మెదడు చురుగ్గా ఉంటేనే మనం యాక్టీవ్‌గా ఉంటాం. ఆకాశంలో మబ్బుల్లా.. మెదడులో కూడా ఏదో గందరగోళం ఏర్పడితే? మనం కూడా కన్‌ఫ్యూజన్‌తో చేస్తున్న పనులు మరిచిపోతాం. లేదా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాం. అలసట, నడవలేని స్థితితో ముప్పుతిప్పలు పడతాం. దీనికి కారణం ఏమిటో తెలుసా? విటమిన్ B12.


నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ కేర్ ఎక్సలెన్స్ ఇటీవల B12 లోపాన్ని గుర్తించడం, మేనేజ్ చెయ్యడం గురించి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. మెదడు మొద్దుబారినట్లుగా అనిపించడం, అలసట, కదలికలో సమస్యలు ఉన్నట్లయితే.. దానికి రక్తహీనతో పాటు B12 లోపం కూడా ఉండొచ్చని నిపుణులు తెలుపుతున్నారు.   ప్రపంచ జనాభాలోని శాకాహారుల్లో ప్రతి పది మంది పెద్దల్లో ఒకరికి ఇలా B12 లోపం ఉందని గణాంకాలు చెబుతున్నాయి.


సమతుల ఆహారం తీసుకునే చాలా మందికి శరీరంలో సరిపడా B12 ఉంటుంది. కానీ కొంత మంది అలసట, నరాలకు సంబంధించిన కొన్ని లక్షణాలు, కన్ఫ్యూజన్ వంటి లక్షణాలు కనిపిస్తే B12 లోపం ఉందేమో అని అనుమానించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.


B12 ఎందుకు అవసరం?


ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి B12 అవసరం ఉంటుంది. నాడీ వ్యవస్థ బలంగా ఉండేందుకు, నిరోధక వ్యవస్థ చురుకుగా ఉండేందుకు కూడా B12 అవసరమవుతుంది. B12 తగినంత లేకపోతే రక్తహీనత బారిన పడతారు. రక్తహీనత శరీరంలోని ప్రతి అవయవం మీద ప్రభావం చూపిస్తుంది.


B12 లోపించినపుడు తెలియని ఒక తిమ్మిరి వంటి భావన, శరీరం బ్యాలెన్స్ తప్పుతుండడం, కొన్ని సార్లు కన్ఫ్యూజన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. మనం తీసుకునే ఆహారం నుంచి శరీరంలో శక్తి తయారవడానికి B12 దోహదం చేస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. అలసట నివారించడానికి కొన్ని సార్లు అలసట తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది.


విటమిన్ B12, బి6తో పాటు మరో బి కాంప్లెక్స్ కు చెందిన పోషకం ఫోలిక్ ఆసిడ్, అమైనోఆమ్లం హోమోసిస్టిన్ జీవక్రియకు కూడా అవసరమే. హోమోసిస్టిన్ ఎక్కువైతే డిమెన్షియా ప్రమాదం పెరుగుతుంది. అంతేకాదు గుండె జబ్బులకు కూడా కారణం కావచ్చని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.


లక్షణాలు ఎలా ఉంటాయి?


విటమిన్ B12 తగ్గినపుడు త్వరగా అలసి పోవడం, శక్తి హీనంగా అనిపించడం, చిన్న పనికే ఆయాసం రావడం వంటి లక్షణాలు ముఖ్యంగా కనిపిస్తాయి. ఎర్రరక్తకణాలు తగ్గిపోవడం వల్ల శరీరానికి కావల్సినంత ఆక్సిజన్ అందదు. అందుకే ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవే కాకుండా దృష్టిలో మార్పులు, అకస్మాత్తుగా కండరాల్లో సూదులతో గుచ్చుతున్న భావన కలగడం, కండరాల్లో బలహీనత, జ్ఞాపకశక్తి తగ్గడం, అకస్మాత్తుగా మూడ్ మారిపోవడం, ఏకాగ్రత కుదరకపోవడం, ఒక్కోసారి నాలుక కూడా నొప్పి గా అనిపిస్తుందని నిపుణులు లక్షణాల గురించి వివరిస్తున్నారు.


రోజుకు ఎంత బి12 అవసరం? శాకాహారులు, వీగన్లలో ఎందుకు లోపం?


ప్రతిరోజు పెద్ద వారికి 1.5 మైక్రోగ్రాముల విటమిన్ B12 అవసరమవుతుంది. B12 మన శరీరంలో సహజంగా తయారు కాదు. అందువల్ల దీన్ని ఆహారం ద్వారా లేదా సప్లిమెంట్ల రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. B12 ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు మాంసం, చేపలు, పాలు, పాల ఉత్పత్తులు వీటిలోనే ఎక్కువగా ఉంటుంది. శాకాహారం తీసుకునే వారికి తగినంత B12 ఆహారం ద్వారా అందదు. ఆరోగ్యానికి అవసరమైనంత B12 కోసం శాకాహారులు సప్లిమెంట్లు తీసుకోవడం అవసరం పడొచ్చని నిపుణుల సూచిస్తున్నారు.


వయసు పెరిగే కొద్దీ ఆహారం నుంచి B12 గ్రహించే శక్తి తగ్గుతుంది అందువల్ల పెద్దవారిలో సప్లిమెంట్లు తప్పనిసరి అవుతాయి. పెర్నీషియస్ అనీమియా అనే పరిస్థితి ఉన్న వారిలో తప్పకుండా B12 ను ఇంజక్షన్ రూపంలో అందించాల్సి ఉంటుంది.


ఏ ఆహారాల్లో ఎక్కువ


తృణధాన్యాలు, మొక్కల నుంచి లభించే పాలలో B12 ఎక్కువగా ఉంటుంది. గుడ్డు, పాల ఉత్పత్తులు, రొయ్యలు, ఇతర సీ ఫూడ్, చికెన్, ఇతర మాంసాహారాల్లో B12 పుష్కలంగా ఉంటుంది. శాకాహారులు B12 సప్లిమెంట్లు వాడాల్సి ఉంటుంది. బి కాంప్లెక్స్ అనేది మొత్తం 8 రకాల బి విటమిన్ల కలయిక. కనుక బీ కాంప్లెక్స్ సప్లిమెంట్లుగా తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.


Also read : Diabetes Tips: నిద్రకు ముందు ఈ నాలుగు పనులు చేస్తే చాలు, డయాబెటిస్ అదుపులో ఉండటం ఖాయం


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial