BS Yediyurappa Retirement:


ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండను: యడియూరప్ప


కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు. అసెంబ్లీలో ప్రసంగించిన ఆయన ఈ విషయం వెల్లడించారు. ఇకపై ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండనని స్పష్టం చేశారు. 


"రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. కానీ బీజేపీ గెలుపు కోసం నా ఊపిరున్నంత వరకూ పని చేస్తాను. బీజేపీని మరోసారి అధికారంలోకి తీసుకురావాలన్నదే నా లక్ష్యం. ఇది కచ్చితంగా జరిగి తీరుతుందని నమ్ముతున్నాను" 


- యడియూరప్ప, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి 


కర్ణాటకలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లోనే యడియూరప్ప చివరిసారి ప్రసంగించి ఈ నిర్ణయం ప్రకటించారు. అయితే...అంతకు ముందే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయనని ముందే చెప్పానని, కానీ పార్టీ కోసం కచ్చితంగా పని చేస్తానని అన్నారు. ఇప్పుడు అసెంబ్లీలో అధికారికంగా ఈ విషయం చెప్పారు. ఫేర్‌వెల్ స్పీచ్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1988 నుంచే కర్ణాటక బీజేపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు యడియూరప్ప. అప్పటికే ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 


"చాలా సందర్భాల్లో ప్రతిపక్షాలు పదేపదే విమర్శించాయి. బీజేపీ నన్ను పక్కన పెట్టేసిందని అన్నాయి. వారందరికీ ఇప్పుడు నేను చెప్పేది ఒకటే. నేను నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాను. ఇలాంటి అవకాశం మరే నేతకూ దక్కలేదు. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీకి నేనెప్పటికీ రుణపడి ఉంటాను" 


- యడియూరప్ప, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి 






యడియూరప్ప ప్రసంగంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆయన మాట్లాడారని కొనియాడారు. ట్విటర్‌లో కన్నడలో ట్వీట్ చేశారు.  


"ఓ బీజేపీ కార్యకర్తగా ఈ ప్రసంగాన్ని విన్నాను. నాకెంతో స్ఫూర్తినిచ్చింది. మా పార్టీ సిద్ధాంతాలు, విలువులను ఈ ప్రసంగం ప్రతిబింబించింది. మిగతా పార్టీ కార్యకర్తలకూ ఇది స్ఫూర్తినిస్తుందని విశ్వసిస్తున్నాను" 


-ప్రధాని నరేంద్ర మోదీ