హిందూ సంప్రదాయానికి పసుపు ప్రతీక. ప్రతి ఒక్కరి వంటింట్లో, పూజ గదిలో ఇది తప్పకుండా ఉంటుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగిన పసుపు వల్ల శరీరానికి మేలు జరుగుతుందని భావిస్తారు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. చర్మ నాణ్యతను మెరుగుపరిచి అనేక వ్యాధుల ప్రమాదాన్ని నివారిస్తుంది. ఆహార పదార్థాలకి మంచి రంగు, రుచి జోడిస్తుంది. కానీ దీన్ని అతిగా వాడితే మాత్రం ప్రాణాలు ప్రమాదంలోకి నెట్టినట్టే అని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.


పసుపులోని కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. నొప్పులు, గాయాలని నయం చేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే దీన్ని అతిగా తీసుకుంటే మాత్రం కాలేయం పెద్ద ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తూ అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ ఒక కొత్త పరిశోధన గురించి ప్రచురించింది. పసుపు వల్ల కాలేయం దెబ్బతింటుందని తేలింది. శరీరంలోని అతిపెద్ద అవయవం కాలేయం. కొవ్వులని జీవక్రియ చేయడంలో కీయాలక పాత్ర పోషిస్తుంది.


అధ్యయనం సాగింది ఇలా..


2011-2022 మధ్యకాలంలో కొంతమందిపై జరిపిన పరిశోధనలో పసుపు వల్ల కాలేయానికి గాయాలు అయిన కేసులు 16 గుర్తించారు. కొన్ని గాయాల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. వారిలో ఐదు కేసులు ఆస్పత్రిలో చేరగా తీవ్ర కాలేయ నష్టం కారణంగా ఒకరు మరణించడం కూడా జరిగింది. ఇందులోని మరికొంతమంది నల్ల మిరియాలతో కలిపి పసుపుని వినియోగిస్తున్నారని తేలింది. 10 ఏళ్ల పాటు సాగిన ఈ అధ్యయనంలో నివేదించబడిన కొన్ని కాలేయ సంబంధిత కేసులు మరింత లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉందని అన్నారు.


ఇతర నివేదికలు ఏం చెప్తున్నాయి?


పసుపు కాలేయం దెబ్బతినేందుకు దారి తీసే పరిణామాల గురించి మరింత పరిశోధనలు అవసరం అని నిపుణులు చెబుతున్నారు. కానీ దీన్ని నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరిస్తున్నారు. 2021 ఎడిషన్ ఇంటర్నేషనల్ మెడికల్ కేస్ రిపోర్ట్ జర్నల్ నివేదిక ప్రకారం కాలేయ గాయాల కేసులు రెండు నమోదయ్యాయి. టుస్కానీలో ఇలాంటి కేసులు ఇప్పటికీ నమోదయ్యాయి. అందుకే పసుపు తీసుకోవడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. పసుపు సప్లిమెంట్లు తీసుకునే వాళ్ళు వైద్యుని సంప్రదించిన తర్వాత మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు.


కిడ్నీలని ప్రభావితం చేస్తుంది


కాలేయమే కాదు పసుపు అతిగా తీసుకుంటే కిడ్నీలు కూడా పాడవుతాయి. పసుపులోని కర్కుమిన్‌లో అధిక మొత్తంలో ఆక్సలేట్‌లు ఉన్నాయి. ఇవి మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి. అంతే కాదు వాటి పనీతిరుకి కూడా ఆటంకం కలిగిస్తాయి. కర్కుమిన్ వేడి శక్తిని కలిగి ఉంటుంది. దీని వల్ల తరచుగా అతిసారం, అజీర్ణంతో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.


ఎంత మోతాదులో తీసుకోవాలి?


ఆరోగ్య నిపుణులు సూచన ప్రకారం రోజు మొత్తం మీద పసుపు వినియోగం 2000 మిల్లీ గ్రాములకి మించకూడదు. కనీసం 500 మిల్లీగ్రాముల పసుపు తీసుకోవడం తప్పనిసరి. పసుపు అధికంగా ఒంట్లో చేరడం వల్ల కేవలం ఇనుము లోపించడమే కాదు, జీర్ణ సమస్యలు, తలనొప్పి, చర్మంపై దద్దుర్లు కూడా వస్తాయి. పేగు లేదా కాలేయ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది. 


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also read: టైఫాయిడ్ జ్వరం ఎలా వస్తుంది? లక్షణాలు ఏంటి? రక్షణ పొందడం ఎలా?