Amaravati Land Case: అమరావతి భూముల కేసులో సీఐడి మరోసారి విచారణ వేగవంతం చేసింది. మాజీ మంత్రి నారాయణ కుమార్తె ఇంట్లో సోదాలు చేస్తోంది. హైదరాబాద్‌లోని నివాసం ఉంటున్న ఆమె ఇంట్లో సీఐడీ అధికారులు ఈ ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్నారు. 


ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని ప్రకటించడంతో అప్పటి మంత్రిగా ఉన్న నారాయణ అక్రమాలకు పాల్పడ్డారని ఏపీ ప్రభుత్వం అనుమానిస్తోంది. అందుకే సీఐడీ విచారణ చేస్తోంది. విచారణలో భాగంగా సీఐడీ అధికారులు గతంలోనే నారాయణతోపాటు పలువురు ఇళ్లలో తనిఖీలు చేశారు ఇప్పుడు నారాయణ కుమార్తె ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, కొండాపూర్‌, గచ్చిబౌలిలో ఉన్న ఆమె ఇళ్లలో సోదాలు చేస్తున్నారు అధికారుల. 


అమరావతిలో అసైన్డ్ ల్యాండ్స్ అమ్మకాలు , కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ 2020లో సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబు, నారాయణ పేర్లను కూడా చేర్చారు. ఆ కేసుపై తాజాగా గతేడాది ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. రాజధాని అసైన్డ్‌భూముల వ్యవహారంలో వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి  ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ పోలీసులు చంద్రబాఋ, నారాయణలపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంతోపాటు ఏపీ అసైన్డ్‌ భూముల చట్టం, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.  ద‌ర్యాప్తున‌కు రావాలంటూ నోటీసులు అంద‌జేశారు. దీనిపై కోర్టు స్టే ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ చ‌ట్టం కింద కేసు న‌మోదు చేయాలంటే ద‌ళితులే ఫిర్యాదు చేయాలి. కానీ థ‌ర్డ్ పార్టీ కింద కేసు న‌మోదు చేశారు. అప్పుడే ఈ అంశంపై దుమారం రేగింది.