Shubman Gill Met Yuvraj Singh: టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తనను సెంచరీ చేసేలా ప్రోత్సహించాడని.. భారత యువ బ్యాట్స్ మెన్ శుభ్ మన్ గిల్ తెలిపాడు. జింబాబ్వే పర్యటనకు బయలుదేరే ముందు తాను అతడిని కలిసినట్లు చెప్పాడు.
22 ఏళ్ల గిల్ జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో తన తొలి శతకాన్ని సాధించాడు. ఈ మ్యాచులో టీమిండియా 13 పరుగుల తేడాతో గెలుపొందింది. గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకున్నాడు. కుడిచేతి వాటం ఆటగాడైన శుభ్ మన్ మూడు మ్యాచ్‌లలో122.50 సగటుతో 245 పరుగులు సాధించి అత్యధిక స్కోరర్ గా నిలిచాడు.
సిరీస్ ముగిసిన తర్వాత, గిల్ అతని సహచరుడు ఇషాన్ కిషన్ చేసిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఆ వీడియోలో గిల్ యువరాజ్ తనను ఎలా ప్రోత్సహించాడో చెప్పాడు.
మూడో వన్డే జరిగిన పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉందని.. పరిస్థితులు తనకు అనుకూలించాయని గిల్ తెలిపాడు. ఆ అవకాశాన్ని తాను సద్వినియోగం చేసుకున్నానని వివరించాడు. జింబాబ్వేకు వచ్చే ముందు తాను యువరాజ్ ను కలిసినట్లు చెప్పాడు. తాను బ్యాటింగ్ బాగా చేస్తున్నానని.. కుదురుకున్న తర్వాత బాగా ఆడాలని యువీ సూచించినట్లు గిల్ పేర్కొన్నాడు. అలాగే సెంచరీ కొట్టేలా తనను ప్రోత్సహించాడని తెలిపాడు.
జింబాబ్వే పర్యటనకు ముందు కూడా, వెస్టిండీస్ పర్యటనలో గిల్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. కరేబియన్ టూర్‌లోని ఒక మ్యాచ్‌లో 98 పరుగులు చేశాడు. వర్షం అంతరాయం కలిగించటంతో శతకం చేసే అవకాశం చేజారింది.
కెరీర్లో తొలి శతకం బాదిన గిల్ ను యువీ అభినందించాడు. సెంచరీకి శుభ్ మన్ అర్హుడని చెప్పాడు. ఇది ఆరంభం మాత్రమేనని గిల్ ముందు ముందు ఇంకా అనేక ఘనతలు సాధించాలని అభిలషించాడు.
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ గెలుచుకున్న గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన గిల్.. జట్టు కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.