India Vs Bharat Controversy: దేశం పేరు ఇండియా నుంచి భారత్‌కు మార్పు రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. అధికార ఎన్డీఏ కూటమి, ప్రతిపక్ష I.N.D.I.A మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ వివాదం సద్దుమణకుముందే ఎన్డీఏ ప్రభుత్వం మరో సారి పేరు మార్పు యత్నం అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. G20 దేశాల నేతలకు రాష్ట్రపతి విందు ఆహ్వానంలో 'ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు’ బదులుగా 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' ఉపయోగించడంతో వివాదం మొదలైంది. అది సద్దుమణగక ముందే ప్రస్తుతం రగులుతున్న విషయానికి అగ్నికి ఆజ్యం పోసినట్లు మరో పత్రం వెలుగులోకి వచ్చింది. అందులో ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా’కు బదులు 'ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్’ అని ఉంది. 






బుధవారం, గురువారం ఇండోనేషియాలో 20వ ఆసియాన్-ఇండియా సమ్మిట్, 18వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు జరుగనుంది. ఇందులో భాగంగా ప్రదాని మోదీ ఇండోనేషియా పర్యటనకు వెళ్లనున్నారు. అందుకు సంబంధించిన నోట్‌లో ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా’కు బదులు 'ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్’ అని ఉంది. దీనిని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర సోషల్ మీడియా ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేశారు. 






దానిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ విమర్శలు ఎక్కుపెట్టారు. 'ఆసియాన్-ఇండియా సమ్మిట్', 'ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్' అని రాయడంలో ‘‘మోదీ ప్రభుత్వం ఎంత గందరగోళంలో పడిందో చూడండి! ప్రతిపక్షాల పేరును I.N.D.I.A అని పిలవడం వల్లే మోదీ ఇదంతా డ్రామా ఆడుతున్నారు' అని సోషల్ మీడియా ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేశారు. 


ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాష్ట్రపతి నుంచి G20 ఆహ్వానం వెలువడినప్పడి నుంచి బీజేపీ దేశం పేరు మార్చేందుకు యత్నిస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇందుకోసమే సెప్టెంబర్ 18-22 మధ్య పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. ప్రత్యేక సమావేశాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఎజెండాను ప్రకటించకపోవడం ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. 


దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 28 పార్టీల కూటమిని ‘I.N.D.I.A’ అని వల్లే దేశం పేరును భారత్‌గా మారుస్తోందని మండిపడ్డారు. తమ కూటమి పేరును 'భారత్'గా మార్చాలని నిర్ణయించుకుంటే కేంద్రం ఏం చేస్తుందంటూ ప్రశ్నించారు. ‘విపక్షాలు కూటమిగా ఏర్పడి I.N.D.I.A అని పేరు పెట్టుకుంటే కేంద్రం దేశం పేరు మారుస్తుందా? దేశం ఒక్క పార్టీకి కాదు 140 కోట్ల మంది ప్రజలది. కూటమి పేరును భారత్‌గా మార్చేస్తే, వారు భారత్ పేరును బీజేపీగా మారుస్తారా?’ అని ఆప్ చీఫ్ ప్రశ్నించారు.


అయితే ఇండియాను భారత్‌గా పిలవడంపై పలువురు బీజేపీ నేతలు ఆహ్వానించారు. రాష్ట్రపతి ఆహ్వానంలోని పదాలు తనకు గర్వకారణంగా ఉన్నాయని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ట్వీట్ చేశారు. ‘రిపబ్లిక్ ఆఫ్ భారత్’  మన నాగరికత అమృత్ కల్ వైపు ధైర్యంగా ముందుకు సాగుతున్నందుకు సంతోషంగా, గర్వంగా ఉంది" పోస్ట్ చేశారు. పలువురు బీజేపీ నాయకులు 'భారత్' వాడకాన్ని స్వాగతించారు. అదే సమయంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. దేశ గౌరవం, ప్రతిష్టకు సంబంధించిన ప్రతి అంశంపై కాంగ్రెస్, విపక్షాల కూటమి అభ్యంతరం చెబుతోందని మండిపడ్డారు.