మెదడు ఎంత చక్కగా పని చేస్తే శరీరం కూడా అంత మెరుగ్గా పని చేస్తుంది. కొంతమందికి ఎంత చదివినా గుర్తుండదు. మరికొంతమంది చిన్న చిన్న విషయాలు కూడ మర్చిపోతూ చాలా ఇబ్బందులు పడతారు. అలాంటి వాళ్ళు మెదడు కోసం ప్రత్యేకంగా కొన్ని ఆహారాలు తీసుకుంటే బాగుంటుంది. అవి తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెంచుకునేందుకు దోహపడుతుంది. వాల్ నట్స్, ఆలివ్ ఆయిల్, సాల్మన్ చేపల్లో ఒమేగా ఆమ్లాలు అధికంగా లభిస్తాయి. గుండె ఆరోగ్యం, జీవక్రియ సరిగా ఉంచేందుకు ఒమేగా ఆమ్లాలు కీలకంగా వ్యవహరిస్తాయి. వాల్ నట్స్ లోనే కాకుండా మాకేరెల్, సార్డినెస్, ట్యూనా వంటి చేపల్లోను సమృద్ధిగా లభిస్తుంది. అనేక అధ్యయనాలు కూడా ఇవి మెదడు జ్ఞాపకశక్తిని పెంచుతాయని వెల్లడించాయి.
ప్రస్తుత రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా మతిమరుపు, డీమెన్షియా(చిత్త వైకల్యం), అల్జీమర్స్ వస్తున్నాయి. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ ఆహార పదార్థాలు చక్కగా పని చేస్తాయని ఒక స్టడీ తెలిపింది. తరచూ డైట్లో భాగంగా వీటిని తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యం బాగుంటుందని తేలింది.
ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు చిత్త వైకల్యాన్ని ఎలా అధిగమిస్తాయి?
యూటీ హెల్త్ శాన్ ఆంటోనియోలోని బిగ్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ అల్జీమర్స్, న్యూరోడెజెనరేటివ్ డీసీజెస్, మెదడు పరిశోధన సంస్థల నిపుణులు సంయుక్తంగా ఒక అధ్యయనం చేశారు. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు తీసుకోవడం వల్ల మధ్య వయస్కుల్లో దాని ప్రభావం జ్ఞాపకశక్తి మీద ఎంత వరకు పడుతుందని విశ్లేషించారు. న్యూరాలజీ జర్నల్ 2022 ఎడిషన్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం 2,183 మంది ఆరోగ్యకరమైన వ్యక్తులు ఇందులో పాల్గొన్నారు. వారి మెదడు ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంది.
అధ్యయనంలో పాల్గొన్న వాళ్ళు ఒమేగా 3 ఆమ్లాలు తీసుకున్నప్పుడు మెదడులో జరిగిన మార్పులని గమనించారు. కొవ్వు చేపలు, వాల్ నట్స్ తింటున్న సమయంలో మెదడు పనితీరు ఎలా ఉంటుందో కనుగొన్నారు. వారి మెదడు స్కాన్, MRI స్కాన్ లని విశ్లేషించారు. ఇవి తీసుకున్న తర్వాత వారి జ్ఞాపకశక్తి మెరుగుపడిందని గుర్తించారు. అభిజ్ఞా క్షీణతతో బాధపడుతున్న వాళ్ళు సాల్మన్, వాల్ నట్స్, ఆలివ్ ఆయిల్, ఇతర కొవ్వు చేపలని పుష్కలంగా తినడం వల్ల డీమెన్షియా ప్రమాదాన్ని నివారించవచ్చు.
శాఖాహారులు అయితే చేపలు తినరు కనుక మొక్కల ఆధారిత పదార్థాల ద్వారా వాటిని పొందవచ్చు. కనోలా నూనె, చియా గింజలు, వేరుశెనగ, అవిసె గింజల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. ఆర్టిచోక్ కూడా ఈ పోషకాలు లభించే గొప్ప మూలం. మెరుగైన ఫలితాలు పొందేందుకు వారానికి కనీసం రెండు సార్లు ఈ ఆరోగ్యకరమైన ఆహారాలు తినేలా డైట్ ప్లాన్ చేసుకోవాలి. ఇక వాల్ నట్స్, చియా గింజలు లాంటివి అయితే రోజు తిన్న కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: రోజూ ఈ విత్తనాలు తింటే అనారోగ్యాలన్నీ పరార్!