ఈ రోజుల్లో ఏది అసలైనదో.. ఏదో నకిలీదో తెలుసుకోవడం కష్టంగా మారింది. స్వచ్ఛమైన ఆహారం దొరకడం కష్టంగా మారింది. పాల ప్యాకెట్ల నుంచి కూరగాయల వరకు ఇలా ఎన్నో ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు. రోజూ వంటల్లో వాడే నూనెను సైతం కల్తీ చేసేస్తున్నారు. అవి గానీ తింటే అనారోగ్యానికి గురికావడం ఖాయం. అందుకే.. తప్పకుండా మీరు అప్రమత్తంగా ఉండాలి. వాటిలో ఒరిజినల్.. డూప్లికేట్‌కు మధ్య తేడాను తెలుసుకోవాలి.


వంటల్లో మనం వేరుశనగ, పామాయిల్, ఆలివ్ ఆయిల్ ఇలా ఎన్నో రకాల నూనెలను వాడుతుంటాం. అయితే మార్కెట్లో వంటల్లో కల్తీ నూనెను ఉపయోగిస్తున్నారు. నకిలీ నూనెలు హానికరమైన పదార్థాలను కలిగి ఉంటాయి. వాటిలో పోషకలు ఉండవు. మనం వాడుతున్న వంట నూనె స్వచ్ఛమైనదా లేదా కల్తీదా అనేది ఎలా తెలుసుకోవాలో ఫుడ్ సెక్యూరిటీ అండ్ స్టాండర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FASSI) తెలిపింది. కల్తీ వంట నూనెను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. 


కల్తీ నూనెను గుర్తించే మార్గాలు:  


⦿ నూనెను కొనుగోలు చేసేటప్పుడు కవర్ వెనుక భాగంలో పేర్కొన్న పోషకాహార ప్రొఫైల్‌ను చెక్ చేయండి. 
⦿ ఆర్గానిక్, నాన్-GMOలను పరిశీలించండి. 
⦿ గడువు తేదీని తప్పనిసరిగా చూడాలి. ఎందుకంటే ఈమధ్య కాలం చెల్లిన (ఎక్స్‌పైరీ) పదార్థాలను కూడా అమ్ముతున్నారు. 
⦿ మీరు కొనుగోలు చేస్తున్న నూనె ధర సగటు మార్కెట్ ధర కంటే తక్కువగా ఉంటే, అది కల్తీ కావొచ్చని భావించాలి. 
⦿ అసలైన నూనెలు స్వచ్ఛమైన వాసన స్వభావం కలిగి ఉంటాయి.
⦿ తాజా, స్వచ్ఛమైన నూనెలు ఎల్లప్పుడూ సహజమైన రుచిని కలిగి ఉంటాయి. నకిలీ అయితే రుచిలో తేడా ఉంటుంది. 
⦿ కొద్ది మొత్తంలో నూనె తీసుకొని ఫ్రిజ్‌లో ఉంచండి. రెండు గంటల తర్వాత, నూనె స్వచ్ఛంగా ఉంటే, అది ఘనీభవిస్తుంది. కల్తీ అయితే ద్రవంగా ఉంటుంది.
⦿ తెల్ల కాగితంపై కొద్దిగా నూనె వేసి ఆరనివ్వండి. ఇది స్వచ్ఛంగా ఉంటే అది కాగితంపై పారుకుపోతోంది. 
⦿ ఆవనూనెలో కల్తీని చెక్ చేయడానికి, అందులో ఒక టీస్పూన్ నైట్రిక్ యాసిడ్ వేసి కలపాలి. ఆవాల నూనె రంగు మారినా లేదా పైభాగంలో ఉంగరంలా ఏర్పడినా అది కల్తీగా పరిగణించాలి. 


కల్తీ నూనెలు మీ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి?


⦿ కల్తీ నూనెలు ట్రాన్స్ ఫ్యాట్స్, గుండె జబ్బులు, ఊబకాయం, టైప్ 2 మధుమేహం వంటి ప్రమాదాలను పెంచుతాయి.
⦿ పురుగు మందుల అవశేషాలు లేదా పారిశ్రామిక రసాయనాలు వంటి విషపూరిత కలుషితాలు కాలేయం, మూత్రపిండాలు, నాడీ సంబంధిత సమస్యలకు దారి తీస్తాయి. రోగనిరోధక వ్యవస్థ బలహీనపరుస్తాయి.
⦿ నకిలీ నూనెలలో ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు లేకపోవడం వల్ల జీవక్రియకు అవసరమైన కీలక పోషకాలను మీ శరీరం కోల్పోతుంది.
⦿ కల్తీ నూనెలను ఎక్కువ రోజులు ఉపయోగిస్తే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కొందరిలో గురక వంటి సమస్యలు వస్తాయి.


Read Also : నాన్​ వెజ్​ ఎక్కువగా తింటున్నారా ? అయితే మీ లివర్ మటాషే.. న్యూ స్టడీలో షాకింగ్ విషయాలు


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.