పిల్లలు తల్లిదండ్రులను చూసే ప్రతిదీ నేర్చుకుంటారు. వారు చెప్పే మార్గంలోనే పయనిస్తారు. కాబట్టి వారి జీవితాల్లోని ప్రతి దశను తల్లిదండ్రులు ఎంతో ప్రభావితం చేస్తారు. తమకు తెలియకుండానే తమ పిల్లలకు తల్లిదండ్రులే మార్గ నిర్దేశకులు అవుతారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉంటే వారి భవిష్యత్తు కూడా అంతే చక్కగా ఉంటుంది. చిన్నప్పటినుంచే కొన్ని రకాల పేరెంటింగ్ చిట్కాల ద్వారా వారి ప్రవర్తనను సానుకూలంగా ఉండేలా చేయవచ్చు. పిల్లలు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే... వారి ఎదుగుదల, అభివృద్ధికి పై కూడా సానుకూల ప్రభావం పడుతుంది.


మానసిక ఆరోగ్యం కోసం...
మీ పిల్లలను రోజుకి కనీసం రెండుసార్లయినా కౌగిలించుకోండి. వారి చేతులు పట్టుకొని మాట్లాడుతూ ఉండండి. ఇది తల్లిదండ్రులకు తమపై ఉన్న ప్రేమ అని పిల్లలు గ్రహిస్తారు. అలా అని ప్రేమ మితిమీరకుండా చూసుకోండి. తల్లితండ్రుల ప్రేమను పొందే పిల్లలు మానసికంగా చక్కగా ఎదుగుతారని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి.


కోపం వద్దు
 పిల్లలకు కోపం, విసుగు వంటివి రాకుండా మీరే జాగ్రత్త పడండి. పదేపదే వారిని తిట్టడం, వారిపై విసుగు చూపించడం వంటివి చేస్తే, వారు కూడా అదే ప్రవర్తనను ప్రదర్శిస్తారు. కాబట్టి వారి ఎదురుగా అరవడం, వస్తువులు విసరడం వంటివి చేయకండి. మీకు మరీ చికాకుగా అనిపిస్తే పిల్లలకు ఆటలు, పజిల్స్, సైన్స్ ప్రాజెక్టులు వంటివి ఇచ్చి ఆ పనులు చేసుకోమనండి. ఈ లోపు మీరు రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది.


ఫ్యామిలీ టైమ్
రోజులో తల్లిదండ్రులు ఇద్దరూ కనీసం అరగంటైనా మీ పిల్లలతో కలిసి గడపాలి. రోజులో కనీసం అరగంట సమయాన్ని ఫ్యామిలీ టైమ్ గా నిర్ణయించుకోండి. ఆ సమయంలో ఇతర పనులేవీ చేయకండి. అందరూ ఒకే చోట కూర్చొని ఆహ్లాదంగా గడపండి. ఇలా చేయడం వల్ల పిల్లలు తల్లిదండ్రులకు చాలా దగ్గరవుతారు. తమ మనసులోని భావాలను కూడా వ్యక్తపరుస్తారు. 


ప్రశాంతంగా ఉండండి
మీ పిల్లలు ఏదైనా విషయంలో తప్పుగా ప్రవర్తిస్తే వారి మీద తిట్లు, దెబ్బలతో విరుచుకు పడకండి. ముందు మీరు ప్రశాంతంగా ఉండండి. తర్వాత పిల్లలను దగ్గర తీసుకొని వారు చేసిన తప్పేంటో, అలా ఎందుకు చేయకూడదో వివరించండి. మీరు వారిని కొట్టడం, తిట్టడం వంటివి చేస్తే వారిలో కూడా అశాంతి పెరిగిపోతుంది.


పరిపూర్ణత దిశగా
పిల్లలు తమ జీవితాల్లో సక్సెస్ అయితేనే తల్లిదండ్రులుగా మీరు పరిపూర్ణం అయినట్టు. ఆ పరిపూర్ణతను సాధించేందుకు మీరు ఎంతో కష్టపడాలి. పిల్లల్లో నిరాశ, నిస్పృహ రాకుండా కాపాడుకోవాలి. ఎప్పటికప్పుడు వారి మనసులో ఉన్న భావాలను తెలుసుకోవాలి. వారి పరిసరాల్లో ఉన్న వ్యక్తులు వారితో ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకుంటూ ఉండాలి. స్కూల్లో వ్యవహారాలను కూడా ఎప్పటికప్పుడు వారి ద్వారా తెలుసుకొని అవగాహన పెంచుకోవాలి. దీని వల్ల మీ బిడ్డ సానుకూల వాతావరణంలో, ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నాడో లేదో మీరు అంచనా వేయవచ్చు. ఎక్కడైనా తప్పుగా అనిపిస్తే మీ బిడ్డను మీరు కాపాడుకునే అవకాశం కూడా ఉంటుంది.


బలం - బలహీనత
ప్రతి మనిషికి ఏదో ఒక బలహీనత ఉంటుంది. అలాగే మీ పిల్లలకు కూడా ఏదో ఒక బలహీనత ఉండి ఉంటుంది. అది ఏంటో మీరు కనిపెట్టండి. ఆ విషయంలో పిల్లలను ప్రోత్సహించేందుకు ప్రయత్నించండి.  అలాగే ప్రతి బిడ్డకు దేవుడు ఏదో ఒక శక్తి , సామర్థ్యం ఇస్తాడు. కొంతమంది సైన్స్ బాగా చదివితే, మరి కొందరు మ్యాథ్స్ బాగా చేస్తారు, మరికొందరు పజిల్స్ లో దూసుకెళ్తారు, పెయింటింగ్, డాన్స్ ఇలా పిల్లలకు ఏదో ఒక కళలో ఆసక్తి ఉండవచ్చు. మీరు వారిలోని ఇష్టాన్ని తెలుసుకొని ఆ రంగం వైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఇది వారి సంపూర్ణ ఎదుగుదలకు అత్యవసరం. 


Also read: కాస్మోటిక్ ఉత్పత్తుల కోసం మన భారతీయ మహిళలు ఎంత ఖర్చుపెట్టారో తెలుసా?



గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.