ప్రపంచ వ్యాప్తంగా నిత్యం ఎన్నో జంతువులు, పక్షులు కనుమరుగైపోతున్నాయి. పిచ్చుకల నుంచి మొదలుకొంటే.. అరుదైన జింకలు, పులులు సైతం అంతరించిపోయేందుకు సిద్ధం అవుతున్నాయి. అలాంటి కోవకు చెందినదే టాస్మానియన్ టైగర్. దీనినే థైలాసిన్ అని కూడా పిలుస్తారు. ఈ జీవి ఆస్ట్రేలియా, టాస్మానియాతో పాటు న్యూ గినియా దేశాల్లో కనిపిస్తుంది. పులి చారలు కలిగిన కుక్క మాదిరిగా ఈ జీవి ఉంటుంది. ఈ అరుదైన జాతి అంతరించిపోయేందుకు సిద్ధంగా ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ జాతిని కాపాడేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రపంచ ప్రఖ్యాత కోలోసల్ బయోసైన్సెస్ ఈ జాతిని క్లోన్ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. టాస్మానియన్ టైగర్  డి-ఎక్స్‌టింక్షన్‌ను ప్రారంభించినట్లు కోలోసల్ బయోసైన్సెస్ ప్రకటించింది.


టాస్మానియన్ టైగర్ చూడ్డానికి కుక్కలాగా కనిపించినా.. ఇదో వన్యప్రాణి. దీనిని ప్రతిసృష్టి చేయనున్నట్లు కోలోసల్ బయోసైన్సెస్ తాజాగా ప్రకటించింది. ఇప్పటికే  అంతరించి పోవడానికి సిద్ధంగా ఉన్న ఉన్ని ముముత్ తో పాటు కీస్టోన్ జాతులను పునరుద్దరించాలని కోలోసల్ ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే వీటిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఉన్ని మముత్ పునరుద్ధరణ బృందం ఇప్పుడు సెల్ ఇంజనీరింగ్, స్టెమ్ సెల్ బయాలజీ, ఎంబ్రియాలజీ, కంప్యూటేషనల్ బయాలజీ,  జీనోమ్ ఇంజనీరింగ్‌తో పాటు మముత్ డి-ఎక్స్‌టింక్షన్ మిషన్‌పై దృష్టి సారించింది. ఇందుకోసం మూడు ప్రయోగశాలలతో సహా పలు రంగాల్లో కీలక పరిశోధనలు చేస్తున్న 35 మంది కీలక శాస్త్రవేత్తల బృందం పని చేస్తుంది. ఇప్పటికే కొలోసల్ నిపుణుల బృందం థైలాసిన్ పై పరిశోధనల కోసం ఓ టీంను ఏర్పాటు చేసింది. ఈ ప్రయోగాల కోసం సరికొత్త ప్రయోగశాల సిద్ధం అవుతోంది. 


“భూ గ్రహంలో జీవవైవిధ్యం ప్రమాదంలో ఉన్నది. జీవాన్ని నిలబెట్టడానికి అవసరమైన జాతులు, పర్యావరణ వ్యవస్థలను సంరక్షించడానికి  శాస్త్రీయ వనరులను అందించడానికి ప్రయత్నిస్తాం” అని  కోలోసల్ సహ వ్యవస్థాపకుడు, CEO అయిన బెన్ లామ్ ప్రకటించారు. ఇందుకోసం కొలోసల్.. మెల్బోర్న్ విశ్వవిద్యాలయం,  థైలాసిన్ ఇంటిగ్రేటెడ్ జెనెటిక్ రిస్టోరేషన్ రీసెర్చ్ ల్యాబ్‌ లతో  కలిసి పని చేస్తున్నది.  ప్రముఖ మార్సుపియల్ ఎవల్యూషనరీ బయాలజిస్ట్, ప్రపంచంలోని అగ్రగామి టాస్మానియన్ టైగర్ నిపుణుడు ఆండ్రూ పాస్క్ సహకారం అందించడంతో పాటుగా , కొలోసల్ కు చెందిన  ప్రతిష్టాత్మకమైన సైంటిఫిక్ అడ్వైజరీ బోర్డ్‌ లోనూ ఆయన చేరారు. ఈ ప్రాజెక్ట్ నుంచి సాంకేతికత, కీలక అభ్యాసాలు వచ్చే తరం మార్సుపియల్ పరిరక్షణ సైతం ప్రభావితం చేస్తాయని డాక్టర్ పాస్క్ వెల్లడించారు.  ల్యాండ్‌స్కేప్‌లో థైలాసిన్‌ను రీవైల్డ్ చేయడం వల్ల ఆక్రమణ జాతుల కారణంగా ఈ సహజ ఆవాసాల నాశనాన్ని గణనీయంగా అరికట్టవచ్చన్నారు.  ఆస్ట్రేలియన్ సంస్కృతిలో టాస్మానియన్ పులి చిహ్నంగా ఉందని.. ఈ జాతిని తిరిగి తీసుకురావడంలో తానూ  భాగస్వామి కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.


అయితే 1999లో శాస్త్రవేత్తలు సంరక్షించబడిన థైలాసిన్ DNA నుండి టాస్మానియన్ పులిని క్లోన్ చేయడానికి ప్రయత్నించారు. కానీ DNA చాలా పాడైపోయింది. ఈ నేపథ్యంలో జన్యుపరంగా ఇంజనీరింగ్ చేయబడిన వన్యప్రాణులను తిరిగి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలపై నిపుణులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.