Crimean Congo Haemorrhagic Fever: స్పెయిన్ వైద్యులు అరుదైన క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ కేసును గుర్తించారు. సుమారు 74 ఏండ్ల వృద్ధుడికి ఈ వ్యాధి సోకినట్లు తేల్చారు. కాస్టిల్ ప్రాంతానికి చెందిన ఆ వ్యక్తి జులై 21న లియోన్ ప్రాంతంలోని ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల అనంతరం అతడికి ఈ అరుదైన వ్యాధి సోకినట్లు తేలడంతో.. అతడిని మరో ఆస్పత్రికి తరలించారు. టిక్ అనే పేను లాంటి రక్తం పీల్చే జీవి కాటుతో ఆయనకు ఈ వ్యాధి సోకినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉన్నట్లు అక్కడి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. 2011లో స్పెయిన్ తొలి క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్‌ని గుర్తించారు. 2016లో టిక్ కాటుకు గురైన ఓ వ్యక్తి క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ సోకి మరణించాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ కేసును గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.


ఇంతకీ క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ అంటే ఏంటి?


క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్(CCHF) అనేది టిక్-బర్న్ వైరస్ కారణంగా సోకుతుంది. ఈ వ్యాధిని 1944లో తూర్పు ఐరోపాలో క్రిమియాలో మొదటిసారిగా గుర్తించారు. దీనికి క్రిమియన్ హెమరేజిక్ ఫీవర్ అని పేరుపెట్టారు. 1969లో ఈ వ్యాధి కాంగోలో గుర్తించారు. ఆ తర్వాత దీన్ని క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ అని పిలవడం మొదలుపెట్టారు. టిక్-బర్న్ వైరస్ కారణంగా తీవ్రమైన వైరల్ హెమరేజిక్ ఫీవర్ సోకుతుంది. క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ వైరస్ సోకిన వారిలో 10 నుంచి 40 శాతం మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది.   


క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ ఎలా సోకుతుంది?


ప్రపంచ ఆరోగ్య సంస్థ  ప్రకారం, క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ వైరస్ సోకిన పేలు పశువులను కరవడం వల్ల వాటికి కూడా ఈ వైరస్ సోకే అవకాశం ఉంది. లేదంటే ఈ వైరస్ ఉన్న జంతువుల రక్తం అంటినప్పుడు కూడా ఈ ఫీవర్ వస్తుంది. వ్యవసాయ కార్మికులు, పశువైద్యులు, కబేళా కార్మికులు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. ఈ వైరస్ సోకిన వ్యక్తి నుంచి మరొకరికి రక్తం అంటడం ద్వారా, లేదంటే లైంగిక సంబంధం కారణంగా వ్యాపిస్తుంది.   


క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ లక్షణాలు  


టిక్ కాటు తర్వాత 3 నుంచి 9 రోజులలో ఈ ఫీవర్ వస్తుంది. గరిష్టంగా 13 రోజులకు ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయి. క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్‌తో బాధపడుతున్న వారిలో చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. జ్వరం, వెన్నునొప్పి, మెడ నొప్పి, గొంతు నొప్పి, తలనొప్పి, కీళ్ల నొప్పి, కడుపు నొప్పి, వాంతులు, వికారం, విరేచనాలు, మానసిక ఆందోళన కలుగుతాయి. నెమ్మదిగా నిద్రలేమి ఏర్పడుతుంది. ఫీవర్ తీవ్రత పెరిగితే కళ్ళు ఎర్రబారడం,  గొంతు ఎర్రగా మారడం, ముఖం ఎర్రబడటం, ముఖం మీద ఎర్రటి మచ్చలు ఏర్పడుతాయి. కామెర్లు కూడా సోకే అవకాశం ఉంటుంది. గుండె సమస్యలు, కిడ్నీ ఫెయిల్యూర్, పల్మనరీ ఫెయిల్యూర్ తో పాటు లివర్ ఫెయిల్యూర్ ఏర్పడుతాయి. ఈ లక్షణాలు సుమారు 2 వారాల వరకు కొనసాగే అవకాశం ఉంది. క్రిమియన్-కాంగో హెమరేజిక్ జ్వరం కారణంగా ఆసుపత్రిలో చేరిన రోగులలో మరణాల రేటు 9 శాతం నుంచి 50 శాతం వరకు ఉంది.  


క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్‌ చికిత్స  


క్రిమియన్ కాంగో జ్వరం సోకిన వారికి శరీరం డీహైడ్రేట్ కాకుండా ఎలక్ట్రోలైట్ స్థాయిలను మెయింటెయిన్ చేయాలి. ఆక్సిజనేషన్ అందించాలి. యాంటీవైరల్ డ్రగ్ రిబావిరిన్ తో ట్రీట్మెంట్ అందించాలి.  


క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్‌ నివారణ  


క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ వ్యాప్తి జంతువులు వాటి మీద ఉండే పేలు కలిగిస్తాయి. వీలైనంత వరకు జంతువుల చర్మం మీద పేలు పడకుండా చూసుకోవాలి. పశువుల దగ్గరికి వెళ్లినప్పుడు నిండైన దుస్తులు ధరించాలి.


 


Also Read : డిజిటల్ యుగం.. ప్రమాదంలో పిల్లల ‘నిద్ర’ - ఈ పాపం పెద్దవాళ్లదే!