ప్రపంచంలో ఎన్నో దొంగతనాలు జరుగుతుంటాయి.  వాటిల్లో అధికంగా దోపిడీకి గురయ్యేది ఏదో తెలుసా? బంగారమో, వజ్రాలో, వెండి వస్తువులో, డబ్బులో అనుకుంటున్నారా? కాదు, చీజ్. పాలతో చేసే చీజ్ అధికంగా దొంగతనానికి గురవుతోంది. తాజాగా నెదర్లాండ్స్ లోని ఓ షాపు నుంచి రూ.17 లక్షల విలువ చేసే చీజ్ ను ట్రక్కుల్లో ఎత్తుకెళ్లిపోయారు. ఆ చీజ్ బరువు 1600 కిలోలు. ఆ చీజ్ స్టోరేజ్ యజమాని మాట్లాడుతూ ‘స్టోరేజ్ లో ఉన్న చీజ్‌నంతా ఎత్తుకెళ్లి పోయారు. ఆ చీజ్ ప్యాకేజ్‌లపై ప్రత్యేకమైన కోడ్‌లు ఉంటాయి. వాటిని నెదర్లాండ్స్ లో అమ్మడానికి వీలుకాదు. అంతేకాదు ఆర్ధిక ఆంక్షల కారణంగా రష్యాలో చీజ్ కొరత ఏర్పడింది. అక్కడ చీజ్ అవసరం చాలా ఉంది’ అని చెప్పుకొచ్చాడు. ఆయన చెప్పినదాన్ని బట్టి దొంగిలించిన చీజ్ రష్యా చేరే అవకాశం ఉంది. 


ఇక్కడ చీజ్ దొంగతనాలు కొత్త కాదు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ ఉత్పత్తిని దొంగిలిస్తూనే ఉన్నారు. దొంగిలించిన చీజ్‌ను ఆన్ లైన్లో అమ్మే అవకాశాలు కూడా ఉన్నాయి. గతేడాది దొంగిలించిన చీజ్ ఆన్ లైన్లో అమ్మే ప్రయత్నాలు జరిగాయి. కానీ వారిని వెంటనే పట్టుకున్నారు పోలీసులు. కొన్ని దేశాల్లో చీజ్ దొంగతనాలను చాలా సీరియస్ గా తీసుకుంటున్నాయి స్థానిక ప్రభుత్వాలు,పోలీసులు. కొంతమంది తమ సొంత అవసరాల కోసం చీజ్ ను దొంగిస్తుంటే, మరికొందరు బ్లాక్ మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకోవడం కోసం దోపిడీలకు పాల్పడుతున్నారు.


చీజ్ మార్కెట్ మామూలుది కాదు
చీజ్‌ను మనం తక్కువగానే వాడుతున్నాం, కానీ పాశ్చాత్య దేశాల్లో అది అత్యవసరమైన ఆహారం. డైరీ ఇండస్ట్రీస్ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా చీజ్ అమ్మకాలు 114 బిలియన్ డాలర్లను మించి ఉంది. అంటే కొన్ని వందల కోట్ల రూపాయలన్న మాట. ఏడాదిలో ఉత్పత్తి చేసిన మొత్తం చీజ్‌లో 4 శాతం దొంగతనానికి గురవుతోంది. హఫింగ్టన్ పోస్టు ప్రకారం 43 దేశాల్లో 2,50,000 కంటే ఎక్కువ రిటైల్ అవుట్ లెట్లు చీజ్ ను అమ్ముతున్నాయి. చీజ్ ను అధికంగా వాడుతున్న దేశం అమెరికానే. 25 బిలయన్ల విలువైన జున్ను ఏటా అమెరికా వినియోగిస్తోంది. 


చీజ్ తరువాత...
ప్రపంచంలో అత్యధికంగా దొంగతనానికి గురవుతున్న ఉత్పత్తుల్లో చీజ్ మొదటిది కాగా, తరువాతి స్థానాల్లో మీట్, చాక్లెట్, ఆల్కహాల్, సీఫుడ్, బేబీ ఫార్మలా పాల పొడి ఉన్నాయి. 


Also read: దోమలు పెరిగిపోతున్నాయా? ఇంటి ముంగిట్లో ఈ మొక్కలు పెంచండి,



Also read: అప్పటికప్పుడు వేసుకునే ఇన్‌స్టెంట్ దోశ రెసిపీ, కొబ్బరి చట్నీతో అదిరిపోతుంది