నం తీసుకునే ఆహారాన్ని శరీరం శక్తిగా మార్చుకోవాలంటే విటమిన్ బి6 అవసరం. ఇది ప్రోటీన్ ను విచ్చిన్నం చేసి శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడుతుంది. విటమిన్ బి6 ని శరీరం స్వయంగా ఉత్పత్తి చేసుకోలేదు. అందుకే తప్పనిసరిగా ఆహార పదార్థాల ద్వారా మాత్రమే పొందగలుగుతారు. అప్పటికీ సరిపోకపోతే వైద్యులు సప్లిమెంట్ల రూపంలో విటమిన్ బి6 ఇస్తారు. ఇది మనకి చాలా అవసరమైన విటమిన్. ఇది నీటిలో కరిగే విటమిన్. శరీర విధులకు తప్పనిసరిగా అవసరం. ఈ విటమిన్ లోపిస్తే శరీరంలో అనేక లక్షణాలు కనిపిస్తాయి. వాటిని గ్రహించి వెంటనే తగిన చర్యలు తీసుకోకపోతే అనారోగ్యాల పాలవుతారు.


విటమిన్ బి6 ఇచ్చే పదార్థాలు


క్యారెట్లు, పాలు, అరటి, బచ్చలికూర, చికెన్ లివర్ వంటి ఆహారాల ద్వారా దీన్ని పొందవచ్చు. చేపలు, కొమ్ముశనగలు, వేరుశెనగ పలుకులు, సోయా బీన్స్, ఓట్స్ లో విటమిన్ బి 6 పుష్కలంగా దొరుకుతుంది.


విటమిన్ బి6 లోపం సంకేతాలు


మూడ్ స్వింగ్స్: విటమిన్ బి6 లోపం మానసిక స్థితి మీద ప్రభావం చూపిస్తుంది. కొన్ని సార్లు నిరాశ, ఆందోళన, చిరాకు, కోపం వంటి భావాలు ఎక్కువగా వ్యక్తపరుస్తారు. శరీరానికి సెరోటోనిన్, గామా అమినో బ్యూట్రిక్ యాసిడ్ వంటి అనేక న్యూరోట్రాన్స్మితారలు తయారు చేయడానికి విటమిన్ బి6 అవసరం. ఇది ఆందోళన, నిరాశ వంటి భావాలని నియంత్రించడంలో సహాయపడుతుంది.


అలసట: ఈ విటమిన్ లోపం కారణంగా తరచూ అలసిపోయిన భావ కలుగుతుంది. ఎక్కువగా నిద్రపోయేలా చేస్తుంది. కణాలకి తగినంత ఆక్సిజన్ రాకపోతే అది రక్తహీనతకు దారితీస్తుంది. దాని వల్ల అలసట, నీరసంగా అనిపిస్తుంది.


బలహీనమైన రోగనిరోధక శక్తి: రోగనిరోధక శక్తి తగినంతగా లేకపోవడం వల్ల అంటువ్యాధులు ఎక్కువ అవుతాయి. విటమిన్ బి6 ఉంటే రోగలతో పోరాడగలిగే శక్తి వస్తుంది.


దద్దుర్లు: విటమిన్ బి6 లోపం వల్ల చర్మం మీద ఎరుపు రంగు దద్దుర్లు వస్తాయి. మొహం, మెడ, తల, ఛాతీ మీద ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.



  • మెదడు పనితీరు మందగిస్తుంది.

  • హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.


మీరు ఈ లక్షణాలతో బాధపడుతున్నట్టయితే విటమిన్ బి6 లోపించిందని అర్థం. వెంటనే వైద్యులని కలిసి పరీక్షలు చేయించుకోవాలి. నిపుణులు సూచనల మేరకు అవసరమైతే సప్లిమెంట్ల రూపంలో విటమిన్ బి5 పొందాలి.


అతిగా వద్దు


విటమిన్ బి6 200mg కన్నా ఎక్కువ మోతాదులో తీసుకుంటే నాడీ సంబంధిత రుగ్మతలు వస్తాయి. అయితే ఇది చాలా అరుదుగా జరుగుతుంది. నరాలు దెబ్బతినడం వల్ల కాళ్ళలో స్పర్శ కోల్పోతారు. విటమిన్ బి6 ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి చాలా అవసరం. ఈ సంఖ్య తగ్గితే రక్తహీనత వంటి ఇతర అనారోగ్యాలకి దారి తీస్తుంది. అందుకే పరిమితంగా పోషకాహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: మీకు తెలుసా, మధ్యాహ్నం వ్యాయామం చేస్తే ఎక్కువ కాలం జీవిస్తారట, కానీ..