కుటుంబ జీవితంలో సంతానానికే మొదటి ప్రాధాన్యం. అందుకే  ఆరోగ్యవంతురాలైన పిల్లను పెళ్లి చేస్తే తమ వంశం అభివృద్ధి చెందుతుందని ఆశిస్తారు పిల్లాడి తల్లిదండ్రులు. ఒకప్పుడు చాలా తక్కువ వయసులోనే పెళ్లిళ్లు అయిపోయేవి. పిల్లలు కూడా త్వరగానే పుట్టేసేవారు. ఇప్పుడు ఉద్యోగినుల సంఖ్య పెరుగుతున్నపట్నించి పెళ్లయిన వెంటనే పిల్లల్ని కనడం అనే పద్ధతి మారింది. తమకంటూ వెసులుబాటు, చూడగలమన్న ధైర్యం, భరోసా కలిగాకే ఆధునిక స్త్రీలు పిల్లల్ని కంటున్నారు. అయితే కెరీర్ కోసం పిల్లల్ని మరీ ఆలస్యంగా కనడం కూడా కాస్త ప్రమాదమే. ఆరోగ్యవంతులైన పిల్లలు పుట్టాలంటే సరైన వయసులో కనడమే ఉత్తమమైన పని. 


ప్రపంచ ఆరోగ్య సంస్థ  చెప్పిన ప్రకారం  ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏటా 15- 19 సంవత్సరాల మధ్య ఉన్న అమ్మాయిల్లో సుమారు కోటి 20 లక్షల మంది గర్భం దాలుస్తున్నారు. అయితే వారిలో చాలా  మంది ప్రసూతి మరణాల బారిన పడుతున్నారు. ఆ వయసు పిల్లల్ని కనేందుకు సరైన వయసు కాదని ఇప్పటికే వైద్య శాస్త్రాలు చెబుతూనే ఉన్నాయి. అలాగే లేటు వయసు కూడా పిల్లల్ని కనేందుకు ఉత్తమ వయసు కాదని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 


నెలసరి వస్తున్నంత కాలం...
నిజానికి నెలసరి వస్తున్నంత కాలం స్త్రీలు గర్భం దాల్చడానికి అర్హులే. మెనోపాజ్ వచ్చాక నెలసరి ఆగిపోతుంది. ఆ తరువాత వారు సహజ పద్ధతిలో గర్భం  దాల్చలేరని అర్థం. అయితే 30 ఏళ్ల లోపు రెండు ప్రసవాలు పూర్తయిపోవాలని ఎన్నో అధ్యయనాలు, పరిశోధనలు చెబుతున్నాయి. 32 ఏళ్ల నుంచి పిల్లల్ని కనే సామర్థ్యం ఆడవారిలో తగ్గుతూ వస్తుంది. ఆలస్యంగా పిల్లల్ని కనడం వల్ల పుట్టే పిల్లల్లో డౌన్ సిండ్రోమ్, నెలలు నిండక ముందే పిల్లలు పుట్టడం, జెస్టేషనల్ డయాబెటిస్, ప్రీ ఎక్లాంప్సియా వంటి సమస్యలు కలిగే అవకాశం ఉంది. ఆలస్యంగా బిడ్డను కన్న ప్రతి 45 మందిలో ఒకరికి ఇలాంటి బిడ్డలు పుట్టే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా నిజమేనని తేల్చింది. 
 
అలాగే థైరాయిడ్, బీపీ, డయాబెటిస్ వంటివి కూడా 30 ఏళ్లు దాటాక గర్భం దాల్చిన మహిళల్లో వచ్చే అవకాశం ఉంటుంది. ప్రసవం తరువాత కూడా కొన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి 30 ఏళ్ల లోపే పిల్లల్ని కనడం ఉత్తమం. ఆడవారిలో పునరుత్పత్తి వయసును 15 నుంచి 49 ఏళ్లుగా నిర్ణయించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కానీ ఆధునిక కాలంలో మెనోపాజ్ దశ కొందరిలో 40 ఏళ్లకే వచ్చేస్తోంది. ధూమపానం, మద్యపానం, గర్భనిరోధకాలు వాడే మహిళలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వారికి మెనోపాజ్ త్వరగానే వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ అలవాట్లు ఉన్నవారు గర్భం దాల్చడం కూడా కష్టంగా మారుతుంది.  


ఏ వయసు ఉత్తమం...
స్త్రీలలో 20 నుంచి 30 ఏళ్ల కాలం పిల్లల్ని కనేందుకు ఉత్తమ సమయం. తల్లీ బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ. అయితే ధూమపానం, మద్యపానం, గర్భనిరోధకాలు వాడే మహిళలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. 


అండాశయ నిల్వలు తగ్గుతాయి...
వయసు పెరుగుతున్న కొద్దీ స్త్రీ శరీరంలోని అండాశయ నిల్వలు తగ్గిపోతుంటారు. 30 ఏళ్లలోపు వారిలో ఉన్నన్ని అండాలు తరువాత ఉండవు. 30 నుంచి 35 ఏళ్ల మధ్యే అండాల సంఖ్య పడిపోవడం మొదలవుతుంది. 45 ఏళ్లు వచ్చేసరికి భారీగా పడిపోతుంది. అందుకే ఆ వయసులో గర్భం ధరించడం కష్టతరంగా మారుతుంది. 


Also read: రాత్రి పూట ఈ మందులు వేసుకుంటే నిద్రకు దూరమవ్వడం ఖాయం


Also read: స్టైలిష్‌గా కనిపించాలని స్కిన్నీ జీన్స్ వేసుకుంటున్నారా? వాటి వల్ల తీవ్ర సమస్యలు, తెలుసుకోకపోతే మీకే నష్టం





























































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.