Maldives Fire Accident:


మాల్దీవుల రాజధాని మేల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. మైగ్రెంట్ వర్కర్స్‌ బిల్డింగ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. 10 మంది మృతదేహాలను గుర్తించి రికవరీ చేసినట్టు చెప్పారు. ఈ బిల్డింగ్‌లోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో వాహనాలను మరమ్మతు చేసే గ్యారేజ్ ఉంది. అక్కడి నుంచే మంటలు చెలరేగి ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దాదాపు 4 గంటల పాటు శ్రమిస్తే గానీ మంటలు అదుపులోకి రాలేదు. మృతి చెందిన వారిలో 9 మంది భారతీయులు కాగా, మరొకరు బంగ్లాదేశ్ నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. ఇండియన్ హై కమిషన్ ఈ ప్రమాదంపై స్పందించింది. " మేల్‌లో జరిగిన ప్రమాదం మమ్మల్ని కలిచివేసింది. మృతి చెందిన వారిలో భారతీయులూ ఉన్నారు. మాల్దీవియన్ అధికారులతో మేము ఎప్పటి కప్పుడు పరిస్థితులు సమీక్షిస్తున్నాం" అని ట్వీట్ చేసింది. సమీపంలోని స్టేడియంలో ఓ ఎవాక్యుయేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసి...బిల్డింగ్‌లో ఉన్న వారిని అక్కడికి సురక్షితంగా తరలిస్తున్నట్టు నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు స్పష్టం చేశారు.