Chittoor Volunteer Arrest: కాలానుగుణంగా మనిషి జీవన విధానంలో భారీగా మార్పులు జరుగుతూ ఉన్నాయి.. ఏమి చేయాలన్నా గురువులు లేకుండానే ఇంటి పట్టున ఉండి ఎంతో సులువుగా నేర్చుకుంటూ ఉన్నాం.. అయితే నేటి సమాజంలో చదువులు దగ్గర నుండి వంటలు, వ్యాపారాలు, బ్యాంక్ లావాదేవీలు, రకరకాల ఇంజనీరింగ్ డిజైన్స్, వస్తువులు అన్ని ఆన్లైన్ ద్వారానే సాగుతున్నాయి.. కానీ కొందరు యువకులు మాత్రం యూట్యూబ్ ను చెడు మార్గాల కోసం ఉపయోగిస్తూ అబాసుపాలు అవుతున్నారు.. ఇలాంటి ఘటనే చిత్తూరు జిల్లాలో కలకలం రేపుతుంది.‌ ఓ వాలంటీర్ యూట్యూబ్ లో వీడియోలు చూసి ఏకంగా నాటు తుపాకీని తయారు చేశాడు. చివరికి కటకటాల పాలయ్యాడు.


వివరాల్లోకి వెళ్ళితే.. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత దగ్గర చేస్తూ వాలంటీర్ వ్యవస్థను ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం విదితమే.. పేదలకు అందించే సంక్షేమ పధకాలు,అర్హులైన వారికి ఫించన్, వివిధ రకాల ఫలాలు మొత్తం గ్రామ వాలంటీర్లులే చూస్తూ ఉంటారు.. ప్రభుత్వం రంగంలో విధులు నిర్వర్తించే వాలంటీర్లు ప్రవర్తన మాత్రం కొన్ని చోట్ల పూర్తిగా భిన్నంగా ఉంటోంది.. తాము చెప్పిందే వేదం అంటూ రెచ్చి పోయిన వాలంటీర్లు ఏకంగా నాటుసారా, ఎర్రచందనం అక్రమ రవాణా, ఇసుక అక్రమ రవాణా, భూ మాఫీయా, నిషేధిత వస్తువుల అక్రమ రవాణా వంటి పలు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ పోలీసులకు పట్టుబడి చివరికి ఊసలు లెక్కించారు..


తాజాగా చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు మండలం, కార్వేటినగరం వాలంటీర్ చేసిన పని చూసి పోలీసులే షాక్ కు గురయ్యారు.. చింతతోపు ఎస్టీ కాలనీకి చెందిన రవి (32) కార్వేటినగరం మూడవ సచివాలయంలో వాలంటీర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు.. ప్రతిరోజు కార్వేటినగరంకు సచివాలయంలో విధులు నిర్వర్తించిన తర్వాత తిరిగి స్వగ్రామం చింతతోపుకు చేరుకునేవాడు.. వాలంటీరు రవి ఉన్న కాలనీకి సమీపంలో అటవీ ప్రాంతం ఉండడంతో నిత్యం అటవీ ప్రాంతంలో ఉండే వివిధ రకాల వన్యప్రాణులు జనావాసాల వద్దకు చేరుకుని నివాసితులను ఇబ్బందులకు గురిచేసేవి.. ఈ క్రమంలో గ్రామంలోని కొందరు ప్రోద్బలంతో రవి అటవీ ప్రాంతంలోని వన్యప్రాణులను వేటాడాలని నిర్ణయించుకున్నాడు.. 


ఈ క్రమంలో గత కొన్ని నెలల క్రితం రవి తెలిసిన వారి ద్వారా నాటు తుపాకీని కొనుగోలు చేశాడు.. అయితే తుపాకీ పాతది కావడంతో మరమ్మతులు చేయాల్సి వచ్చింది.. అటవీ ప్రాంతంలో వేటకు వెళ్ళిన ప్రతిసారి నాటు తుపాకీ తీవ్రంగా ఇబ్బంది పెట్టేది.. దీంతో తనకు నాటు తుపాకీ ఇచ్చిన వ్యక్తికి తెలిసిన వారి ద్వారా నాటు తుపాకీ మరమ్మతులు చేయించాడు.. మళ్లీ అదే సమస్య ఎదురు కావడంతో నిరాశకు గురైన రవి.. కొత్తది కొనుగోలు చేయాలని పలుచోట్ల తెలిసిన వ్యక్తుల ద్వారా ఆరా తీశాడు.. నూతన తుఫాకీ కొనుగోలు కోసం రవి చేసిన ప్రయత్నాలు ఫలించాయి.. తుపాకీని తీసుకుని వచ్చే సమయంలో పోలీసులకు పట్టుబడే అవకాశం ఉండడంతో నూతన తుపాకీ కొనుగోలును విరమించుకున్నాడు.


దీంతో ఆలోచనలో పడ్డ రవి ఏకంగా తుపాకీని తయారు చేసేందుకు పూనుకున్నాడు.. యూట్యూబ్ ఛానల్ ద్వారా తుపాకీ తయారు చేసే విధానం పలుమార్లు పరిశీలించాడు.. తుపాకీకి అవసరమయ్యే వివిధ పరికరాలను సమకూర్చుకున్నాడు.. గ్రామంలో ఎవరికీ తెలియకుండా తుపాకీని తయారు చేస్తున్న క్రమంలో స్థానికుల కంట పడ్డాడు.. దీంతో తుపాకీని తయారు చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ దస్తగిరి బుధవారం సిబ్బందితో కలిసి ఒక్కసారిగా వాలంటీర్ రవిపై దాడి చేసి నాటు తుపాకీ తయారీకి ఉపయోగించిన టూల్ కిట్లు సీజ్ చేసి అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపారు.