అప్పుడప్పుడూ మనసులో ఏదో నలతగా ఉంటుంది. మూడ్ చెడిపోతుంది. ఏ పని చేయబుద్ధి కాదు. రోజులు, వారాల తరబడి ఇదే పరిస్థితి ఉందంటే మీరు.. తప్పకుండా దానిపై దృష్టి పెట్టాల్సిందే. ఎందుకంటే.. కొన్ని రకాల ఆహారాలు, పానీయాల వల్లే మూడ్ చెడిపోతుందట. వాటికి దూరంగా ఉంటే.. అన్నీ సర్దుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.


రోజువారీ జీవన విధానంలో ఒత్తిడి వల్ల చిరాకు, మనసు బాగోకపోవటం కొంత స్థాయి వరకు సహజమే. కానీ, అస్తమానూ, చిరాకు పడటం, నీరసపడిపోవటం మనకే కాదు, మన చుట్టూ ఉన్నవారికి కూడా ఇబ్బంది కలిగిస్తుంటుంది. దీనికి కొన్నిసార్లు మానసిక ఆరోగ్యం కారణం అవుతుంటుంది. ఇంకొన్ని సార్లు మన ఆహారపు అలవాట్లు కారణమవుతుంటాయి. అలాంటపుడు, మనం తీసుకునే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే నిపుణుల సహాయం లేకుండానే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.


మీ మనసు బాగోలేకపోవటానికి ఇవి కారణం కావొచ్చు:


1. మీ జీర్ణక్రియ


మీ జీర్ణవ్యవస్థ పనితీరు మీ మానసిక స్థితి మీద ప్రభావం చూపుతుంది. జీర్ణకోశంలో ఉండే సూక్ష్మజీవులు(గట్ మైక్రొబయోం) మన పుట్టుక నుంచే తల్లిపాలు, జన్యు సంబంధమైన కారణాల వల్ల ప్రభావితం అవుతాయి. ఇవి రోగ నిరోధక శక్తికి , జీర్ణ వ్యవస్థకు, మెదడుపై ప్రభావం చూపుతాయి. జీర్ణక్రియలో పాల్గొనే సూక్ష్మజీవులు తగ్గినపుడు మనల్ని హుషారుగా ఉంచటంలో ప్రధాన పాత్ర పోషించే సెరటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది.


2. మీ మార్నింగ్ రొటీన్


మీరు మీ రోజును ఏ విధంగా మొదలుపెడుతారో దాని ప్రభావం ఆ రోజంతా ఉంటుంది. ఉరుకులుపరుగులతో హడావిడిగా మొదలుపెడితే, శరీరంలో ఒత్తిడి పెంచే కార్టిసోల్ అనే హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. పొద్దున్నే ఫోన్ చెక్ చేసుకోవటం, వార్తలు చదవటం లేదా సోషల్ మీడియా చూస్తుండటం వల్ల ఇది జరుగుతుంది. అలా కాకుండా మనసును ప్రశాంతంగా ఉంచే యోగా, మెడిటేషన్ లాంటి వాటి వల్ల రోజంతా ఒత్తిడి లేకుండా ఉంటుంది.


3. మీ దినచర్య


మీరు రోజు ఒకే టైంకు నిద్రపోవటం, ఒకే సమయానికి నిద్ర లేవటం, ఒకే సమయానికి తినటం అలవాటు చేసుకుంటే, మీ శరీరం అదే సమయాన్ని ఫాలో అవుతుంది. అలా కాకుండా రోజుకొక సమయంలో తిని, రోజుకొక సమయంలో నిద్ర పోవటం వల్ల శరీరం యొక్క సర్కాడియన్ రిథం మార్పులకు గురి అవుతుంటుంది. దీని వల్ల ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి.


4. కాఫీ ఎక్కువగా తీసుకోవటం


చాలామందికి పొద్దున కాఫీతో రోజు మొదలుపెట్టే అలవాటు ఉంటుంది. కానీ, పరగడుపున కాఫీ తాగటం వల్ల ఒత్తిడిని పెంచే హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. మాటిమాటికీ కాఫీ తాగటం కూడా మంచిది కాదు. ఆహారం తీసుకున్న తర్వాత కాఫీ తాగితే దాని ప్రభావం తక్కువగా ఉంటుంది. కాఫీ యాంక్జైటీకి ఒక కారణం అని పరిశోధనలు చెప్తున్నాయి.


ఇవే కాకుండా, చక్కెర పదార్థాలు అధికంగా తీసుకోవటం, నీళ్లు సరిగ్గా తాగకపోవటం, ఉద్యోగం చేసే చోటు ఒత్తిడితో కూడి ఉండటం, ఎక్కువసేపు ఫోన్లోనే సమయం గడపటం, జీవితంలో ఒక లక్ష్యం లేకపోవటం, ఆర్థిక ఇబ్బందులు, మీ ఆలోచనా విధానం ఇవన్నీ మీ మూడ్ మీద ప్రభావం చూపిస్తాయి.


ఇవి డిప్రెషన్ సూచనలు:


1. ఎప్పటిలా కాకుండా సరిగా తినకపోవటం, సరిగా నిద్రలేకపోవడం.
2. ఎప్పుడూ నీరసంగా ఉండటం.
3. అతిగా ధూమపానం, మధ్యపానం.
4. రోజువారి పనులు చేయటానికి ఉత్సాహం లేకపోవటం.
5. ఎవరితోనూ మాట్లాడాలనిపించకపోవటం.
6. చికాకుగా ఉండటం.


Also Read: నిశ్చితార్థానికి, పెళ్లికి ఇంత  మార్పా? అనంత్ అంబానీ మళ్లీ బరువు పెరగడానికి కారణం అదేనట


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.