ఒకప్పుడు గంజి పద్ధతిలోనే అన్నాన్ని వండేవారు. కాబట్టి రోజుకు రెండు పూటలా గంజి వచ్చేది. ఆ గంజిని తాగే వారి సంఖ్య అప్పట్లో ఎంతోమంది. గంజిలో కాస్త మజ్జిగ, ఉప్పు కలుపుకొని తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతారు. ఆయుర్వేదం కూడా ఇదే విషయాన్ని నిర్ధారిస్తోంది. ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం బియ్యంతో వండే గంజి వల్ల మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఎన్నో అందుతాయి. ఆయుర్వేదంలో ఈ గంజినీటిని ‘తందులోదక’ అని పిలుస్తారు. ఇది మన చర్మానికి, రోగనిరోధక వ్యవస్థకు, శరీరంలోని ఎలక్ట్రోలైట్ల సమతుల్యతకు గంజి చాలా అవసరం. మహిళల్లో చాలా సమస్యలకు గంజి చెక్ పెడుతుంది. మూత్ర విసర్జన సమయంలో మంట వస్తున్నా, రక్తస్రావం అవుతున్నా, విరోచనాలు అవుతున్నా, గంజిని తాగడం వల్ల త్వరగా ఆరోగ్యం లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గంజి నీటిని రోజుకొకసారి తాగడం చాలా మంచిది. ముఖ్యంగా శరీరం డీహైడ్రేషన్ బారిన పడినప్పుడు గంజినీరు తాగితే త్వరగా కోలుకుంటారు.
అన్నాన్ని వార్చే పద్ధతిలో వండుకోలేని వారు, ప్రత్యేకంగా గంజి కోసం కొంచెం బియ్యాన్ని వండుకోవడం ఉత్తమం. గుప్పెడు బియ్యాన్ని తీసుకొని ఒక గిన్నెలో వేసి, దానికి రెండు గ్లాసుల నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టాలి. బాగా ఉడికించి తెల్లటి చిక్కటి ద్రవం వచ్చేవరకు ఉంచాలి. తర్వాత వడకట్టి ఆ గంజిని తాగేయాలి. గంజినీరు ముతక బియ్యంతో చక్కగా వస్తుంది. బాస్మతి బియ్యం వాటితో గంజినీరు అంత ఎక్కువగా రాదు. బ్రౌన్ రైస్‌తో కూడా తీసుకోవచ్చు. పాలిష్ చేయని బియ్యం అయితే ఆరోగ్యకరమైన గంజినీరు తయారవుతుంది. పిల్లలకు దీన్ని తాగిపించడం ఎంతో మంచిది.
గంజినీరు చర్మానికి, జుట్టుకు ఎంతో పోషణ అందిస్తుంది. ఆ గంజినీటిని తాగడమే కాదు, జుట్టుకు, చర్మానికి రాసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. లుకోరియా సమస్యతో బాధపడే ప్రతి మహిళ గంజినీరును తాగాలి. లుకోరియా సమస్య బారిన పడిన మహిళల్లో వైట్ డిస్చార్జ్ అధికంగా అవుతుంది. మూత్ర విసర్జనలో మంట వస్తున్న వారు కూడా గంజినీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. నిజానికి గంజి ఒక ఒక ఎనర్జీ డ్రింక్. బలహీనంగా, నీరసంగా, అలసటగా ఉన్నప్పుడు ఈ గంజినీరు తాగితే మీకు శక్తి లభిస్తుంది. మీ శక్తి స్థాయిలను పెంచడంలో కూడా గంజినీరు ఎంతో ఉపయోగపడుతుంది. దగ్గు, జలుబుతో బాధపడే వారు కూడా గంజి నీటిని తాగడం అలవాటు చేసుకుంటే మంచిది.
Also read: మెంతి ఆకులు వేసి బంగాళదుంప కూర ఇలా వండారంటే, ఎవరైనా సరే మొత్తం తినేస్తారు
Also read: డయాబెటిస్ ఉన్నవారు కచ్చితంగా వీటిని ఏదో ఒక పూట తినాల్సిందే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.