కరోనా వైరస్ మహమ్మారి నుంచే ఇంకా కోలుకోలేదు. ఇప్పుడు మంకీపాక్స్ దాపురించింది. ఇప్పటికే గ్లోబల్ ఎమెర్జెన్సీని ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఎప్పుడో అంతరించి పోయిన మశూచి (స్మాల్ పాక్స్) లక్షణాలను కూడా మంకీ పాక్స్ కలిగి ఉంది. అందుకే మొదట్లో స్మాల్ పాక్స్ మళ్లీ అడుగుపెట్టిందేమో అని అనుమానించారు. కానీ చివరికి మంకీపాక్స్ అని తేల్చారు. జూలై 22 నాటికి సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రరోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ చెప్పిన ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 16,836 మందికి మంకీ పాక్స్ సోకినట్టు గుర్తించారు. ఇప్పుడు అంతర్జాతీయ వైద్యులంతా ఒక్కటై మంకీపాక్స్ విషయంలో సమావేశాలు ఏర్పాటు చేశారు. వారంతా మంకీపాక్స్ సోకిన వ్యక్తులలో మూడు కొత్త లక్షణాలను గుర్తించారు. 


న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ అధ్యయనం ప్రకారం ఏప్రిల్ 27 నుంచి  జూన్ 24,2022 మధ్యలో దాదాపు 528 కేసులను గుర్తించారు. మంకీపాక్స్ సోకిన వారిలో చర్మ సమస్యలు, దద్దుర్లతో పాటూ ఇంకా అనేక లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. వాటిలో చాలా మటుకు గుర్తించబడనివే. వైద్యులు చెప్పిన ప్రకారం మంకీపాక్స్ సోకిన కొంతమందిలో జననేంద్రియాల వద్ద దద్దుర్లు, నోటిలో పుండ్లు, పాయువుపై దద్దుర్లు కూడా వస్తున్నాయి. ఈ మూడు కొత్త లక్షణాలను మంకీపాక్స్ లక్షణాలుగా గుర్తించారు వైద్యులు. 


అధ్యయనం ఇలా...
అధ్యయనంలో భాగంగా పదిమంది మంకీ పాక్స్ సోకిన వారిని ఎంపిక చేసుకున్నారు. వారిలో ఒకరికి జననేంద్రియాల వద్ద దద్దుర్లు వచ్చాయని గుర్తించారు. కొంతమంది కూర్చోవడానికి నొప్పితో ఇబ్బంది పడ్డారు. మంకీపాక్స్ లక్షణాలు సిఫిలిస్ లేదా హెర్పెస్ వంటి లైంగికంగా సంక్రమించే అంటువ్యాధుల మాదిరిగానే ఉన్నాయి. అందుకే ఈ లక్షణాలను మంకీపాక్స్ గా కాకుండా చాలా మంది లైంగిక వ్యాధులుగా గుర్తిస్తున్నారు. దీనివల్ల వైరస్ వ్యాప్తిని నియంత్రించే ప్రయత్నాలకు ఆటంకం కలుగుతున్నట్టు భావిస్తున్నారు పరిశోధకులు. 


కేవలం దాని ద్వారానే కాదు...
మంకీపాక్స్ కేవలం లైంగికంగా మాత్రమే సంక్రమించే వ్యాధి కాదని, అది ఎలాంటి దగ్గరి శారీరక సంబంధం ద్వారానైనా సంక్రమించవచ్చని చెబుతున్నారు వైద్యులు. ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలిసేలా చేయాలని అభిప్రాయపడుతున్నారు. మంకీ పాక్స్ చాప కింద నీరులా పాకేస్తోందని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. 


Also read: మంకీపాక్స్ - స్మాల్ పాక్స్ మధ్య తేడాను కనిపెట్టడం ఎలా? నిపుణులు ఏమంటున్నారు?


Also read: ఏడుపు వస్తే ఆపుకోకండి, మనసుతీరా భోరున ఏడ్చేయండి, ఏడుపు ఆరోగ్యానికి మేలే చేస్తుంది


Also read: చపాతీలు చేసేటప్పుడు ఈ పదార్థం కలపండి, త్వరగా బరువు తగ్గుతారు






గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.