పెళ్లయిన జంటలన్నీ పిల్లల్ని కనేందుకు సిద్ధంగా ఉంటాయి. కానీ ఏ సమయంలో లైంగికంగా కలిస్తే గర్భం ధరించే అవకాశం ఉందో చాలా తక్కువ మందికే అవగాహన ఉంది. ముందుగా స్త్రీ శరీరంలో జరిగే ఓవులేషన్ (అండోత్సర్గము) గురించి తెలుసుకుంటే ఎప్పుడు కలిస్తే గర్భం ధరించడం సులువో అర్థం చేసుకోవచ్చు. దీని వల్ల మీరు కోరుకున్న సమయంలో పిల్లల్ని కనవచ్చు. అంతేకాదు అవాంఛిత గర్భాలను కూడా నిరోధించవచ్చు.
అండోత్సర్గము అంటే?
ఆడపిల్ల పుట్టుకతోనే లక్షల కొద్దీ అపరిపక్వ అండాలతో పుడుతుంది. పది పన్నేండేళ్ల వయసు వచ్చాక ప్రతి నెల ఒక గుడ్డు విడుదల అవ్వడం మొదలవుతుంది. దీన్నే అండోత్సర్గము (ఒవులేషన్) అంటారు. అండం విడుదలయ్యాక భార్యా భర్తలు లైంగికంగా కలిస్తే ఆ అండము స్పెర్మ్ తో కలవడానికి ఫాలోపియన్ ట్యూబులో ప్రయాణించి ఫలదీకరణం చెందుతుంది. ఫలదీకరణం చెంది ఆ అండం గర్భాశయం గోడలకు అతుక్కుంటుంది. పూర్తి ఆరోగ్యవంతురాలైన మహిళలకు నెలకు ఒకసారి మాత్రమే అండోత్సర్గము జరుగుతుంది.
అండోత్సర్గము జరిగే రోజు ఎలా తెలుస్తుంది?
గర్భవతి అయ్యేందుకు ప్రయత్నిస్తున్న స్త్రీ ముందుగానే తనకు అండోత్సర్గము జరిగే రోజులను అంచనా వేసి ఆ రోజులలో భర్తతో కలిస్తే గర్భం ధరించే అవకాశాలు ఎక్కువ. మీకు పీరియడ్స్ మొదలయ్యే రోజును మొదటి రోజుగా భావించండి. ఆ రోజు నుంచి సరిగ్గా ఎనిమిదవ రోజు నుంచి 21వ రోజు మధ్య అండోత్సర్గము జరిగే అవకాశం ఉంది. ఆ పదిరోజుల్లో గర్భం వచ్చే అవకాశం ఎక్కువ. అండోత్సర్గము జరగడానికి రెండు రోజుల ముందు లైంగికంగా కలిస్తే గర్భం అవకాశాలు అధికం. అయితే ఎప్పుడు అండోత్సర్గము జరుగుతుందో తెలుసుకోవడం ఎలా? దానికి మహిళల్లో కింది లక్షణాలు కనిపిస్తాయి.
1. లైంగిక ఆసక్తి పెరుగుతుంది.
2. పలుచగా రక్తం కనిపిస్తుంది.
3. జననేంద్రియాలు వాచినట్టు అనిపిస్తాయి.
4. శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉండదు.
5. తెల్ల బట్ట కనిపించే అవకాశం ఉంది.
6. రొమ్ములు సున్నితంగా మారతాయి. నొప్పి కూడా పెడతాయి.
7. వికారంగా, తలనొప్పిగా అనిపిస్తుంది.
8. పొత్తికడుపులో తేలికపాటి నొప్పి వస్తుంది.
ఈ లక్షణాలను గమనించుకుని ప్లాన్ చేసుకుంటే భార్యాభర్తలు త్వరగా తల్లిదండ్రులు అయ్యే అవకాశం ఉంది.
Also read: ఒత్తిడిగా, ఆందోళనగా అనిపిస్తోందా? ఇలా సహజంగా తగ్గించుకునేందుకు ప్రయత్నించండి
Also read: మంకీపాక్స్ వ్యాపిస్తోంది, ఆ వైరస్‌ను తట్టుకునేందుకు ఈ ఆహారాలను మెనూలో చేర్చుకోండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.