ఆకుకూరల్లో మెంతి ఆకు కూడా ఒకటి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ చాలామంది దీన్ని ఎక్కువగా ఉపయోగించరు. నిజానికి మెంతి ఆకులు వంటకాలకు మంచి రుచిని అందిస్తాయి. మెంతి ఆకులతో చేసే ఆలూమేతి కూర టేస్టీగా ఉంటుంది. దీన్ని తిన్నారంటే అన్నం మొత్తం కూరతో పూర్తి చేసేస్తారు దీన్ని చేయడం కూడా చాలా సులువు. కాబట్టి పెద్దగా కష్టపడక్కర్లేదు.


కావాల్సిన పదార్థాలు 
మెంతి ఆకులు - రెండు కట్టలు 
బంగాళదుంపలు - నాలుగు 
పసుపు - అర స్పూను 
ఉప్పు - రుచికి సరిపడా 
పచ్చిమిర్చి - రెండు 
నూనె - తగినంత 
ఇంగువ - చిటికెడు


తయారీ ఇలా
ఆలుగడ్డలను ముందుగానే ఉడకబెట్టుకోవాలి. పొట్టు తీసి ముక్కలుగా కోసుకోవాలిజ. ఇప్పుడు మెంతి ఆకులు కూడా రెడీ చేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక బంగాళదుంప ముక్కలను వేసి వేయించాలి. అవి బంగారు రంగులోకి మారాక, పచ్చిమిర్చి, పసుపు కూడా వేసి వేయించాలి. ఇంగువ కూడా చల్లాలి. ఇప్పుడు ఇందులోనే మెంతి ఆకులను వేసి బాగా కలపాలి. తర్వాత ఉప్పు వేయాలి. పైన మూత పెట్టి ఐదు నిమిషాలు పాటు మగ్గించాలి. అవసరమైతే నీళ్లు వేసుకోవచ్చు. మెంతి ఆకులు పచ్చివాసన పోయేదాకా చిన్న మంట మీద ఉడికించాలి. అంతే ఆలు మేతి కూర రెడీ అయినట్టే. దీని రుచికి నోరూరిపోతుంది. సాంబార్‌కి ఇది మంచి సైడ్ డిష్‌గా ఉంటుంది. నేరుగా దీన్ని అన్నంలో కలుపుకొని తిన్నా కూడా ఎంతో రుచిగా ఉంటుంది. పిల్లలకు ఈ కర్రీ కచ్చితంగా నచ్చుతుంది. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆలుమేతీ కూరను వారానికి కనీసం రెండుసార్లు వారికి పెట్టండి. దీన్ని వండడం కూడా చాలా సులువు. ఎక్కువ సమయం కూడా పట్టదు.


మెంతికూర తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కూరలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. కంటి సమస్యలు వచ్చే అవకాశాలను కూడా తగ్గిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ ఎ అధికంగా ఉంటాయి. మంచి కొలెస్ట్రాల్ పెంచుతాయి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దీనిలో విటమిన్ కె కూడా ఉంటుంది. ఇది గాయాల నుంచి వచ్చే రక్తం గడ్డకట్టడానికి ఇది చాలా అవసరం. మెంతిఆకులతో వండిన  ఆహారాన్ని తింటే అజీర్తి, గ్యాస్టిక్ సమస్యలు రాకుండా ఉంటాయి. జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. మలబద్ధకం సమస్య కూడా తగ్గిపోతుంది. డయాబెటిస్ ఉన్న వారు మెంతి ఆకులు తింటే ఎంతో మంచిది. పాలిచ్చే తల్లులు మెంతి కూర తినడం వల్ల పాలు అధికంగా ఉత్పత్తి అవుతాయి. 


Also read: డయాబెటిస్ ఉన్నవారు కచ్చితంగా వీటిని ఏదో ఒక పూట తినాల్సిందే


Also read: ఈ టీ కప్పు ఖరీదుతో జీవితాంతం ఏ లోటు లేకుండా బతికేయొచ్చు













































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.