వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పిల్లలు తరచూ పడకుండా ఉండాలంటే వారి రోగనిరోధక శక్తి  బలంగా ఉండాలి. లేకుంటే జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ బారిన త్వరగా పడుతుంటారు. వీటన్నింటి నుంచి తట్టుకునే శక్తి పిల్లలకు ఆహారం ద్వారా అందించాలి. వారిలో ఇమ్యూనిటీ పవర్‌ను పెంచే ఆహారాలు కొన్ని ఉన్నాయి. వాటిని రోజూ తినిపించేలా తల్లిదండ్రులు చూడాలి. ఇవన్నీ కూడా చాలా తక్కువ ధరకే లభిస్తాయి.


పిల్లలు రోజూ పెరుగు తినేలా చూడాలి. రాత్రిపూట కన్నా మధ్యాహ్నం పూట పెరుగు తినిపించడం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రాత్రిపూట పెరుగు పెడితే వారిలో జలుబు లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రోజుకు ఒక కప్పు పెరుగును బ్రేక్ ఫాస్ట్‌లో లేదా లంచ్‌లో తినిపించడం చాలా మంచిది. పెరుగు తినడం వల్ల పొట్టలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. దీనివల్ల పొట్ట సురక్షితంగా ఉంటుంది. పెరుగును శరీరం శోషించుకుంటుంది. కాబట్టి శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం తగ్గుతుంది. పెరుగులో క్యాల్షియం, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి మీ పిల్లలకి అత్యవసరమైనవి. 


పుల్లని పండ్లను కూడా వారి ఆహారంలో భాగం చేయాలి. ముఖ్యంగా ద్రాక్ష, నారింజ, బత్తాయి, కివి, దానిమ్మ వంటివి తినిపించాలి. రోజూ నిమ్మ రసాన్ని తాగించాలి. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. జామకాయల్లో కూడా విటమిన్ సి అధికంగానే ఉంటుంది. కాబట్టి పిల్లలకు ఈ పండ్లలో కనీసం రెండు పండ్లను రోజూ తినిపించడం వల్ల వారి రోగనిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది. ఇక కూరగాయల విషయానికొస్తే పాలకూర, కాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రొకోలీ వంటివి పిల్లలకి తినిపిస్తూ ఉండాలి. ఇవి రోగ నిరోధక శక్తిని చాలా పెంచుతాయి. వీటిలో కాల్షియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు  పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా రోగనిరోధక శక్తిని పెంచేందుకు చాలా అవసరం. 


అలాగే పిల్లలకు చేపలు, గుడ్లు, మటన్, చికెన్ వంటివి కూడా అప్పుడప్పుడు తినిపిస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా శరీరాన్ని సురక్షితంగా ఉంచేందుకు సహాయపడతాయి. మన శరీరానికి అవసరం విటమిన్ బి12,  ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు వీటిల్లో అధికంగా ఉంటాయి. బెర్రీ పండ్లను పిల్లల చేత అప్పుడప్పుడు తినిపిస్తూ ఉండాలి. సూపర్ మార్కెట్లలో బెర్రీలు, బ్లాక్ బెర్రీలు,  స్ట్రాబెర్రీలు దొరుకుతూ ఉంటాయి. వాటిని వారానికి కనీస రెండు నుంచి మూడుసార్లు తినిపించడం చాలా అవసరం. వీటిలో ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే నువ్వులు, గుమ్మడి విత్తనాలు, చియా సీడ్స్, పొద్దు తిరుగుడు గింజలు వంటివి తినిపిస్తూ ఉండాలి. వీటిలో పాలీ శాచువేటెడ్ కొవ్వులు ఉంటాయి. అలాగే ఎన్నో సూక్ష్మ పోషకాలు ఉంటాయి. వీటిలో విటమిన్ E కూడా లభిస్తుంది. ఇవన్నీ కూడా పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఓట్స్ కూడా అప్పుడప్పుడు తినిపిస్తూ ఉండాలి. రోజూ ఒక కోడిగుడ్డున ఉడకబెట్టి వారి చేత తినిపించాలి. ఎందుకంటే కోడిగుడ్లలో విటమిన్ ఏ, విటమిన్ బి12 ఉంటాయి. ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ పవర్‌ను పెంచి త్వరగా రాకుండా కాపాడుతాయి.


Also read: అప్పుడప్పుడు గంజి వచ్చేలా అన్నాన్ని వండండి, ఆ గంజిని తాగితే ఈ సమస్యలు దూరం


Also read: మెంతి ఆకులు వేసి బంగాళదుంప కూర ఇలా వండారంటే, ఎవరైనా సరే మొత్తం తినేస్తారు


















































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.