దేశవ్యాప్తంగా టైఫాయిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. చాలా మంది ఇది దోమల వల్ల వ్యాప్తి జరుగుతుందని అందరూ అనుకుంటారు. కానీ అందులో వాస్తవం లేదు. ఇదొక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టిరియా సోకడం వల్ల టైఫాయిడ్ జ్వరం వస్తుంది. ఇది కలుషిత ఆహారం, నీటిపై జీవిస్తుంది. వాటిని తినడం, తాగడం వల్ల శరీరంలో చేరి టైఫాయిడ్‌కు కారణం అవుతుంది. ఇది పెద్దల కంటే తక్కువగా పిల్లలని ప్రభావితం చేస్తుంది. అలా అని పిల్లలకి సోకదని మాత్రం కాదు. శరీరంలోని ఇతర అవయవాలని ఇది ప్రభావితం చేస్తుంది. చికిత్స చేయకుండా వదిలేస్తే టైఫాయిడ్ ప్రాణాంతకమైన పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఎలా వ్యాపిస్తుంది?
కలుషితమైన ఆహారం, నీటి ద్వారా ఇది వ్యాపిస్తుంది. ఇది సోకిన వ్యక్తులని తాకిన లేదా వారి వస్తువులు ముట్టుకున్నా కూడా వస్తుంది. అపరిశుభ్ర వాతావారణం, కలుషిత ఆహారం ద్వారా సులభంగా వ్యాపిస్తుంది. పిల్లలు అపరిశభ్రమైన పదార్థాలతో బహిరంగ ప్రదేశాలలో వండిన ఆహారం తినడం వల్ల పిల్లలు త్వరగా దీని బారిన పడతారు. అందుకే తల్లిదండ్రులు బయట ఆహారాన్ని తీసుకోవద్దని హెచ్చరించాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
టైఫాయిడ్ జ్వరం లక్షణాలు
⦿ దీర్ఘకాలికంగా జ్వరం
⦿ అలసట
⦿ తలనొప్పి
⦿ వికారం
⦿ పొత్తి కడుపునొప్పి
⦿ మలబద్ధకం
⦿ అతిసారం
⦿ దద్దుర్లు
⦿ వాంతులు
⦿ ఆకలి లేకపోవడం
టైఫాయిడ్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
బయట నుంచి తీసుకొచ్చిన కూరగాయలు, పండ్లు శుభ్రంగా కడిగిన తర్వాతే తినడం, వంట చేయడం చెయ్యాలి. ఆహారం బాగా ఉడికించిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే తినాలి. పెంపుడు జంతువులు, టాయిలెట్ కి వెళ్లొచ్చిన తర్వాత చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. పచ్చి పాలు, వాటితో చేసిన ఉత్పత్తులు నివారించాలి. తాగేనీటిని బాగా మరిగించి చల్లార్చిన తర్వాత తాగాలి. వండిన పదార్థాల మీద ఎప్పుడు మూతలు ఉండేలా చూసుకోవాలి. వీలైనంత వరకు బయట ఆహారాన్ని తినకపోవడమే మంచిది.
టైఫాయిడ్ సోకిన చిన్నారుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పిల్లలకి టైఫాయిడ్ జ్వరం ఎక్కువగా ఉంటే వాళ్ళని ఇంట్లో వాళ్ళతో కలవనివ్వకుండా చూసుకోవాలి. వాళ్ళు వేసుకునే బట్టలు, తిన్న పాత్రలు, వ్యక్తిగత వస్తువులు అన్నింటినీ వేడి నీటిలో వేసి డిటర్జెంట్ తో బాగా శుభ్రం చెయ్యాలి. రోగి తినే పాత్రలు మిగతా వాటితో కలపకూడదు. పిల్లల ఆరోగ్యం కోసం పరిసర ప్రాంతాలు తప్పనిసరిగా పరిశుభ్రంగా ఉండాలి. వారికి పోషకాలు నిండిన ఆహారం పెట్టాలి. అప్పుడే వాళ్ళు వ్యాధితో పోరాడగలుగుతారు. డైపర్లు, మిగిలిపోయిన ఆహారం, వ్యర్థ పదార్థాలు ఇంట్లో ఎక్కువసేపు ఉంచకూడదు.
చికిత్స, టీకా
టైఫాయిడ్ జ్వరాన్ని యాంటీ బయాటిక్స్ తో నయం చేయవచ్చు. అయితే అది కూడా వైద్యుని సలహా తీసుకున్న తర్వాత మాత్రమే వినియోగించాలి. పిల్లలకి టైఫాయిడ్ రాకుండా టీకాలు వేయించవచ్చు. ఇన్‌యాక్టివేటెడ్ ఇంట్రామస్కులర్ వ్యాక్సిన్, లైవ్ ఓరల్ వ్యాక్సిన్ పేరుతో రెండు టీకాలు అందుబాటులో ఉన్నాయి. వైద్యులని సంప్రదించిన తర్వాత తగిన మోతాదులో టీకా వేయించాలి. ఈ టీకా రక్షణ 5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. టీకా తీసుకున్నప్పటికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: హెయిర్ స్ట్రెయిటనింగ్ ఉత్పత్తుల వల్ల గర్భాశయ క్యాన్సర్? హెచ్చరిస్తున్న కొత్త అధ్యయనం