అప్పటి వరకు కూర్చుని ఒక్కసారిగా లేచి నిలబడినప్పుడు కళ్ళు తిరిగినట్టు అనిపించిందా? ఇది చాలా మందికి సర్వసాధారణంగా ఎదురయ్యే అనుభవమే. తేలికగా తీసుకుంటారు.. కానీ కొన్ని సార్లు వైద్యపరమైన చికిత్స తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. దీన్ని హెడ్ రష్ లేదా ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అని పిలుస్తారు. శరీరంలో కలిగే వేగవంతమైన మార్పు కారణంగా ఇది సంభవిస్తుంది. ఒక్కసారిగా నిలబడినప్పుడు కళ్ళు తిరగడం వల్ల బ్యాలెన్స్ కోల్పోయేలా చేస్తుంది. దృష్టి తగ్గిపోతుంది. ఇది తాత్కాలికంగా రక్తపోటు తగ్గడం వల్ల మెదడుకి రక్తం, ఆక్సిజన్ సరఫరా తగ్గిస్తుంది. రెటీనాకు కూడా రక్త సరఫరా పడిపోతుంది. దీని వల్ల కంటి చూపు చీకటిగా మారుతుంది.
మనం లేచి నిలబడినప్పుడు 300 నుంచి 800 సెం. మీ క్యూబ్ రక్తం కాళ్ళలోకి లాగబడుతుంది. ఇది రక్తపోటులో తగ్గుదలకి దారితీస్తుంది. దీని వల్ల శరీర ప్రతిస్పందిస్తుంది. రక్తనాళాలు సంకోచించబడతాయి. కాళ్ళలో కండరాలు, కడుపు సంకోచిచీ హృదయ స్పందన రేటు పెరుగుతుంది. శరీరం నిర్జలీకరణానికి గురైతే లేదా ఏదైనా అనారోగ్యంతో బాధపడుతుంటే కళ్ళు తిరిగే సమయం ఎక్కువగా ఉంటుంది. క్రమం తప్పకుండా ఇటువంటి సమస్య ఎదురైతే మాత్రం దాన్ని విస్మరించకూడదు. హైపోటెన్షన్ మూడు నిమిషాలకి మించి కొనసాగితే ఆందోళన చెందాల్సిన పరిస్థితి. ఇది అరుదైన సందర్భాలలో నరాలు దెబ్బతినడానికి సంకేతం కావచ్చు. అటానమిక్ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.
మయో క్లినిక్ ప్రకారం ఇటువంటి పరిస్థితి తక్కువ హృదయ స్పందన రేటు, షుగర్ లెవల్స్ పడిపోవడం, థైరాయిడ్ పరిస్థితులతో బాధపడుతున్నప్పుడు కూడా కనిపిస్తుంది. ఎన్ హెచ్ ఎస్ ప్రకారం గుండె వైఫల్యం, విటమిన్ బి 12 లోపం, మద్యపానం, పార్కిన్సన్, అల్జీమర్స్, రక్తహీనత, అథెరోస్క్లెరోసిస్ వంటి ఇతర అనారోగ్య పరిస్థితుల వల్ల కూడా ఇదే విధంగా కళ్ళు తిరగడం జరుగుతుంది. ఈ లక్షణాలు ఏవైనా కనిపిస్తే వెంటనే వైద్యులని సంప్రదించి చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గినప్పుడు
రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే ఎంత ప్రమాదమో, తగ్గినా కూడా అంతే ప్రమాదం. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తక్కువగా ఉండడాన్ని ‘తక్కువ బ్లడ్ షుగర్ లేదా హైపోగ్లైసీమియా’ అంటారు. ఇది ప్రధానంగా మధుమేహం ఉన్నవారిలోనే కనిపిస్తుంది. తగినంత నీరు తాగకపోయినా రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పడిపోతాయి. దీనికి సకాలంలో చికిత్స అందకపోతే రక్తంలో చక్కెర శాతం ఇంకా తగ్గి మరణం సంభవిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గగానే ఒళ్లంతా అకారణంగా చెమటలు పడతాయి. తీవ్ర అలసటగా అనిపిస్తుంది, తల తిరుగుతుంది. వికారంగా అనిపిస్తుంది. అటువంటి సమయంలో చిన్న బెల్లం ముక్క లేదంటే చాక్లెట్ నోట్లో వేసుకుంటే సరిపోతుంది. కాసేపటికి శరీరం సాధారణ స్థితికి చేరుకుని నీరసం తగ్గిపోతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: హాయిగా నిద్రపోవాలని ఉందా? అయితే, ఈ ఆయుర్వేద పానీయాలు తీసుకోండి