అధికశాతం మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్య హైబీపీ. దీన్ని సైలెంటి కిల్లర్ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ సమస్య వచ్చినా కూడా దాని లక్షణాలు బయటికి కనిపించవు. అందుకే దానికి ఆ పేరు వచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన ప్రకారం 30 నుంచి 79 ఏళ్ల మధ్య ఉన్న 128 కోట్ల  మంది పెద్దలు హైబీపీతో బాధపడుతున్నారు. వీరందరికీ ఇతర ఆరోగ్య సమస్యలు దాడి చేసే అవకాశం కూడా ఎక్కువే. శరీరంలోని ప్రధాన రక్తనాళాలు ఇరుకుగా మారినప్పుడు రక్తపోటు పెరుగుతుంది. రక్తం రక్తనాళాల గోడలను అతి వేగంగా ఢీ కొడుతూ ప్రవహిస్తుంది. దీని వల్లే హైబీపీ వస్తుంది. హైబీపీని సకాలంలో గుర్తించి మందులు వాడకపోతే ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుంది. అధికరక్తపోటును సమర్థవంతంగా ఎదుర్కొడానికి కొన్ని రకాలా ఆహారాలు కూడా ఉన్నాయి. 


అధిక ఫైబర్ వల్ల
అధిక రక్తపోటు తగ్గించే అత్యంత సులువైన మార్గం ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. ఫైబర్ ధమనులలో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. తద్వారా శరీరం అంతంటా రక్తం ఆరోగ్యకరమైన పద్ధతిలో ప్రవహిస్తుంది. అదనపు కేలరీలు లేకుండా ఎనర్జీ స్థాయిలు పెంచడంలో కూడా ఫైబర్ ఉపయోగపడుతుంది. క్యారెట్లు,  యాపిల్స్, బీట్ రూట్లు, ముల్లంగి, అరటిపండ్లు వంటి వాటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అరటిపండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో ఈ ఖనిజం ఉపయోగపడుతుంది. పొటాషియం మూత్రపిండాల వ్యవస్థ నుంచి అదనపు సోడియంను బయటకు పంపేందుకు కూడా ఉపయోగపడుతుంది. అధిక సోడియమే అధిక రక్తపోటుకు కారణం కాబట్టి అదే బయటికి పోతే సమస్య తగ్గుముఖం పడుతుంది. 


పెరుగు 
అధిక రక్తపోటును తగ్గించడానికి మంచి ప్రత్యామ్నాయ ఆహారం పెరుగు. ఇందులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం నిండుగా ఉంది. రక్తపోటుతో బాధపడుతున్న వారికి పెరుగు చాలా అవసరం. మెగ్నీషియం రక్తనాళాలను సడలించి, రక్తప్రవాహం సజావుగా సాగేలా చేస్తుంది. తద్వారా రక్తపోటును నియంత్రిస్తుంది.అంతేకాదు రక్తంలో చక్కెర స్థాయులను కూడా నియంత్రించేందుకు సహాయపడుతుంది. 


ఇంద్రధనుస్సు రంగుల్లో
హైబీపీ బాధపడుతున్న వారి ఆహారం ఇంద్రధనుస్సు రంగుల్లో ఉండాలి. అంటే అన్ని రంగుల ఆహారాన్ని తినాలి. టమాటాలు, క్యారెట్, కివీస్, బెర్రీలు, పాలకూర, బచ్చలికూర, ఇతర తాజా కూరగాయలు... ఇవన్నీ తింటే ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు. 


ఇంకా ఎన్నో...
పోషకాలుండే ఆహారాలు తినడంతో పాటూ ట్రాన్స్ ఫ్యాట్ లు, ప్రాసెస్డ్ ఫుడ్, షుగర్ ఫుడ్ తినకపోవడం, ఎనిమిది గంటల నిద్ర, రోజుకు అరగంట పాటూ నడక చేస్తే హైబీపీ కంట్రోల్ లో ఉండడమే కాదు గుండెకు కూడా చాలా మంచిది. హైబీపీతో బాధపడుతున్న వారు ఆల్కహాల్, ధూమపానాన్ని పూర్తిగా మానివేయాలి. 


Also read: అప్పటికప్పుడు వేసుకునే ఇన్‌స్టెంట్ దోశ రెసిపీ, కొబ్బరి చట్నీతో అదిరిపోతుంది


Also read: ప్రపంచంలో ఎక్కువమంది ఇష్టపడే వాసన ఇదేనట, మీకు కూడా నచ్చుతుందేమో చూడండి