BJP Fires: మోదీ నాయకత్వంలోని బీజేపీ పార్టీ దేశం పేరును మార్చబోతోందని కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. జీ20 సదస్సు ఆహ్వాన పత్రికల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొనడంతో ఈ వివాదం మొదలైంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో దేశం పేరు మార్పు బిల్లును ప్రవేశపెడతారన్న ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. అయితే.. బీజేపీ చర్యను తీవ్రంగా తప్పుబడుతున్నాయి ప్రతిపక్ష పార్టీలు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా కేంద్ర ప్రభుత్వ చర్యలను ఎండగట్టే ప్రయత్నం చేసింది.


భారత రాజ్యాంగ ప్రవేశిక కాపీపై ఉండే ఇండియా పేరును మోదీ వేషాధారణలో ఉన్న కార్టూన్ క్యారెక్టర్ తుడిచేస్తుంది. ఈ వ్యంగ్య కార్టూన్ ను కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేసిందని, అయితే అందులోని భారత రాజ్యంగ ప్రవేశిక(Preamble Of Indian Constitution) తప్పు అని, అందులో అక్షర దోషాలు ఉన్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ట్వీట్ లోని ప్రవేశికలో ఉన్న తప్పులను మార్క్ చేస్తూ.. హస్తం పార్టీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ ప్రవేశిక గురించి కాంగ్రెస్ పార్టీకి తెలియదని మండిపడ్డారు. భారత రాజ్యాంగమన్నా, బీఆర్ అంబేడ్కర్ అన్నా కాంగ్రెస్ కు గౌరవం లేదని ఆరోపించారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ నుంచి గొప్పగా ఏమీ ఆశించలేమని ఎద్దేవా చేశారు.


'భారత రాజ్యాంగ ప్రవేశిక గురించి కూడా తెలియని కాంగ్రెస్ నుంచి ఏమైనా ఆశించగలమా. కాంగ్రెస్ = రాజ్యాంగం, డాక్టర్ అంబేడ్కర్ పట్ల గౌరవం లేకపోవడం. షేమ్‌ఫుల్‌!' అని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. 






జీ20 సదస్సు ఆహ్వానాలతో మొదలైన వివాదం


జీ 20 సదస్సు నేపథ్యంలో సెప్టెంబరు 9వ తేదీన రాష్ట్రపతి భవన్‌లో డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ డిన్నర్‌కు ఆహ్వానిస్తూ పంపిన ఆహ్వాన పత్రికల్లో ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా' కు బదులుగా 'ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌' అని రాశారని కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ ట్వీట్‌ చేశారు. ప్రభుత్వం ఇలా రాయడంపై వివాదం చెలరేగింది. త్వరలో దేశం పేరు ఆంగ్లంలో కూడా భారత్‌గా మారే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వస్తున్నాయి. 


కాంగ్రెస్‌ పార్టీకి కూడా ఆహ్వానం అందడంతో ఆహ్వాన పత్రికను ట్విట్టర్‌లో షేర్‌ చేసి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఈ అంశంపై జైరాం రమేష్‌ ట్వీట్‌ చేస్తూ..రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 1 ప్రకారం.. 'భారత్‌, అది ఇండియా, అది రాష్ట్రాల యూనియన్‌' అని ఉందని ఇప్పుడు యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌పై దాడి జరుగుతోందని ఆయన ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ చరిత్రను వక్రీకరిస్తున్నారని, ఇండియాను విడదీస్తున్నారని, అదే భారత్‌ అని, అదే యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌ అని, కానీ మేము అడ్డుకోలేమని జైరాం రమేష్ పేర్కొన్నారు. అలాగే I.N.D.I.A కూటమి లక్ష్యం ఏంటంటే.. BHARAT అని పేర్కొన్నారు. BHARAT అంటే.. బ్రింగ్‌ హార్మొని, అమిటీ, రీకాన్సిలేషన్‌ అండ్‌ ట్రస్ట్‌ అని తెలిపారు. జూడేగా భారత్‌, జీతేగా ఇండియా అని ట్వీట్‌ చేశారు.