పెంటగాన్... ఇది అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పేరు. జామెట్రీ ఆకారాల్లో ఒకటైన పెంటగాన్ ఆకారంలోనే దీన్ని కట్టారు. అందుకే ఆ పేరు పెట్టారు. వర్జీనియాలో ఇది ఉంది. ఎప్పుడూ అత్యధిక భద్రత మధ్య ఉంటుంది ఈ కార్యాలయం. చాలా మంది కమాండోలు నిత్యం పహారా కాస్తుంటారు. అలాంటి భవంతి దగ్గరికి ఎలా చొరబడిందో కాని ఒక కోడి వచ్చింది. అక్కడ భవంతిలో ఇటూ అటూ తిరుగుతుంటే అక్కడ ఉన్న అధికారులు దాన్ని పట్టుకున్నారు. జంతువుల సంక్షేమ సంస్థ వారికి ఫోన్ చేసి వెంటనే రావాల్సిందిగా కోరారు. 


యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వారు వచ్చి ఆ కోడిని చిన్న బోనులో పెట్టి దాన్ని తీసుకెళ్ళారు. ఆ కోడికి ‘హెన్నీ పెన్నీ’ అనే పేరు కూడా  పెట్టారు. పెంటగాన్ చుట్టూ చాలా దూరం వరకు ఎలాంటి నివాసాలు ఉండవు. అసలు ఆ కోడి రోడ్లన్ని దాటుకుని పెంటగాన్లోకి ఎలా ప్రవేశించిందో తెలుసుకునేందుకు అధికారులు విచారణ కూడా మొదలుపెట్టారు.  అది ఎక్కడి నుంచి వచ్చిందో మాత్రం తెలుసుకోలేకపోయారు. ఆ కోడిపైనున్న ప్రతి ఈకను వెతికారు. కాని వారికి ఎలాంటి అనుమానాస్పద కెమెరాలు, వస్తువులు కనిపించలేదు. దాన్ని క్షుణ్నంగా చెక్ చేశాకే యానిమల్ వెల్ఫేర్ సంస్థకు అప్పగించారు. ఇది అమెరికాలో చాలా ట్రెండింగ్‌గా మారింది. 


ఇలా జంతువులను అరెస్టు చేయడం కొత్త కాదు, గతంలో నెదర్లాండ్స్‌లో ఓ చిలుకను అరెస్టు చేశారు. అదేం తప్పుచేసిందా అనుకుంటున్నారా? షాపులో దొంగతనం చేసిన వ్యక్తి భుజంపై అది ఉంది. సో దానికి కూడా క్రైమ్ భాగస్వామ్యం ఉందని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. 


మధ్యప్రదేశ్లో కూడా ఒక కుక్కను అరెస్టు చేశారు. కరోనా వల్ల కఠిన లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో ఓ వ్యక్తి కుక్కను తీసుకుని రోడ్డుపైకి వచ్చారు. కర్ఫ్యూ సమయంలో బయటికి రావడంతో ఆ వ్యక్తితో పాటూ కుక్కను కూడా అరెస్టు చేసి జైలుకు పంపారు. 





Also read: అన్నం మిగిలిపోతే బాధపడకుండా ఈ వంటకాలు చేసుకోండి


Also read: మధుమేహం ఉన్నా అరటి పండు తినొచ్చు, కానీ ఈ జాగ్రత్తలతో..