పూర్వం ఉలవలు ప్రధాన ఆహారాలలో ఒకటిగా తీసుకునేవారు. కాలం గడిచే కొద్దీ పరిస్థితులు మారిపోయాయి, తినే ఆహారం, పద్ధతులు మారిపోయాయి. ఉలవలను పండించడం కూడా తగ్గించేశారు. ఉలవలు అంటే కేవలం గుర్రాల ఆహారంగానే భావిస్తున్నారు.నిజానికి ఉలవలతో చేసిన వంటలు మనకు కూడా చాలా అవసరం. మన శరీరానికి అవసరమైన ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఇందులో ఉన్నాయి. గ్రామాల్లో అక్కడక్కడ ఇంకా ఉలవలతో వండే వంటలు కనిపిస్తున్నాయి కానీ పట్టణాలు, నగరాల్లో పూర్తిగా లేదనే చెప్పాలి. ఈ కాలం వారికి ఉలవలతో ఏం వండుకోవాలో తెలియక వాటిని పక్కన పెడుతున్నారు.రాత్రిపూట చపాతీలు, పరోటాలు తినేవారు ఉలవలను వాటిలో కలుపుకుని చేసుకుంటే రుచిగానూ ఉంటుంది. పైగా ఎంతో బలం కూడా.
కావలసిన పదార్థాలు
ఉలవలు - పావు కప్పు
గోధుమపిండి - రెండు కప్పులు
అల్లం - చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు - మూడు
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం
1. ఉలవలను ముందు రోజు రాత్రే నానబెట్టుకోవాలి. లేదా రాత్రికి చపాతీలు చేసుకోవాలనుకుంటే ఆ రోజు ఉదయం నానబెట్టుకోవాలి.
2. పది గంటల పాటూ ఉలవలు నానాక వాటని కుక్కర్లో ఉడికించాలి.
3. ఉలవలు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు కలిపి మిక్సిలో మెత్తగా రుబ్బుకోవాలి.
4. ఇప్పుడు గోధుమపిండిని చపాతీ ముద్దలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.
5. చిన్న ముద్దను తీసి చపాతీలా ఒత్తుకుని మధ్యలో ఉలవల మిశ్రమాన్ని కాస్త పెట్టాలి.
6. చపాతీని మడతలు పెట్టుకుని పరాటాలా ఒత్తుకోవాలి.
7. పెనంపై నూనె వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. అంటే ఉలవల పరాటా రెడీ అయినట్టే.
దీన్ని బంగాళాదుంప కూరతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కేవలం బంగాళాదుంప మాత్రమే కాదు మీకు నచ్చిన కూరతో తినవచ్చు.
ఆరోగ్య ప్రయోజనాలు...
ఉలవలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో ఇనుము, ఫాస్పరస్, ఫైబర్, కాల్షియం అధికంగా ఉంటాయి. మధుమేహరోగులు ఉలవలతో చేసిన వంటకాలను రోజూ తినవచ్చు. ఇలా తినడం వల్ల వారి రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. బరువు తగ్గాలని భావిస్తున్నవారికి కూడా ఉలవలు ఎంతో సాయపడతాయి. నీరసం, అలసట వంటివి త్వరగా కలగవు. రక్తపోటును అదుపులో ఉంచడంలో ముందుంటాయి. పిల్లలకు ఉలవల వంటకాలు తినిపిస్తే చాలా మంచిది.వారిలో ఆకలిని పెంచుతుంది. ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ఆహారం ఇది. మహిళలు ఉలవల వంటలు అధికంగా తింటే వారిలో రుతుక్రమ సమస్యలు దూరంగా అవుతాయి. మగవారిలో లైంగికాసక్తిని, శక్తిని పెంచుతాయి.
Also read: మీకు ఇందులో ఎన్ని గుర్రాలు కనిపిస్తున్నాయి? మీరే చెప్పే సంఖ్యే మీరెలాంటి వారో చెబుతుంది