యూకే వైద్యులు సరికొత్త చరిత్ర సృష్టించారు. మొట్టమొదటి సారిగా సజీవంగా ఉన్న మహిళ గర్భాశయాన్ని వేరే మహిళలో సమర్థవంతంగా ఆపరేషన్ చేసి అమర్చారు. ఇష్టపూర్వకంగానే ఇద్దరు అక్కాచెలెల్లు తమలో ఉన్న సమస్యని అధిగమించారు. చెల్లెలు(34) జన్యుపరమైన పరిస్థితి కారణంగా పిల్లలని కనే అవకాశాన్ని లేకుండా పోయింది. దీంతో ఆమె అక్క(40) తన గర్భాశయాన్ని దానం చేసేందుకు ముందుకు వచ్చింది. ఆమెకి అప్పటికే ఇద్దరు పిల్లలు. ఫిబ్రవరిలో ఈ ఆపరేషన్ జరిగింది.


లండన్ లోని ఇంపీరియల్ కాలేజ్ ఎన్ హెచ్ ఎస్ ట్రస్ట్, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ హాస్పిటల్ వైద్యులు ఈ ఆపరేషన్ ని విజయవంతంగా నిర్వహించారు. దాదాపు తొమ్మిదిన్నర గంటల పాటు శ్రమించి ఆపరేషన్ చేశారు. ఇందులో 30 మందికి పైగా సిబ్బంది పాల్గొన్నారు. ఇది నమ్మశక్యం కానీ విజయవంతమైన ఆపరేషన్ అని వైద్యులు కొనియాడారు. గర్భాశయం మార్పిడి చేయించుకున్న చెల్లెలు ఈ ఏడాది తర్వాత ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా గర్భవతి కావాలని ఆశిస్తోంది.


మరికొన్ని రోజుల్లో ఇటువంటి ఆపరేషన్ మరో రోగికి కూడా చేయాలని వైద్యులు భావిస్తున్నారు. సర్జరీలో పాల్గొన్న ప్రొఫెసర్ రిచర్డ్ స్మిత్ మాట్లాడుతూ ఇది నమ్మశక్యం కానిది. కానీ ఇది నిజం. అద్భుతం చేశాం. సజీవంగా ఉన్న మహిళ గర్భాశయం తీసి మరొక మహిళలోకి ప్రవేశ పెట్టామని సంతోషం వ్యక్తం చేశారు. గర్భం దానం చేసిన దాత ఆరోగ్యం కూడా సాధారణ స్థితికి చేరుకున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు.


గర్భాశయం దానం చేయడానికి ముందే రోగి తన ఎగ్స్ ఫ్రీజింగ్ చేయించుకుంది. ఇప్పుడు ఆమె తన భర్తతో కలిసి సంతానోత్పత్తి చికిత్స తీసుకోవడానికి సిధ్దంగా ఉన్నప్పుడు వాటిని ప్రవేశపెడతామని వైద్యులు తెలిపారు. గర్భాశయం పొందిన దాత గర్భం సంపూర్ణంగా పని చేస్తుంది. ఆమెని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని సర్జరీ చేసిన వైద్యులు తెలిపారు. రోగి అరుదైన మేయర్ రోకిటాన్స్కి కుస్టర్ హౌసర్ తో జన్మించింది. అంటే స్త్రీగా పుట్టినప్పటికీ వజీనా, గర్భం అభివృద్ధి చెందవు. దీని వల్ల గర్భం దాల్చలేరు. ఆమె గర్భం ధరించాలని అనుకున్న తర్వాత తనకి, తన భర్తకి రెండు సార్లు కౌన్సిలింగ్ ఇచ్చారు. హ్యూమన్ టిష్యూ ఆధారిటీ నుంచి ఆమోదం తీసుకున్న తర్వాత ఈ ప్రక్రియ మొదలుపెట్టారు. ఇది కనుక సంపూర్తిగా సక్సెస్ అయితే ఎంతోమంది మహిళలకు ఇదొక వరంగా మారనుంది. గర్భాశయం దానం చేస్తే తల్లి కాలేని ఎంతో మందికి కొత్త జీవితం ప్రసాదించినట్టు అవుతుంది. 


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: జ్ఞాపకశక్తి పెరగాలంటే రోజూ రాత్రి పిల్లలకు ఈ పాలు ఇవ్వండి