Food Adulteration and its Detection : మనం తినే ఆహారం అసలైనదో నకిలీదో గుర్తించడం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే అసలు కంటే నకిలీనే మంచిదేమో అనే రేంజ్లో వాటిని తయారు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ కల్తీ ఆహారం గురించి ఎన్నో వార్తలు రోజూ చూస్తూనే ఉన్నాము. కేవలం హైదరాబాద్‌లోనే కాక.. చుట్టుపక్కల కూడా ఈ కల్తీ ఆహారం దందా నడుస్తుంది. తాజాగా పారాచూట్ కొబ్బరి నూనె నుంచి.. రెడ్ లేబుల్ టీ వరకు వివిధ గృహోపకరణాలను తయారు చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఇలాంటి సమయంలో మార్కెట్లో మనం కొనే వాటిలో కల్తీ ఆహారాలను ఎలా గుర్తించాలో కొన్ని టిప్స్‌తో తెలుసుకోవచ్చు. ఈ టిప్స్‌తో మీరు అసలైనవి, నకిలీవి ఈజీగా గుర్తించవచ్చు అంటున్నారు నిపుణులు.
పుచ్చకాయలు
సమ్మర్లో పుచ్చకాయలకుండే డిమాండ్ వేరు. దాదాపు అందరూ దీనిని వేసవిలో తీసుకుంటారు. ఇదే క్యాష్ చేసుకునేందుకు కొందరు వాటిని కూడా కల్తీ చేస్తున్నారు. అయితే దీనిని ఓ సింపుల్ టిప్‌తో అసలుదో.. నకిలీదో తెలుసుకోవచ్చు. అదేలా అంటే.. మీరు పుచ్చకాయను మధ్యలో కోసి.. పుచ్చకాయ ముక్కకి మధ్యభాగంలో కాటన్‌ను పెట్టండి. అది రంగు మారితే నకిలీ అని గుర్తించండి. ఎందుకంటే పుచ్చకాయ నీరు రంగు కాటన్ రంగను మార్చదు. నకిలీ అయితేనే రంగు మారుతుంది.
బెండకాయలు..
బెండకాయలనే కాదు.. ఇతర గ్రీన్ కలర్ వెజిటేబుల్స్‌ను కాటన్‌బాల్స్‌తో టెస్ట్ చేయవచ్చు. కాటన్ బాల్స్‌పై నీటిని చల్లీ.. వాటిని బెండకాయలపై ఒత్తితే.. గ్రీన్ కలర్ రంగు కనిపిస్తుంది. అలా కనిపిస్తుంది అంటే.. అవి నకిలీవని అర్థం. కల్తీ చేయనివి రంగు మారవు.
టీపొడిని గుర్తించడం ఎలా?
ఓ పేపర్ తీసుకుని దానిపై టీపొడిని వేయండి. అది రంగును విడుదలచేస్తే.. అబ్బా మంచి రంగు వస్తుందనుకోకండి. ఎందుకంటే రంగు రానిదే మంచి టీపొడి. మీకు తెలుసా మార్కెట్లో వాడేసిన టీపొడిని ఆరబోసి మార్కెట్లో అమ్మేవారు కూడా ఉన్నారు. కాబట్టి టీ పొడి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆల్రేడి వాడేసిన టీపొడి రంగును త్వరగా విడుదల చేస్తుంది.
నెయ్యిని ఎలా గుర్తించాలంటే..
నెయ్యిని చాలా మంది ఆరోగ్య ప్రయోజనాల కోసం తీసుకుంటారు. అయితే.. దానిని క్యాష్ చేసుకునేందుంకు కొందరు కల్తీ నెయ్యిని తయారు చేసి మార్కెట్లలోకి వదిలేస్తున్నారు. మరి కల్తీ నెయ్యిని ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం. ఓ గ్లాస్లో నెయ్యి తీసుకోండి.. దానిలో అయోడిన్ సొల్యూషన్ వేయాలి. అది కలర్ ఛేంజ్ అయి బ్లూ కలర్లో మారితే కల్తీ నెయ్యి అని అర్థం. అంతేకాకుండా నెయ్యిని అయోడిన్ అబ్జార్వ్ చేసుకోదు.
కారం రంగు ఓకే కానీ.. రుచి లేదా
ఓ గ్లాస్లో నీళ్లు తీసుకోండి. దానిలో ఓ చెంచా కారం వేయండి. అసలైన కారం ముందు నీటిలో పైన ఉంటూ.. మొత్తంగా గ్లాస్ అడుగు భాగానికి చేరుకుంటుంది. ఎలాంటి రంగును ఇవ్వదు. అదే నకిలీ అయితే వాటర్ కలర్‌ను మార్చుతుంది.
తేనె, పాలను ఎలా గుర్తించాలి?
తేనెను ఎలా గుర్తించాలంటే.. గ్లాస్లో వాటర్ తీసుకోండి. దానిలో తేనెను వేయండి. తేనె నీటిలో మిక్స్ కాకుండా కిందకి చేరుకుంటే అది మంచిదని అర్థం. కొబ్బరి నూనెను ఓ గ్లాస్‌లోకి తీసుకోండి. దానిని ఫ్రిజ్‌లో ఉంచండి. మంచి కొబ్బరి నూనె అయితే మొత్తం గడ్డకడుతుంది. పాలను ఓ గ్లాస్లో తీసుకుని వాటిని కలిపితే ఎలాంటి బుడగలు రాకపోతే అవి మంచివని అర్థం.
మరిన్నీ..
చిలగడ దుంపలపై రుద్దితే రంగు మారితే అవి నకిలీవని గుర్తించాలి. మిరియాలను టేబుల్‌పై వేసి ఒత్తితే అవి త్వరగా బ్రేక్ కావు.. నకిలీవి అయితే దానిపై ఉన్న లేయర్ పోతుంది. బఠాణీలు కూడా రంగును విడుదల చేస్తే అవి నకిలీవని గుర్తించాలి. పసుపును ఓ గ్లాస్ నీళ్లలో తీసుకోవాలి. దానిలో కాస్త పసుపు వేయండి. నిజమైన పసుపు రంగును తక్కువగా ఇస్తుంది. మొత్తం కిందకి దిగిపోతుంది. నకిలీ అయితే ఎక్కువ రంగును ఇస్తుంది. ఈ సింపుల్ టిప్స్ మీరు వాడే పదార్థాలు నకిలివో కాదో చెప్తాయి అంటున్నారు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీ ఇంట్లో ఏమి నకిలివీ ఉన్నాయో ఈ టెస్ట్‌లతో గుర్తించేయండి.
Also Read : దాల్చిన చెక్క టీని ఇలా తాగితే కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది.. మరెన్నో బెనిఫిట్స్ కూడా