CPS Scheme: సీపీఎస్ ను రద్దు చేస్తామని ఇచ్చిన హామీని ఆంధ్రప్రదేశ్ సర్కారు అటకెక్కించినట్లేనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రానికి సంబంధించి అప్పుల వ్యవహారంలో వచ్చిన తాజా పరిణామంతో ఈ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ నిపుణులు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ - సీపీఎస్ పథకంలోి ప్రభుత్వం, ఉద్యోగల వాటాను చూపించి ఏపీ సర్కారు కొత్త రుణాలను తీసుకోవాలని అనుకుంటోంది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి కూడా పొందింది. రాజ్యసభలో అడిగిన ప్రశ్నపై కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి విషయాన్ని వెల్లడించారు. 


ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు..


సీపీఎస్ రద్దు చేసే ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారుకు అసలే లేదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అలాగే రాష్ట్రానికి సరిపడా ఆదాయం లేక అప్పులు చేయడంపైనే ఆధారపడింది సర్కారు. ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేస్తూ వెళ్తోంది ప్రభుత్వం. జీఎస్డీపీలో 3.5 శాతం మేర రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుండి రుణాలు తీసుకునేందుకు ఆర్థిక సంఘం అనుమతించింది. 


మరికొన్ని రుణాలూ తీసుకోవచ్చు..


ఈ మేరకు 2022-23 ఆర్థిక ఏడాదిలో ఏపీ రూ.44,574 కోట్లు మాత్రమే రుణాలు తీసుకోవాలని ఆర్థిక సంఘం తేల్చి చెప్పింది. అంతకుమించి రుణాలు తీసుకోవద్దని హెచ్చరించింది. సీపీఎస్ నిధుల వాటా ఆధారంగా మరో రూ.4203.96 కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతి ఇచ్చామని రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 1,92,000 మంది ఉద్యోగులు ఉన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద పదవీ విరమణ తర్వాత ఒకేసారి డబ్బు ఇచ్చే విధంగా ఉద్యోగుల వేతనం నుండి 10 శాతం సీపీఎస్ కింద జమ చేస్తారు. అంతే మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. ఈ రెండింటి మొత్తాన్ని అథారిటీకి జమ చేస్తుంది సర్కారు. 


14 శాతం కాకుండా 10 శాతమే..


సీపీఎస్ విధానంలో ఉద్యోగుల నుండి 10 శాతం జమ చేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం 14 శాతం జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలు మార్చింది. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇంకా అది అమలు కావడం లేదు. రాష్ట్రం ఉద్యోగులకు 10శాతం చొప్పున జమ చేస్తున్నందున ఆ మేరకు రుణాలు పొందేందుకు అనుమతి ఇవ్వాలని అడగ్గా... కేంద్రంలో ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. 2022-23 ఆర్థిక ఏడాదిలో సీపీఎస్ వాటా కింద చెల్లించే మొత్తం ఆధారంగా.. బహిరంగా మార్కెట్ లో ఆ మేరకు రుణాలు పొందవచ్చని కేంద్రం వెల్లడించింది. అయితే సీపీఎస్ మొత్తాన్ని చూపించి రుణాలు తీసుకోవాలనుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని, అటు అనుమతి ఇచ్చిన కేంద్ర సర్కారుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఉన్న అప్పులు సరిపోవడం లేదనా.. ఇప్పుడు ఉద్యోగుల డబ్బులను చూపించి రుణాలు తీసుకుంటున్నారా అని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. సీపీఎస్ మొత్తాన్ని చూపించడం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి.