వర్షంలో తడిస్తే చర్మం పాడయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే కొన్ని ఫేస్‌ప్యాక్‌లు వేసుకోవడం ద్వారా చర్మ సంబంధిత సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. వర్షాకాలంలో చల్లటి వాతావరణం కారణంగా గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. తద్వారా, చర్మం జిడ్డుగా మారుతుంది. ఇది క్రమంగా మొటిమలు, మచ్చలకు దారితీస్తుంది. కాబట్టి ఈ వర్షాకాలంలో మీ చర్మ సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం. 




అలర్జీ రాకుండా ఉండాలంటే
పావుకప్పు రోజ్‌వాటర్‌ని తీసుకొని దానికి టేబుల్‌స్పూన్ చందనం పొడి, పావు చెంచా పసుపుతో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్త్లె చేసుకొని అరగంట తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ట్యాన్, పొక్కుల వంటివి తొలగిపోతాయి. పసుపు, చందనంలో ఉన్న ఔషధ గుణాలు చర్మ సంబంధిత అలర్జీలు రాకుండా చేస్తాయి.


జిడ్డు పట్టకుండా


గుడ్డులోని తెల్లసొనకు చెంచా తేనె జత చేసి బ్లెండర్‌తో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమం క్లెన్సర్‌గా పనిచేసి ముఖాన్ని శుభ్రం చేస్తుంది. అలాగే ముఖం జిడ్డుగా మారకుండా కాపాడుతుంది.


* రోజుకు రెండుసార్లు గోరువెచ్చని నీటితో ముఖం కడగాలి. తద్వారా మీ ముఖం కాంతివంతం అవుతుంది. ముఖంపై ఏమైనా సూక్ష్మ క్రిములు ఉంటే అవి చనిపోతాయి. అంతేకాదు, దుమ్ము, ధూళి కణాలను ఇది తొలగిస్తుంది. ఆపై మీ చర్మం ఎంతో మృదువుగా తయారవుతుంది. 


* వర్షాకాలంలో నిమ్మకాయ ఎక్కువగా వాడకూడదు. ఎందుకంటే నిమ్మకాయలో ఎక్కువ ఆమ్లం ఉంటుంది. ఇది చర్మం మీద దద్దుర్లు కలిగించే అవకాశం ఉంటుంది. పొడిచర్మం ఉన్నవారు నిమ్మకాయను అసలు వాడకూడదు


* బియ్యం పిండిలో చర్మాన్ని బిగించే లక్షణాలు ఉన్నాయి. అందువల్ల ఫేస్ మాస్కులలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. పొడి చర్మం ఉన్నవారు అసలు బియ్యంపిండి వాడకూడదు. ఎందుకంటే బియ్యం పిండి చర్మంలో తేమను తగ్గిస్తుంది. దాంతో ముడతలు వస్తాయి.




* వర్షాకాలంలో చాలామంది నీళ్లు సరిగా తాగరు. కానీ.. వర్షాకాలంలో అయినా సరే నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల హైడ్రేట్‌గా ఉంటారు. దీనివల్ల చర్మం ఫ్రెష్‌గా, అందంగా కనిపిస్తుంది. 


* శనగపిండి చర్మ సంరక్షణలో చాలా ఉపయోగపడుతుంది. వానా కాలంలో జిడ్డు చర్మం ఉన్నవారికి హైడ్రేట్‌గా పనిచేస్తుంది. శనగపిండిలో పాలు లేదా పెరుగు కలిపి చర్మానికి రాస్తే చర్మంలో తేమ పెరుగుతుంది.


* అవకాడో పండు, అరటి పండును ముక్కలు ముక్కలుగా కోసి మెత్తగా పేస్టు చేయాలి. ఇందులో తేనె వేసి కలపాలి. ఈ పేస్టును ముఖానికి పట్టించి 45 నిమిషాల తర్వాత తీసివేస్తే చర్మం ప్రకాశిస్తుంది.