సుగంధ ద్రవ్యాల రారాజు కుంకుమ పువ్వు. ఖీర్, బిర్యానీతో సహా పలు వంటల్లో దీన్ని విరివిగా ఉపయోగిస్తారు. గర్భిణీతో ఉన్న స్త్రీలు కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగితే పుట్టే బిడ్డ ఎర్రగా పుడతారని చెప్తుంటారు. అది మాత్రమే కాదు మీ పిల్లలకి ప్రతిరోజూ నిద్రపోయే ముందు కుంకుమ పువ్వు పాలు తాగించారంటే ఆరోగ్యంగా ఉంటారు. కేసర్ లోని రసాయనాలు మానసిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా క్యాన్సర్ కణాలను చంపడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఈ సువాసన కలిగిన పాలు పిల్లలకు తాగించడం వల్ల ఆరోగ్యంగా, అందంగా కనిపిస్తారు.


క్రోకస్ పువ్వు నుంచి వచ్చిందే కుంకుమ పువ్వు. దీని రంగు, రుచి, వాసన అద్భుతం. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి బయట పడేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మొత్తం ఆరోగ్యాన్ని ఇస్తాయి. పిల్లలకు ఈ పాలు తాగించడం వల్ల కలిగే ప్రయోజనాలు..


ప్రశాంతమైన నిద్ర


ఫోన్లు చూస్తూ పిల్లలు టైమ్ కి పడుకోకుండా మారాం చేస్తారు. వారికి నాణ్యమైన నిద్ర అందించేందుకు కుంకుమ పువ్వు కలిపిన పాలు చక్కగా ఉపయోగపడతాయి. దీని సహజమైన లక్షణాలు ప్రశాంతమైన నిద్రని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కుంకుమ పువ్వులో ఉండే సమ్మేళనాలు సెరోటోనిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఇది నిద్రని నియంత్రించే న్యూరోట్రాన్స్ మీటర్. నిద్రవేళకు ముందు గోరు వెచ్చని కేసర్ పాలు తాగడం వల్ల మనసుకి విశ్రాంతి లభిస్తుంది. ప్రశాంతమైన నిద్రలోకి వెళ్ళేలా చేస్తుంది.


ఎముకలకు ఆరోగ్యం


బాల్యంలో ఎముకల అభివృద్ధి చాలా అవసరం. ఈ సమయంలో కాల్షియం తీసుకోవడం చాలా అవసరం. కేసర్ పాలు పిల్లలకు కావాల్సిన కాల్షియంని అందిస్తాయి. ఇందులో విటమిన్ ఏ, సి, మాంగనీస్ వంటివి లభిస్తాయి. ఈ పోషకాలు ఎముకలు ధృడంగా మారేందుకు తోడ్పడతాయి. పిల్లల ఎదుగుదల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి.


జీర్ణక్రియ


జీర్ణ సమస్యలు పిల్లలో తరచూ ఎదురవుతాయి. కారణం అనారోగ్యకరమైన ఆహారం తీసుకునేందుకు వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు. వాటిని అధిగమించేందుకు కుంకుమ పువ్వు ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన పేగులను అందిస్తుంది. కేసర్ పాలు పోషకాల శోషణకి దోహదపడతాయి. నిద్రలేమి సమస్యలు పరిష్కరించడంలో సహాయపడుతుంది. బాదం, కుంకుమ పువ్వు కలిపి పాలు తీసుకున్నా మంచిది. బాదం పాలు చేయడానికి ముందుగా కొన్ని బాదం పప్పులు నానబెట్టి వాటిని మిక్సీ చేసుకుని పాలలో కలుపుకోవచ్చు. ఆ తర్వాత కుంకుమ పువ్వు కలుపుకుని తీసుకోవచ్చు. రుచి కోసం కాస్త తేనె జోడించుకోండి.


మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది


జ్ఞాపకశక్తి పెంచేందుకు అవసరమైన ఫుడ్స్ అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అందుకు కుంకుమ పువ్వు ఉత్తమ ఎంపిక. ఇందులో రిబోఫ్లావిన్, ధయామిన్ వంటి పోషకాలు మెదడు ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తి పెంచుకునేందుకు సహాయపడతాయి. 


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: ఇలా చేశారంటే మీ ఒత్తిడి క్షణాల్లో హుష్ కాకి!