Cinnamon Tea Benefits : దాల్చిన చెక్క టీ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో అద్భుత ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా కొలెస్ట్రాల్ సమస్యలతో ఇబ్బందిపడేవారు దీనిని రెగ్యూలర్‌గా తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలకు వ్యతిరేకంగా పోరాడడంలో, శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపడంలో సహాయం చేస్తుంది. ఇవే కాకుండా దీనిని రోజూ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇంతకీ దీనిని తాగడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి? దాల్చిన చెక్క టీని ఎలా తయారు చేసుకోవాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
దాల్చిన చెక్క టీ తయారీ (Cinnamon Tea Recipe)
దీనిని తయారు చేయడానికి పెద్దగా పదార్థాలు అవసరం లేదు. కేవలం మూడు లేదా నాలుగు పదార్థాలు ఉంటే చాలు. దాల్చిన చెక్క, తేనె, టీ బ్యాగ్, నీరు. ముందుగా ఓ మగ్ తీసుకుని దానిలో దాల్చిన చెక్క వేయాలి. దానిలో మరుగుతున్న వేడినీరు పోయాలి. దానిపై మూత పెట్టి పది నిమిషాలు పక్కన ఉంచేయాలి. అనంతరం టీ బ్యాగ్ పెట్టి రెండు నిమిషాలు ఉంచాలి. టీ బ్యాగ్, దాల్చిన చెక్కను వడకట్టి దానిలో కాస్త తేనె కలుపుకుని తాగేయడమే. ఈ హెర్బల్ టీని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
యాంటీ ఆక్సిడెంట్లు
దాల్చిన చెక్క టీలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. మంటను అడ్డుకుని.. ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. రెగ్యూలర్‌గా తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు పెరిగి.. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు
గుండె జబ్బుల ప్రస్తావన వస్తే.. మంట, అధిక కొలెస్ట్రాల్ ముందు స్థానంలో ఉంటాయి. అయితే దాల్చిన చెక్కలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలోని మంటను తగ్గిస్తాయి. రోజువారీ దినచర్యలో దాల్చిన చెక్క టీని తాగడం వల్ల మంట తగ్గి మెరుగైన ఆరోగ్యం మీ సొంతమవుతుంది.
కొలెస్ట్రాల్ తగ్గించడంలో
దాల్చిన చెక్క టీని ప్రధానంగా కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం కోసం ఉపయోగిస్తారు. కొన్ని పరిశోధనలు కూడా ఇది కొలెస్ట్రాల్ తగ్గిస్తుందని తేల్చాయి. దాల్చిన చెక్క ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది ధమనిని నిరోధించే కొలెస్ట్రాల్‌ను శరీరం నుంచి వెలుపలికి పంపించేస్తుంది. దాల్చిన చెక్క టీని క్రమంగా తీసుకోవడం వల్ల మీ మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిల్లో మార్పులు వస్తాయి. కొలెస్ట్రాల్ తగ్గితే గుండె సమస్యలు దూరమవుతాయి.
చక్కెర స్థాయిలు అదుపులో ఉంచేందుకు
దాల్చిన చెక్క టీ రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అధిక కొలెస్ట్రాల్ ఉన్న వారి శరీరంలో చక్కెర స్థాయిలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అలాంటి వారు రెగ్యూలర్‌గా దాల్చిన చెక్క టీ తీసుకోవాలి. ఇది శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి.. బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ చేస్తుంది.
మరిన్ని ప్రయోజనాలు
మెరుగైన రక్తప్రసరణ మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దాల్చిన చెక్కటీ శరీరంలో రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిల్లో తగ్గింపు.. ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కాబట్టి దీనిని మీరు రెగ్యూలర్‌గా తీసుకోవచ్చు. అయితే ఉదయాన్నే పరగడుపును దీనిని తాగితే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి.
Also Read : హోలీ వేడుకల్లో భాంగ్ తాగారా? అయితే హ్యాంగోవర్‌ని తగ్గించే హోమ్ రెమిడీలు ఇవే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.