శరీరం అనారోగ్యానికి గురైనప్పుడు అనేక లక్షణాలను చూపిస్తుంది. వాటిని తేలికగా తీసుకుంటే అది పెద్ద ప్రమాదానికి దారి తీసే అవకాశం  ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. వాటిని విస్మరిస్తే అవి దీర్ఘకాలిక అనారోగ్యానికి ప్రారంభ సంకేతాలు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా పెద్దవారిలో ఇటువంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చెయ్యకూడదని సూచిస్తున్నారు. ఊపిరి ఆడటంలో  ఇబ్బంది, మలబద్ధకం వంటి వాటిని నిర్లక్ష్యం చెయ్యకుండా తగిన సమయంలో స్పందిస్తే ప్రాణాంతక సమస్యల నుంచి బయట పడొచ్చని అంటున్నారు. అటువంటి కొన్ని ప్రమాదకర సంకేతాలు ఇవే..


ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది


శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తుంది కొంతమందికి. అది బలహీనత వల్లేమో అని అనుకుని దాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ అది చాలా ప్రమాదకరం. ధమనులు మూసుకుపోవడం వల్ల అసాధారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది. ధమణిలో రక్తం ప్రవహించకుండా అడ్డంకులు ఏర్పడతాయి. అటువంటి సమయంలో కుస శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది. అది నిర్లక్ష్యం చేస్తే గుండె పోటు సంభవించే ప్రమాదం ఉంది. ఛాతీ నొప్పి మాత్రమే గుండె పోటుకి సంకేతం కాదు. మైకం,ఛాతిలో బిగుతుగా అనిపించి శ్వాస ఆడకపోవడం కూడా ప్రమాదమే.


 రక్త స్రావం


మహిళల్లో మెనోపాజ్ వచ్చిన తరువాత కూడా జననాంగాల నుంచి రక్తస్రావం జరిగితే... అది ఆందోళన కలిగించే అంశం. సెక్స్ తర్వాత రక్తస్రావం అనేది కూడా ప్రమాద సూచనే. అది అలాగే కొనసాగితే స్త్రీ జననేంద్రియాల క్యాన్సర్ కి సంకేతంగా మారవచ్చు. అందుకే అలా కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్యులని కలిసి టెస్ట్ చేయించుకోవడం ఉత్తమం.


మలబద్ధకం


సాధారణంగా మలబద్ధకాన్ని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. మలవిసర్జన సమయంలో అధిక ఒత్తిడి ఉపయోగించాల్సి వస్తే అది హెమరాయిడ్స్ కి కారణం కావచ్చు. దీన్నే పైల్స్ సమస్య అంటారు. అప్పుడప్పుడు మలబద్ధకం సాధారణం కూడా కావచ్చు. కణితి లేదా పాలిప్ వంటి అడ్డంకి ఫలితంగా కూడా మలబద్ధకం ఏర్పడవచ్చు. దాని వల్ల మలం సరిగా కదలకుండా చేస్తుంది.


రొమ్ము వాపు


ఇది రొమ్ము క్యాన్సర్ అత్యంత సాధారణ సాంకేటాల్లో ఒకటిగా ఉంది. అందుకే దీన్ని అసలు విస్మరించకూడదు. రొమ్ము గడ్డగా మారిపోవడం రంగు మారడం, సైజు చిన్నది కావడం కూడా బ్రెస్ట్ క్యాన్సర్ కి సంకేతం కావచ్చు. రొమ్ములు ఉబ్బుగా వాసినట్లు మీకు అనిపిస్తే వెంటనే వైద్యులని సంప్రదించాలి.


ఇటువంటి చిన్న చిన్న విషయాలే కదా అని నిర్లక్ష్యంగా ఉంటే అవి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. వయసు ఎక్కువ ఉన్న వాళ్ళలో సాధారణంగా ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also read: పీరియడ్స్ వచ్చే ముందు రొమ్ముల్లో నొప్పి రావడం సహజమేనా?


Also read: ఈ చిత్రంలో మీకు మొదట ఏ జీవి కనిపిస్తోంది? దాన్ని బట్టి మీ మెదడు ఏ వైపు చురుగ్గా పనిచేస్తుందో చెప్పవచ్చు