Fatty liver Disease: కాలేయం.. మనిషి శరీరంలో గుండె తర్వాత అత్యంత ముఖ్యమైన అవయవం. ఇది శరీరంలో అన్ని ఆర్గాన్స్ కంటే అతిపెద్దది కూడా. కాలేయం శరీరంలోని పలు రకాల చర్యలను నిర్వహించే రసాయన కర్మాగారంగా భావిస్తుంటారు. అయితే కాలేయ సంబంధిత సమస్యలు తలెత్తినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?ఫ్యాటీ లివర్ వ్యాధిని ముందుగానే గుర్తించడానికి అల్ట్రాసౌండ్ ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. 


ఈ రోజుల్లో చాలా మందిని ఫ్యాటీ లివర్ వ్యాధి ఇబ్బందులకు గురిచేస్తుంది. ఈ వ్యాధితో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఈ వ్యాధి సోకడానికి కారణాలెన్నో ఉన్నాయి. అయితే ఫ్యాటీ లివర్ వ్యాధిని అల్ట్రాసౌండ్ ద్వారా ముందుగా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. రక్తపరీక్షలు అనేవి సత్వర రోగనిర్ధారణను గుర్తించలేవని పేర్కొంటున్నారు. ప్రస్తుతం కొవ్వు కాలేయ వ్యాధి నిర్ధారణ అనేది రోగి చరిత్ర, శారీరక పరీక్ష, రక్త పరీక్షలపై ఆధారపడి ఉంటుంది. ఇవి కాలేయం ఎంజైమ్స్, ఇతర కాలేయ పనితీరును సూచిస్తాయి.


కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని అల్ట్రాసౌండ్, ఫైబ్రోస్కాన్  వంటి ఇమేజింగ్ పద్దతులను ఉపయోగించి గుర్తించవచ్చని నిపుణులు అంటున్నారు. వీటితో ముందుగానే రోగి పరిస్ధితిని అంచనా వేయవచ్చు. లైఫ్ స్టైల్లో మార్పులు, ఎలాంటి చికిత్స చేయాలనేది అర్థమవుతుంది. అందుకే ఫ్యాటీ లివర్ వ్యాధికి అల్ట్రాసౌండ్ ను సాధారణ రోగనిర్థారణ సాధనంగా పరిగణించాలి అంటున్నారు నిపుణులు. 


ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి?


ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఊబకాయం, మధుమేహంతో సంబంధం కలిగి ఉంటుంది. ఎక్కువ కార్బొహైడ్రేట్లు తినడం వల్ల ఇన్సులిన్ లెవల్స్ పెరుగుతాయి. హై ఇన్సులిన్ లెవల్స్ అనేవి ఇన్సులిన్ ను నిరోధిస్తాయి. ఇది జీవక్రియకు అంతరాయం కలిగిస్తుంది. అంతేకాదు అదనపు గ్లూకోజ్ ను కొవ్వు ఆమ్లాలుగా మార్చడంతో అవి కాలేయంలో నిల్వ అవుతాయి.


లివర్ ఫ్యాట్ డిసీజ్ ను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. 1. ఆల్కాహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ 2. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. రెండు రకాలు కాలేయంలో మంట, కాలేయం దెబ్బతినేలా చేస్తాయి. చివరికి ఫైబ్రోసిస్, సిర్రోసిస్ లేదా లివర్ క్యాన్సర్ కు కారణం అవుతుంది.


లివర్ వ్యాధి నివారణ పరీక్షలు చేయించుకున్న 53,946 మందిపై అపోలో హాస్పిటల్స్ నిర్వహించిన తాజా అధ్యయనంలో 33శాతం మంది ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్నారని తేలింది. ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్నవారిలో మూడింటి ఒక వంతు మంది మాత్రమే ఎలివేటెడ్ కాలేజ్ ఎంజైమ్స్ను కలిగి ఉన్నారు. ఈ వ్యాధితో బాధపడుతున్నవారిలో ముందస్తుగా గుర్తించి.. వ్యాధిని తగ్గించేందుకు బ్లడ్ టెస్టులకు మించిన రోగనిర్ధారణ పద్దతులను అనుసరించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. 


ఫ్యాటీ లివర్ వ్యాధిని ముందస్తుగా గుర్తించడం చాలా కీలకం. ఫ్యాటీ లివర్ గ్రేడ్స్ ను గుర్తించడంలో అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ కీలక పాత్రపోషిస్తుంది. అల్ట్రాసౌండ్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల లక్షణాలు కనిపించకముందే ఈ వ్యాధిని గుర్తించవచ్చు అంటున్నారు వైద్యులు. 


Also Read: మాయదారి తుమ్ము.. దెబ్బకు పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చేశాయి, ఇంతకీ అతడు బతికే ఉన్నాడా?