అలవాట్లు వదలకపోతే, త్వరగా ముసలివాళ్లవ్వడం ఖాయం