వ్యాయామం ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల అనేక రోగాలు దరిచేరకుండా దూరం పెట్టేయవచ్చు. సాధారణంగా పొద్దునే వ్యాయామం చేస్తారు. కొంతమంది తమ వీలుని బట్టి మధ్యాహ్నం లేదా సాయంత్రం చేస్తారు. అయితే మధ్యాహ్నం వ్యాయామాలు చేస్తే అకాల మరణం నుంచి తప్పించుకోవచ్చని కొత్త అధ్యయనం సూచిస్తుంది. నేచర్ కమ్యూనికేషన్స్ లో ప్రచురితమైన కథనం ప్రకారం యూకే బయోమెడికల్ డేటా బెస్ దాదాపు 92వేల మంది జనాభా డేటాను పరిశీలించింది. వారికి యాక్సిలెరోమీటర్లు ఇచ్చారు. కొన్ని సంవత్సరాల తర్వాత వారి రికార్డులను పరిశీలించారు.


దాదాపు 3000 మంది చనిపోగా, వెయ్యి మంది గుండె జబ్బులు, 1800 మంది క్యాన్సర్ బారిన పడ్డారు. ఇతరులతో పోలిస్తే మధ్యాహ్నం పూట వ్యాయామం చేసే వారి ఆయుష్హు పెరుగుతుంది. ఈ అధ్యయనం ప్రకారం మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి అర్థరాత్రి వరకు, ఉదయం 5 నుంచి 11 గంటల వరకు వ్యాయామం చేశారు. మధ్యాహ్నం వ్యాయామం చేసిన్ వారిలో గుండె జబ్బుల వల్ల వచ్చే మరణం చాలా తక్కువగా ఉందని గుర్తించారు. వ్యాయామంతో పాటు రోజు మొత్తం మీద శారీరక శ్రమ చేస్తున్న వారిలో గుండె జబ్బులు, క్యాన్సర్ వల్ల చనిపోయే ప్రమాదం తక్కువగా ఉంది.


ఉదయం, మధ్యాహ్నం వ్యాయామం వల్ల ప్రయోజనాలు


వ్యాయామం చేయడానికి అనువైన సమయం మీరు పెట్టుకునే లక్ష్యం మీద ఆధారపడి ఉంటుంది. పొద్దున్నే వ్యాయామం చేయడం వల్ల బొడ్డు దగ్గర కొవ్వు కరుగుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. అదే మధ్యాహ్నం చేస్తే కండరాలు బలంగా మారి మానసిక స్థితి మెరుగుపడుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం పొద్దున్నే ఎక్సర్ సైజ్ చేయడం చాలా సులభం. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత చేసే వర్కౌట్ల కంటే ఉదయం చేసే వ్యాయామాలు బరువు తగ్గడానికి సహాయపడతాయి.


మధ్యాహ్నం, సాయంత్రం వ్యాయామాల వల్ల లాభాలు


2020లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం టైప్ 2 డయాబెటిస్ ఉన్న 32 మంది పురుషులని పరిశోధకులు పరిశీలించారు. మధ్యాహ్నం వర్కౌట్ చేయడం వల్ల వారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించబడ్డాయి. అలాగే పొద్దునే ఎక్సర్ సైజ్ చేయడంతో పోలిస్తే రాత్రి వేళ వ్యాయామం చేసిన్ వారిలో షుగర్ లెవల్స్ అదుపులో ఉండటంతో పాటు చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గినట్టు గుర్తించారు. ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటే సమయంతో సంబంధం లేకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. రక్తపోటు తగ్గించి ఎక్కువ కాలం జీవించడానికి సహకరిస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: మధుమేహులు ఒంటె పాలు తీసుకోవచ్చా? వాటి ఖరీదు తెలిస్తే నోరెళ్ళబెట్టాల్సిందే!