లాక్‌డౌన్ టైమ్ యూట్యూబర్లకు బాగా కలిసొచ్చిందని చెప్పవచ్చు. ఇంట్లో ఉంటూనే మంచి కంటెంట్ ఇస్తూ మనల్ని ఎంటర్‌టైన్ చేశారు. వీటిలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వంట ఛానల్స్ గురించి. లాక్‌డౌన్ సమయంలో ఇవి చేసిన సహాయం అంతా ఇంతా కాదు. లాక్‌డౌన్ వల్ల చాలా మంది గరిటలు పట్టడం మొదలెట్టారు. వీటిని చూస్తూనే చాలా మంది వంటలు నేర్చుకున్నారు. మరి మన తెలుగులో మంచి వంటలు, స్వీట్లు, వెరైటీ రెసిపీలతో మన ఇంటి మనుషుల్లా మారిన ఓ ముగ్గురు యూట్యూబర్ల గురించి తెలుసుకుందామా?
హలో ఫుడీస్... (Vismai Food)
ఈ ఒక్క మాటతోనే యూట్యూబ్‌లో ట్రెండ్ సృష్టించింది విస్మయి ఫుడ్ ఛానల్. పరుచూరి తేజ అనే వ్యక్తి 2018 ఆగస్టులో ఈ ఛానల్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఛానల్‌కు 26.4 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. తేజ హలో ఫుడీస్ అంటూ తన వీడియోలను ప్రారంభిస్తారు. ఇతర ఛానళ్లతో పోలిస్తే విస్మయి ఫుడ్ వీడియోల నిడివి తక్కువగా ఉంటుంది.
మొదట్లో 1 నుంచి 2 నిమిషాలలోపు వీడియోలను పోస్ట్ చేసేవారు. క్రమంగా నిడివి పెరుగుతూ వచ్చింది. తేజ వాయిస్, రుచికరమైన వంటలు, వీడియోల నిడివి తక్కువగా ఉండటం, విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ ఈ చానల్‌కు అదనపు ఎట్రాక్షన్ అని చెప్పవచ్చు. ఫుడ్ లవర్స్ అయితే ఇదో ఐఫీస్ట్ లాంటిదని అంటారు. విస్మయి ఫుడ్ ఛానల్‌కు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో కూడా లక్షల్లో ఫాలోవర్లు ఉన్నారు. ఈ ఛానల్‌లో రవ్వ లడ్డు, వెజ్ మంచూరియా, హైదరాబాదీ దమ్ బిర్యానీ, మైసూర్ పాక్ వీడియోలకు మంచి వ్యూస్ ఉన్నాయి.
శ్రావణీస్ కిచెన్ (shravani's kitchen)
శ్రావణి అనే గృహిణి ఈ ఛానల్ స్టార్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల వంటకాలతో పాటు మహారాష్ట్ర, నార్త్ ఇండియన్ ఫుడ్ వీడియోలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఛానల్‌లో 800కు పైగా వీడియోలు ఉన్నాయి. వీటన్నిటిలో పానీపూరి తయారీ వీడియోకు ఎక్కువ వ్యూస్ వచ్చాయని శ్రావణి ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన శ్రావణి కుకింగ్ పై ఉన్న మక్కువతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశారు. శ్రావణి ముంబైలో పెరగడంతో మహారాష్ట్ర వంటకాలపై అవగాహన ఉంది. వీటిని కూడా ఆమె తన ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తారు. శ్రావణి ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఛానల్‌కు 25 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు
అమ్మ చేతి వంట (Amma Chethi Vanta)
ఆవుల భార్గవి ఈ ఛానల్‌ను ప్రారంభించారు. రాజమండ్రిలో పుట్టి పెరిగిన భార్గవి బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేశారు. తల్లి సూచనతో 2017 మే 31న భార్గవి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. మొదట్లో వీడియోలకు వ్యూస్ ఎక్కువగా వచ్చేవి కావని.. సబ్‌స్కైబర్స్ కూడా చాలా తక్కువగా వచ్చేవారని తెలిపారు. వివిధ టెక్ ఛానల్స్ ద్వారా అన్ని విషయాలు నేర్చుకుని ప్రొఫెషనల్ యూట్యూబర్‌గా ఎదిగారు.
ప్రస్తుతం ఆమె ఛానల్‌ను 19.5 లక్షల మంది సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. ఈ చానల్ బాగా క్లిక్ అవడంతో 'మనలో మన మాట' అనే మరో చానల్‌ను కూడా ప్రారంభించారు. భార్గవి భర్త డాక్టర్. కరోనా సమయంలో ప్రజలకు ఉన్న అపోహలు తొలగించేందుకు ఆమె తన భర్తతో కలిపి కొన్ని వీడియోలు పోస్టు చేశారు.