Maharashtra Politics:


ఫడణవీస్‌పై కామెంట్స్..


దాదాపు మూడు నెలల తరవాత జైలు నుంచి విడుదలయ్యారు శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్. న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలూ చేశారు. దేవేంద్ర ఫడణవీస్‌ గురించి ప్రస్తావించారు. మహారాష్ట్ర డిప్యుటీ సీఎం దేవేంజ్ర ఫడణవీస్‌ను కలుస్తానని వెల్లడించారు. "దేవేంద్ర ఫడణవీస్‌ను కలుస్తాను. ఆయనే రాష్ట్రాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రి (ఏక్‌నాథ్ శిందే) కేవలం ఈ రాష్ట్రానికి చెందిన వారు మాత్రమే తప్ప ఏ పార్టీకి చెందిన వారు కాదు" అని వ్యాఖ్యానించారు. ఫడణవీస్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షానూ కలుస్తానని చెప్పారు సంజయ్ రౌత్. తన హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వాళ్లకు వివరిస్తానని అన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్న పరిస్థితులనూ వాళ్లకు అర్థమయ్యేలా చెబుతానని తెలిపారు. తనను కుట్ర పన్ని ఈ స్కామ్‌లో ఇరికించారని ఆరోపించారు. ఎవరిపైనా నేరుగా విమర్శలు చేయనని, ప్రభుత్వం మారాకే ఇదంతా జరిగిందని గుర్తు చేశారు. ప్రభుత్వం కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుందని, వాటిని తప్పకుండా ఆహ్వానిస్తానని చెప్పారు. ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్‌ను కూడా కలుస్తానని వెల్లడించారు. 










బెయిల్‌పై విడుదల..


శివసేన సీనియర్ నేత సంజయ్‌ రౌత్‌కు బెయిల్‌ లభించింది. పత్రా చాల్ స్కామ్‌ కేసులో భాగంగా ఆయనను ఈడీ అధికారులు మూడు నెలల క్రితం అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి విచారణ కొనసాగుతోంది. ఆయనను ముంబయిలోని జైల్లో ఉంచారు. PMLA కోర్ట్ ఆయన జ్యుడీషియల్ కస్టడీని 14 రోజుల పాటు పొడిగిస్తూ నవంబర్ 2న నిర్ణయం తీసుకుంది. రౌత్ బెయిల్ పిటిషన్‌ను రిజర్వ్‌లో ఉంచింది. అయితే..ఇవాళ బెయిల్‌ ఇస్తూ తీర్పునిచ్చింది. అరెస్ట్ అయ్యాక దాదాపు 101 రోజుల తరవాత బెయిల్ లభించినట్టైంది. మనీలాండరింగ్ యాక్ట్‌కు సంబంధించిన కేసులను విచారించే స్పెషల్ జడ్జ్ ఎమ్‌జీ దేశ్‌పాండే గత వారం వరకూ ఈ తీర్పుని రిజర్వ్‌లో ఉంచారు. పత్రా చాల్ కుంభకోణంలో సంజయ్ 
రౌత్ హస్తం ఉందని ఈడీ అధికారులు ఈ ఏడాది జులైలో అరెస్ట్ చేశారు. అయితే...ఈ స్కామ్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని రౌత్ వేసిన పిటిషన్‌ను ఈడీ ఖండించింది. ఈ స్కామ్‌కి సంజయ్ రౌత్‌కి సంబంధం ఉందని తమ విచారణలో తేలిందని స్పష్టం చేస్తోంది. అంతే కాదు. సంజయ్ రౌత్ సతీమణికి కూడా ఇందులో హస్తం ఉందని తేల్చి చెప్పింది.


2007లో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం పత్రచాల్‌ ప్రాంతంలో 3వేల ఫ్లాట్లు నిర్మించడానికి గురుఆశీష్ కన్‌స్ట్రక్షన్స్‌కు 1034 కోట్ల విలువైన ప్రాజెక్ట్ కేటాయించింది. ఇందుకోసం 47  ఎకరాల భూమిని ఈ కంపెనీకి అప్పగించింది. గురుఆశీష్ కన్‌స్ట్రక్షన్స్‌ డైరెక్టర్లలో ఒకరైన ప్రవీణ్‌ రౌత్‌.. శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్‌కు అత్యంత సన్నిహితుడు. ప్రవీణ్ రౌత్ భార్య మాధురి సంజయ్‌ రౌత్ సతీమణి వర్షకు 55 లక్షలు వడ్డీలేని రుణం ఇచ్చినట్టు ఈడీ విచారణలో తేలింది. అంతేకాక, మాధురి, వర్షా  కలిసి ఆలీబాగ్‌లో ఓ భూమి కూడా కొనుగోలుచేశారు. ఈ ల్యాండ్ డీల్‌పైనా ఈడీ కూపీ లాగుతోంది. ఈ కేసులోనే రౌత్ ఆస్తులు అటాచ్ చేసింది. 


Also Read: Gujarat Polls 2022: రవీంద్ర జడేజా భార్యకు భాజపా టికెట్- మరి ప్రచారం చేస్తాడా?