గుండె వైఫల్యంతో మరణించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మరో కొత్త కారణం కూడా చేరింది. అదే పెళ్లి కాకపోవడం లేదా విడాకులు తీసుకుని ఒంటరిగా జీవించడం. కొత్త పరిశోధన ప్రకారం పెళ్లి కాని వ్యక్తుల్లో లేదా ఒంటరిగా జీవిస్తున్న వారిలో హార్ట్ ఫెయిలయ్యే అవకాశం ఎక్కువని, దాని కారణంగా వారు మరణించే ఛాన్సులు కూడా ఉన్నాయని కొత్త అధ్యయనం తేల్చింది. యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ చేసిన అధ్యయనం ప్రకారం... అవివాహితులకు గుండె సంబంధ వ్యాధులు, హార్ట ఎటాక్ వంటివి దాడి చేస్తే వారు ఆ పరిస్థితిని తట్టుకోలేక మరణించే అవకాశాలు అధికం. అదే వివాహితులైతే గుండె సంబంధ వ్యాధులు దాడి చేసినప్పటికీ సామాజిక బలంతో పాటూ, మనోబలాన్ని కలిగి ఉంటారని ఆ గడ్డు పరిస్థితిని తట్టుకుని నిలబడతారని అధ్యయనంలో తేలింది. అంటే వివాహితులతో పోలిస్తే పెళ్లి కాని వారిలో గుండె వైఫల్యంతో మరణించే అవకాశాలు అధికం. జర్మనీలోని యూనివర్సిటీ హాస్పిటల్ వుర్జ్‌బర్గ్ కు చెందిన డాక్టర ఫాబియన్ కెర్వాగెన్ మాట్లాడుతూ ‘ఒంటరిగా బతికేవారి కన్నా, కుటుంబం మధ్య జీవించేవారికి క్లిష్ట పరిస్థితులను తట్టుకుని నిలబడే స్థైర్యం అధికంగా ఉంటుంది’ అని చెప్పారు.
జీవిత భాగస్వామి ముఖ్యమే...
ఏదైనా తీవ్ర అనారోగ్య పరిస్థితి ఎదురైనప్పుడు మానసిక స్థైర్యాన్ని ఇవ్వడంలో, నీకు నేనున్నాను అనే ధైర్యాన్ని నింపడంలో, వారికి మందులు ఇవ్వడం, ఆహారాన్ని తినిపించడం.. ఇలా ప్రతి విషయంలోనూ జీవితభాగస్వామి తోడు, రోగి త్వరగా కోలుకునేందుకు సహాయపడుతుంది. ఇవన్నీ దీర్ఘాయువుపై ప్రభావం చూపుతుంది. అదే పెళ్లి చేసుకోని వారికి భార్య లేదా భర్త ఉన్నంత తోడునీడగా ఇంకెవరూ ఉండరు. వీరికి మానసికంగా దగ్గరైన మనుషులు తక్కువగా ఉంటారు. కాబట్టి వారిలో గుండె జబ్బులు వచ్చినప్పుడు చనిపోతామనే భావన పెరిగిపోయి, చివరికి మరణం అంచుకు చేరుకుంటారు.
అధ్యయనం సాగింది ఇలా...
ఈ పరిశోధనలో భాగంగా 2004 నుంచి 2007 మధ్యలో గుండె వైఫల్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన 1022 మంది రోగులను పరిశీలించారు. వారిలో 63 శాతం మంది పెళ్లి చేసుకున్నారు. 195 మంది వితంతువులు. 96 మంది వివాహం చేసుకోలేదు. ఇక 84 మంది విడాకులు తీసుకున్నారు. అంటే మొత్తం 375 మందికి జీవిత భాగస్వామి లేదు. వీరంతా ఒంటరి వారి కిందకే వస్తారు. 1022 మంది రోగులను పదేళ్ల పాటూ ట్రాక్ చేశారు. వారిలో 679 మంది మరణించారు. వీరిలో జీవిత భాగస్వామి లేకుండా జీవిస్తున్న ఒంటరి వారే అధికం. తల్లీ తండ్రులు, పిల్లలు, బంధువులు ఉన్నప్పటికీ... జీవిత భాగస్వామి లేని లోటును వారు పూడ్చలేకపోయారని అర్థమవుతోంది.
అధ్యయనానికి నాయకత్వం వహించిన వైద్యులు మాట్లాడుతూ ‘వివాహం, దీర్ఘాయువు మధ్య ఉన్న సంబంధం ఈ అధ్యయనం ద్వారా అర్థమవుతోంది. గుండె వైఫల్యం వల్ల మరణించిన రోగుల్లో చాలా మందికి సామాజిక మద్దతు లభించలేదు. జీవిత భాగస్వామి పక్కనుంటే, వారు ప్రేమగా చూసుకుని ఉంటే కొంతమంది రోగులు బతికే ఛాన్సులు కూడా ఉండేవి’ అని అభిప్రాయపడ్డారు.
Also read: ఉద్యోగ ఇంటర్వ్యూలకు వెళ్లేవారికి లక్కీ కలర్స్ ఇవేనట, ఈ రంగు డ్రెస్సులు రెడీ చేసుకోండి మరి
Also read: ఈ లక్షణాలు కనిపిస్తే అతడు లేదా ఆమె ప్రేమ నిజమైనదనే అర్థం