ప్రపంచంలో సగం రోగాలను మోసుకొచ్చేది దోమలే. వీటి కారణంగానే ఎన్నో వైరల్ ఇన్ఫెక్షన్లు, భయంకరమైన రోగాలు సోకుతున్నాయి. వీటిని ఇంటికి దూరంగా ఉంచాలంటే ఇప్పు డు వాడే పద్ధతులు మస్కిటో కాయిల్స్, ఆల్ అవుట్ వంటివి. కానీ వాటిని దీర్ఘకాలంగా వాడడం మంచి పద్ధతి కాదు. దోమలు కూడా జీవులే. అలాంటి చిన్న జీవులపైనే ప్రభావం చూపించే ఈ రసాయనాలు, మనిషిపై చూపించవన్న గ్యారెంటీ లేదు. అందుకే వాటిని తక్కువగా వాడమని చెబుతున్నారు నిపుణులు. దోమల బెడద అధికంగా ఉంటే సహజ పద్ధతుల్లోనే వాటిని తరిమి కొడితే మంచిది. ముఖ్యంగా చుట్టుపక్కల నీరు నిలవకుండా చూసుకుంటే సమస్య ఉండదు. దోమల బ్యాట్‌ల ద్వారా కూడా కొంత ఉపశమనం లభిస్తుంది. అయితే ఇంటి ముందు కొన్ని రకాల మొక్కలు వాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. క్రీములు, లోషన్లు, స్ప్రేలు వాడే బదులు కొన్ని రకాల మొక్కల్ని కొని తెచ్చుకోండి. వాటిని మీ ఇంట్లోని తలుపులు, కిటికీల వద్ద పెంచండి. దోమలు ఆ మొక్కల వాసనకి దూరంగా వెళ్లిపోతాయి.


తులసి మొక్క ప్రతి ఇంట్లో ఉంటుంది. తులసి మొక్క ఔషధ గుణాలను నింపుకున్నది. ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ తులసి మొక్క నుంచి వచ్చే వాసన దోమలకు నచ్చదు. తులసి మొక్క ఉన్న చోట దోమలు ఉండవు. అలాగే దోమ కరిచిన చోట దురద వస్తే ఈ ఆకుల రసాన్ని పూస్తే మంచిది.


వేప చెట్టు ఉన్నచోట కూడా దోమలు, కీటకాలు ఎక్కువగా రావు. వేప చెట్టుని ఇంట్లో పెంచలేకపోవచ్చు, చిన్న చిన్న మొక్కల్ని పెంచుకునేందుకు ప్రయత్నించండి. ఇవి దోమలను తరిమికొడతాయి. దోమలను నివారించే పదార్థాల్లో కూడా వేపను వాడతారు.


రోజ్ మేరీ మొక్కలు నర్సరీలో లభిస్తాయి. ఈ రోజ్ మేరీ మొక్కల నుంచి వచ్చే వాసన కూడా దోమలకు నచ్చదు. ఇవి ఇంట్లోకి రాకుండా ఉండాలంటే తలుపులు, కిటికీలకు దగ్గరలో రోజ్ మేరీ మొక్కలను పెంచండి. లేదా ఈ మొక్క పువ్వుల్ని నీళ్లలో బాగా నానబెట్టి ఆ నీటిని ఇంట్లో స్ప్రే చేస్తూ ఉండండి.


లావెండర్ మొక్కలు కూడా దోమల్ని తరిమికొట్టడానికి సహాయపడతాయి. లావెండర్ నుంచి తీసిన నూనెను కొన్ని క్రీములు, లోషన్లలో వాడతారు. ఇంట్లో దోమలు అధికంగా తిరుగుతున్నప్పుడు లావెండర్ మొక్కలను ఇంటికి దగ్గరలో ఉంచండి. ఆ వాసనకు దోమలు దూరంగా వెళ్లిపోతాయి.


నిమ్మ మొక్క కూడా దోమలను తరిమి కొడుతుంది. చిన్న కుండీల్లో నిమ్మ మొక్కలను వేసుకొని తలుపులు, కిటికీలకు దగ్గరలో పెట్టుకుంటే దోమలు అటువైపు రావు. నిమ్మ ఆకుల్లో సిట్రోనెల్లా అధికంగా ఉంటుంది. ఇది దోమలను తరిమికొట్టే మందుల్లో కూడా వాడతారు.


బంతి మొక్కలు చాలా తక్కువ రేటుకే బయట లభిస్తాయి. వీటిని ఎక్కువ కుండీలలో నాటి ఇంటి చుట్టూ పెట్టుకోండి. ఈ పువ్వులు, ఆకుల నుంచి వచ్చే ఘాటైన వాసన దోమలకు నచ్చదు. బాల్కనీలో ఈ మొక్కలను ఎక్కువగా పెంచినా చాలు. అటువైపు దోమలు రావు. నీళ్లలో బంతిపూల రసం, ఆకుల రసాన్ని వేసి ఇంట్లోనే స్ప్రే చేస్తూ ఉన్నా కూడా దోమలు పారిపోతాయి.


Also read: పాలిచ్చే తల్లులు వీటిని తినకపోతేనే బిడ్డకు ఆరోగ్యం





Also read: డయాబెటిస్ ఉంటే మతిమరుపు వ్యాధి త్వరగా వచ్చేస్తుందట















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.